Saturday, July 5, 2025

బాధితులకు కోటి పరిహారం

- Advertisement -
- Advertisement -

సిగాచి పేలుడు ఘటనకు యాజమాన్యానిదే బాధ్యత ప్రమాదంపై సమగ్ర
విచారణకు ఉన్నతాధికారులతో కమిటీ యాజమాన్యంతో చర్చించి
పరిహారం ఇప్పిస్తా అంగవైకల్యం పొందిన వాళ్లకు రూ.10లక్షలు,
స్వల్పంగా గాయపడిన వారికి రూ.5లక్షల పరిహారం ప్రభుత్వ
వ్యయంతో క్షతగాత్రులకు చికిత్స పేలుడుస్థలిని పరిశీలించిన
అనంతరం సిఎం రేవంత్‌రెడ్డి యాజమాన్యం తీరుపై ఆగ్రహం
సుమోటోగా స్వీకరించిన హెచ్‌ఆర్‌సి సిగాచి ఫ్యాక్టరీపై కేసు నమోదు

మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో : దేశ చరిత్రలోనే పాశమైలారం దుర్ఘటన అత్యంత విషాదకరమని, దీనికి సంబంధిత కంపెనీ యాజమాన్యానిదే బాధ్యత అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బాధిత కుటుంబాలను మానవతా దృ క్పథంతో అన్నివిధాలుగా ఆదుకుంటామని భరో సా ఇచ్చారు. పాశమైలారంలో రియాక్టర్ పేలిన సిగాచీ కంపెనీని ఆయన మంగళవారం ఉద యం పరిశీలించారు. ఆసాంతం కలియతిరిగా రు. ప్రతి స్పాట్ గురించి జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఇతర అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత అక్కడే సుమారు గంటకు పైగా సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..

సంఘటన స్థలానికి వచ్చిన సందర్భంగా ఒక మహిళను తనను కలిసిందని, ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడని, ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి అని, డ్యూటీకి వచ్చిన తన భర్త ఏమయ్యాడో తెలియడం లేదని వాపోయిందని అన్నారు. ఇలాంటి మనసు కలిచివేసే అనేక హృదయ విదారక దృశ్యాలు సంఘటనా స్థలంలో ఉన్నాయని పేర్కొన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి బాధితులను ఆదుకుంటామని ప్రకటించారు. దుర్ఘటన గురించిన తెలిసిన దగ్గర నుంచి నష్టనివారణకు, బాధితులను ఆదుకునేందుకు తమ మంత్రులు, యంత్రాంగం ప్రయత్నిస్తున్నామని అన్నారు. తానే స్వయంగా దుర్ఘటన స్థలానికి వచ్చానంటే, ఈ ఘటనను తమ ప్రభుత్వం ఎంత సీరియస్‌గా ఉందో గుర్తించాలని అన్నారు.

ఇక్కడ ఎక్కువగా బీహార్, ఎంపి, ఎపి, ఒడిశా ప్రాంతాలకు చెందినవారు పని చేస్తున్నట్టు తెలిసిందని అన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చించి, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు, వికలత్వం సంభవించి విధులకు వెళ్లలేని వారికి రూ.10 లక్షలు, స్వల్పంగా గాయపడి పని చేసుకోగలిగిన వారికి ఐదేసి లక్షలు పరిహారం అందేలా చూస్తామని అన్నారు. ఈ దుర్ఘటనలో క్షతగాత్రులకు అయ్యే వైద్య ఖర్చులన్నీ నూటికి నూరు శాతం తమ ప్రభుత్వం భరిస్తుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుబాల్లోని పిల్లలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యను అందిస్తామని తెలిపారు. తక్షణ సాయంగా మృతుల కుటుంబాలకు రూ. లక్ష, గాయపడిన వారికి రూ.50 వేలు జిల్లా కలెక్టర్ నిధుల నుంచి ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఘటనకు బాధ్యులను గుర్తించేందుకు సమగ్ర విచారణకు ఇప్పటికే ఆదేశించామని అన్నారు. దీనికోసం ఉన్నతాధికారులతో ఒక కమిటీని నియమించామని తెలిపారు. సంఘటన జరిగిన సమయంలో మొత్తం 143 మంది విధుల్లో ఉన్నారని, వారిలో 36 మంది ఇప్పటివరకు చనిపోయినట్లు తేలిందని అన్నారు. శిథిలాల్లో ఇంకా ఎవరైనా ఉన్నారా ? బయటికి వెళ్లారా అనే అంశంపై గుర్తిస్తున్నారని చెప్పారు. ఈ ప్రమాదాన్ని తమ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందని తెలిపారు.

యాజమాన్యం తీరుపై సిఎం ఆగ్రహం
అంతకుముందు ఫ్యాక్టరీ ఆవరణలో జరిపిన సమీక్షలో ప్రమాదం ఎలా జరిగిందని సిఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. డిఎన్‌ఎ పరీక్షల ద్వారా గుర్తించిన మృతదేహాలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బంధువులకు ఆప్పగించాలని సూచించారు. ప్రమాదం జరిగిన సమయంలో తనిఖీలు నిర్వహించారా? బాయిలర్లు తనిఖీ చేసి ఏదైనా సమస్యలను గుర్తించారా? అదేవిధంగా బాయిలర్ల పనితీరుపై యాజమాన్యానికి చెప్పారా? అని అడిగారు.

ఇదే పరిశ్రమలో గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగాయా? అని ప్రశ్నించారు. అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో…ఊహాజనిత సమాధానాలు చెప్పవద్దని వార్నింగ్ ఇచ్చారు. చనిపోయిన కార్మికులకు ఏమైనా బీమా ఉన్నదా? అని అడిగారు. ప్రమాదం జరిగి 24 గంటలు దాటినా కంపెనీ యాజమాన్యం ఘటనా స్థలికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇప్పటివరకు బాధితులకు ఏమి భరోసా ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ఇతర పరిశ్రమల్లోనూ తనిఖీలు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వివేక్, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎంఎల్‌ఎ మహీపాల్‌రెడ్డి, కార్పొరేషన్ ఛైర్మన్లు నిర్మలాజగ్గారెడ్డి, ఫహీం, జిల్లా ఎస్‌పి పరితోష్ పంకజ్, పార్టీ నాయకులు నీలం మధు ముదిరాజ్, కాటా శ్రీనివాస్‌గౌడ్, గాలి అనరిల్ కుమార్, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News