గాజా స్ట్రిప్ : ఇజ్రాయెల్ భీకర దాడులతో గాజాలో దుర్భర పరిస్థితులు తలెత్తాయి. అక్కడి ప్రజల పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోయింది. మరోవైపు హమాస్ చెరలోఉన్న ఇజ్రాయెల్ బందీలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇటీవల అక్కడి బందీలకు సంబంధించిన పలు దృశ్యాలు, వీడియోలు బయటకు వచ్చాయి. వాటిలో ఇజ్రాయెలీలు ఎముకల గూళ్లుగా మారిన శరీరాలతో దారుణ స్థితిలో కనిపించడంపై ఆ దేశ ప్రధాని నెతన్యాహు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హమాస్ చెరలోని తమ బందీలకు మానవతా సాయం అందేలా చూడాలని రెడ్‌క్రాస్ సంస్థను కోరారు. ఇన్నాళ్లు ఇజ్రాయెల్ బందీలను తీవ్ర హింసలకు గురిచేసిన హమాస్ సైతం ఈ విషయంలో కొంతవరకు మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ తమ షరతులకు అనుగుణంగా వ్యవహరిస్తే తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్ బందీలకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటన విడుదల చేసింది.
అయితే ఈ సహాయాన్ని అందించడానికి కేవలం అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీని మాత్రమే అనుమతిస్తామని వెల్లడించింది. అయితే దీనిని కొనసాగించాలా వద్దా అనే విషయం ఇజ్రాయెల్ మానవతా కారిడార్లను తెరవడం, ద్వారా ప్రజలకు మానవతా సాయం అందిస్తున్న సమయంలో వైమానిక దాడులను ఆపడం వంటి వాటిపై ఆధారపడుతుందని తెలిపింది. ఇజ్రాయెల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… ప్రస్తుతం 50 మంది పౌరులు హమాస్ వద్ద బందీలుగా ఉన్నారు. వీరిలో30 మంది మాత్రమే ప్రాణాలతో ఉన్నట్టు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా చేసుకున్న నాటి నుంచి నేటి వరకు మానవతా సంస్థలు వారిని సంప్రదించకుండా హమాస్ నిషేధించింది. దీంతో వారి పరిస్థితి గురించి అధికారులకు గానీ కుటుంబ సభ్యులకు గానీ ఎటువంటి సమాచారం లేదు.
ఈ నేపథ్యంలో నిర్బంధంలో ఉన్న బందీల పరిస్థితిని వివరిస్తూ హమాస్ ఇటీవల కొన్ని వీడియోలు విడుదల చేసింది. ఓ భూగర్భ సొరంగంలో బందీగా ఉన్న యువకుడు ఎవ్యతార్ డేవిడ్ (24) బక్కచిక్కిన శరీరం, మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్నట్టు ఓ వీడియోలో కనిపించింది. తాను ఎదుర్కొంటున్న దీన స్థితిని వివరిస్తూ రోజురోజుకూ నా శరీరం క్షీణిస్తోంది. కుటుంబంతో గడిపే పరిస్థితి కనిపించడం లేదు. విడుదలకు సమయం మించిపోతోంది. నా సమాధిని నేనే తవ్వుకుంటున్నా” అని పేర్కొన్నారు. ఈ వీడియోపై ఫ్రాన్స్, జర్మనీ, యూకే, అమెరికా వంటి దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. గాజాలో బందీల పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మంగళవారం ఉదయం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించింది.