రెండున్నర గంటల పాటు దంచి కొట్టిన వాన.. బంజారాహిల్స్‌లో కూలినచెట్టు
గచ్చిబౌలిలో పిడుగుపాటు.. భారీగా స్తంభించిన ట్రాఫిక్
గంటలతరబడి ఫ్లైఓవర్లపై నిలిచిన వాహనాలు
మునిగిన దీన్‌దయాళ్ నగర్, ఎల్లారెడ్డిగూడ.. ఇళ్లలోకి వరద నీరు
గరిష్టంగా బంజారాహిల్స్‌లో 11.23 సెం.మీ.ల వర్షపాతం
ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్ 040-21111111 విపత్తుల నివారణకు ఫోన్ నెం. 9000113667
కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి
ప్రజలకు ఇబ్బంది లేకుండా సమన్వయంతో పనిచేయాలి: సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
మన తెలంగాణ/సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో సోమవారం సాయంత్రం సుమారు రెండున్నర గంటల పాటు కుండపోత వర్షంకురిసింది. సా.3.30 గం.ల సమయంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా వర్షం దంచికొట్టంది. పలు ప్రాంతాల రోడ్లలో మోకాల వరకు వరదనీ రు నిలిచింది. పలు కాలనీలు, బస్తీల ఇండ్లలోకి వరదనీరు వచ్చి చేరింది. కొద్ది రోజులుగా నగరంలో పొడి వాతావరణం నెలకొన్నా, సోమవా రం ఒక్కసారిగా ఆకాశమంతా మేఘావృతమై చీకటిని తలపింపజేసింది. అనంతరం సుమారు రెండున్నర గంటలపాటు భారీగా వర్షం కురవటంతో నగరంలోని పలు ప్రాంతాలన్నీ వరదల తో అతకుతలం అయ్యాయి. ఫతేనగర్ పరిధిలో ని దీన్‌దయాళ్‌నగర్ పూర్తిగా చెరువుగా మారి అక్కడి ఇండ్లలోకి నీరుచేరింది. దీంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ ఇండ్లపైకి చేరుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరడంతో స్థానికులు ఆందోళనకు లోనయ్యారు. కేవలం రెండున్నర గంటల్లో 12 సెం.మీ.ల వర్షపాతం నమోదుకావడం గమనార్హం. అత్యధికంగా బంజారాహిల్స్ ప్రాంతంలో 11.23 సెం.మీ.లు వర్షంపాతం నమోదైంది. నగరంలోని లక్డీకాపూల్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, సికిందరాబాద్, చార్మినార్, బషీర్ బాగ్, నాంపల్లి, ఆర్టీసి క్రాస్ రోడ్డు, బేగంపేట, మెహిదీపట్నం, టోలీచౌకీ, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట, పాతబస్తీ, చార్మినార్, రాజేంద్రనగర్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో సుమారు రెండున్నర గంటల పాటు కుండపోతం వర్షం కురిసింది.
ఎక్కడికక్కడే వాహనాలు..
నగర రోడ్లపై భారీగా వరదనీరు చేరడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. నిత్యం రద్దీగా ఉండే జంక్షన్లన్నీ వరద నీటితో చిన్నపాటి చెరువులను తలపించాయి. వాహనాలు గంటకు కిలోమీటరుగా కదిలాయి. కేబుల్ బ్రిడ్జీ నుండి మాదాపూర్ ఐకియా వరకు, కొత్తగూడ నుండి ఏఎంబి మాల్ వరకు సుమారు 4 కి.మీ.ల మేర నిలిచిపోయాయి. సుమారు రాత్రి 6 గం.ల ప్రాంతంలో వర్షం తగ్గడం, అప్పుడే ఆఫీస్‌ల సమయం ముగియడంతో ఉద్యోగులు ఒక్కసారిగా తమ వాహనాలతో రోడ్లమీదికి చేరారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. నిమిషానికో మీటర్‌గా వాహనాలు కదలుతుండటంతో వాహనదారులు విసిగిపోయారు. షేక్‌పేట్, మాదాపూర్ కియా, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్‌సిటీ, మెహిదీపట్నం, ఖైరతాబాద్, పంజాగుట్ట, ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, లకిడీకాపూల్ ప్రాంతాల్లో వాహనాలు చాలా నెమ్మదిగా కదిలాయి. పోలీసులు, డిఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగినా ట్రాఫిక్ కంటోల్‌లోకి రాలేదు. బంజారాహిల్స్‌లో భారీ వృక్షం నెలకొరగటంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమైంది.
మునిగిన ఇండ్లు.. కూలిన చెట్టు…
గచ్చిబౌలీలోని ఓ తాటి చెట్టుపై పిడుగు పడటంతో ఒక్కసారిగా జనం భయాందోళనలతో పరుగులు తీశారు. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తుండటంఅక్కడి ప్రజలను ఒకింత అయోమయానికి గురిచేసింది. ఎల్లారెడ్డిగూడలో భారీగా వరద నీరు చేరింది. పలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరటంతో పలు ఇళ్లలోని నిత్యావసర వస్తువులు తడిచిపోయాయి. అమీర్ పేటలోని ఇమేజ్ హాస్పిటల్ ఏరియా కూడా ముంపునకు గురైంది. వర్షపు సహాయక చర్యల్లో నిమగ్నమైన హైడ్రా అధికారులు నగర ప్రజలకు హెచ్చరికలు జారీచేసింది.. అత్యవసరమైతే తప్పా, బయటకు రావద్దని మెస్సేజ్‌లు చేరవేసింది. సైఫాబాద్ కామత్ హోటల్‌కు లంచ్‌కు వచ్చిన కొందరు వినియోగదారులు భారీవర్షం కారణంగా హోటల్‌లోనే చిక్కుకున్నారు. హోటల్‌లోకి భారీగా వర్షంనీరు రావడంతో వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యారు.
రాజ్ భవన్ వంటి రద్దీ మార్గాల్లో నీరు నిలువకుండా గతేడాది అధికారులు ఏర్పాటు చేసిన వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్‌లు పూర్తిగా నిండి, వరద నీరు బయటకు ప్రవహించటంతో రాజ్ భవన్ రోడ్డులోనూ భారీగా వరద నీరు నిలిచింది. ఫలితంగా ఖైరతాబాద్ నుంచి అమీర్ పేట, పంజాగుట్ట, బేగంపేట వరకు, ఖైరతాబాద్ నుంచి ట్యాంక్ బండ్, నాంపల్లి, బషీర్ బాగ్, కోఠి వైపు రహదారుల్లో గంటల తరబడి ఎక్కడి వాహానాలు అక్కడే నిల్చిపోయాయి. ముఖ్యంగా రద్దీ రోడ్లలో వీధి ధీపాలు వెలగకపోవటంతో చీకట్లో, గుంతలమయమైన రోడ్లపై రాకపోకలు సాగించేందుకు ఇబ్బందుల పాలయ్యారు.
తక్కువ సమయం.. ఎక్కువ వర్షం
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం నిజాం కాలం నాటి వరద నీరు కాలువులు, నాలాలే అందుబాటులో ఉన్నాయి. కాలక్రమేనా ఇప్పటి వరకు ఈ కాలువలు, నాలాలు సుమారు 61 శాతం కబ్జాల పాలైనట్లు హైడ్రా ఇటీవలే ప్రకటించినది. ఇప్పటికే బక్క చిక్కిపోయిన వరదనీటి కాలువలు, నాలాలు ఓ గంట వ్యవధిలో కేవలం రెండు సెంటీమీటర్ల వర్షానిక సైతం తట్టుకునే పరిస్థితి లేదు. దాదాపు 12 సెంటీమీటర్ల వర్షం భీభత్సంగా కురవటంతో అప్రమత్తంగా ఉన్న హైడ్రా బృందాలు సైతం పలుప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారింది. మొత్తం 166 ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ అయినట్లు జీహెచ్‌ఎంసీ కమాండ్ కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదులొచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఫలించిన సమన్వయం
మహానగరంలో వర్షం సహాయక చర్యలు, నాలాల పూడికతీత పనుల బాధ్యతలను హైడ్రాకు ఇటీవలే అప్పగిస్తూ మున్సిపల్ శాఖ ఆదేశాలు జారీ చేసిన తర్వాత వర్షం సహాయక చర్యలపై హైడ్రా, జీహెచ్‌ఎంసీల మధ్య పెరిగిన గ్యాప్‌ను తగ్గించి, సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు హైడ్రా కమిషనర్ రంగనాధ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్‌లు ఇటీవలే ఉభయ విభాగాల అధికారులు, సిబ్బంది, ఇంజనీర్లతో ప్రత్యేక సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. వానకాలం సహాయక చర్యల బాధ్యతలను హైడ్రాకు సర్కారు అప్పగించినప్పటికీ, జీహెచ్‌ఎంసీ తన బాధ్యతలను నిర్వహిస్తూ సహాయక చర్యల్లో హైడ్రాకు సహకరించనున్నట్లు కమిషనర్ ప్రకటించారు. సహకరించాల ఇంజనీర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులను కమిషనర్ కర్ణన్ ఆదేశించారు. సోమవారం కురిసిన భారీ వర్షం నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచన రావటంతో నగరవాసులు అత్యసవసరమైతే తప్పా బయటకు రావద్దని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సూచించారు. వర్షం కురుస్తున్నపుడు, కురిసిన తర్వాత సహాయక చర్యల కోసం నగరవాసులు 040-21111111 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చునని వెల్లడించారు. విపత్తుల నివారణ కోసం 9000113667 కాల్ చేయాలని అధికారులు సూచించారు.
అత్యధికం 11.23 సెం.మీ.లు..
సోమవారం సిటీలో కురిసిన కుండపోత వర్షంలో భాగంగా అత్యధికంగా బంజారాహిల్స్ లో సుమారు 11.23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, మల్కాజ్ గిరి సఖీ సెంటర్ వద్ద అత్యల్పంగా 1.7సెం.మీ.ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. షేక్‌పేటలో 11.2 సెం.మీ.ల వర్షపాతం, గాజులరామారంలో 10.7 సెం.మీ.లు. యూసుఫ్‌గూడలో 10.2 సెం.మీ.లు. ఖైరతాబాద్‌లో 8.8 సెం.మీ.లు. ఆసిఫ్‌నగర్‌లో 8 సెం.మీ.లు వర్షపాతం నమోదైనాయి.