ఢిల్లీ దద్ధరిల్లేలా మహా ధర్నా
హస్తిన బయలుదేరిన కాంగ్రెస్ నేతలు
రిజర్వేషన్లపై జంతర్ మంతర్ వద్ద మూడు రోజులు ఆందోళన
ప్రత్యేక రైలుకు పిసిసి చీఫ్, మంత్రి పొన్నం పచ్చ జెండా
మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః బిసి రిజర్వేషన్ల సాధనే లక్షంగా కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు హస్తినలోనూ మహా ధర్నా నిర్వహించాలని సంకల్పించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక రైలు సోమవారం బయలుదేరింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ఉదయం చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక రైలుకు పచ్చ జెండా ఊపారు. ఈ ప్రత్యేక రైలులోనే కాంగ్రెస్ నాయకురాలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా వెళ్ళడం గమనార్హం. కాగా సోమవారం సాయంత్రం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉండడం వల్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులూ మంగళవారం ఢిల్లీ వెళ్ళనున్నారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైలులో ఆలేరు వరకు వెళ్ళి వెనుదిరిగారు. మహేష్ కుమార్ గౌడ్ కూడా రైలులోనే వెళ్ళాలనుకున్నా, బిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వర రావు కాంగ్రెస్‌లో చేరనున్నందున ఆయన గాంధీ భవన్‌కు తిరిగి వచ్చారు.
ఈ నెల 5, 6, 7 తేదీల్లో హస్తినలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని తొలుత ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయించారు. 5న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహా ధర్నాలో పాల్గొంటారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ తదితరులు ఈ ధర్నాలో పాల్గొంటారు. ఢిల్లీ దద్ధరిల్లేలా మహా ధర్నా నిర్వహించాలని నిర్ణయించిన కాంగ్రెస్ ఈ ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. 6న పార్లమెంటులో బిసి బిల్లుకు వాయిదా తీర్మానాన్ని కాంగ్రెస్ ఎంపీలతో ప్రతిపాదించాలని, 7న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి వినతి పత్రం సమర్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.
బిసిలకు రిజర్వేషన్లు సాధించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. కాగా సెప్టెంబర్ నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.