కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు 20 రోజులుగా చిక్కుకుపోయిన బ్రిటీష్ రాయల్ నేవీకి చెందిన ఎఫ్ -35 ఫైటర్ జెట్ ను బ్రిటన్ కు తరలించడం పెద్ద సమస్యగా మారింది. జూన్ 14న అత్యవసరపరిస్థితుల్లో కేరళలో విమానం ల్యాండ్ అయింది. అప్పటి నుంచి ఆ ఫైటర్ జెట్ కు మరమ్మతలు చేసి గాలిలో ఎగిరేటట్లు చేసేందుకు అనేక ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. బ్రిటీష్ రాయల్ నేవీకి చెందిన ఎఫ్-35 ఫైటర్ జెట్ ను విడివిడి భాగాలుగా విడదీసిన తర్వాత భారీ లిఫ్ట్ కార్గో విమానంలో దానిని తిరిగి బ్రిటన్ కు తీసుకువెళ్లడమే ఏకైక పరిష్కారంగా భావిస్తున్నారు. అందుకోసం 40 మంది సాంకేతిక నిపుణుల బృందం జూలై 5న లండన్ నుంచి భారతదేశానికి చేరుకుంటుందని భావిస్తున్నారు.
హెచ్ ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కారియర్ స్ట్రైక్ గ్రూప్ కు చెందిన ఎఫ్-35 బి విమానం కేరళ తీరానికి 100 నాటికల్ మైళ్ల దూరంలో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా ప్రతికూల వాతావరణం, ఇంధనం తక్కువగా ఉండడంతో తిరువనంతపురంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. భారత వైమానిక దళం ఈ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు తోడ్పడడమే కాక, ఇంధనం నింపి, తిరిగి ఎగిరడానికి అవసరమైన సహాయం అందించింది. కానీ, ఎన్ని ప్రయత్నాలు చేసిన విమానం ముందుకు కదలలేదు. జూన్ 14 నుంచి అక్కడే తిష్టవేసింది. తనిఖీలలో హైడ్రాలిక్ వైఫల్యం బయటపడింది. ఇదీ తీవ్రమైన సమస్య. జెట్ సురక్షితంగా టేకాఫ్,ల్యాండ్ అయ్యే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ తర్వాత చిన్న రాయల్ నేవీ బృందం ఈ లోపాన్ని సవరించడానికి ప్రయత్నిచినా ఫలించలేదు. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ నుంచి నిపుణులు వస్తున్నారు.