‘రోజుకొక్క జంతువు సింహానికి ఆహారంగా మారుతున్న అడవిలో, నీలాంటోడే ఇంకోడు వున్నాడు అంటూ సింహాన్ని బావిలో పడేసి హతమార్చిన కుందేలు పిల్ల నిజమైన జ్ఞానవంతురాలు, ‘జ్ఞానవంతులు సమాజానికి దిక్సూచి లాంటివారు, తాము ఉంటున్న సమాజానికి ఉన్నతంగా నిలుపాలని అనుకుంటారు. సమాజంలో భాగస్వాములైన అన్నివర్గాల ప్రజల సంక్షేమాన్ని, శ్రేయస్సును కాపాడే సామాజిక ఉద్ధారకులు అవుతారు. సమాజ పరిణామ క్రమాన్ని నిశితంగా కుందేలు పిల్లలాగా గమనించినప్పుడే ఇలాంటి విషయాలు మనకి బోధ పడుతాయి. ఈ కోవకి చెందిన అరుదైన జ్ఞానవంతురాలు కల్వకుంట్ల కవిత. ఒక వ్యక్తి జీవితంలో ఉండే అనేక కోణాల్లో ఉద్యమం అనేది ఒక కోణమై ఉండొచ్చు. కానీ సబ్బండ వర్గాల సమస్యలే ఉద్యమం అయినప్పుడు, ఉద్యమమే జీవితం అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తప్పకుండ ఆమె కవిత. వందల సంవత్సరాలుగా జ్ఞానానికి దూరం చేయబడ్డ, ఉత్పత్తి కులాలు దేశజనాభాలో సగానికిపైగా ఉన్న బిసిలు, 80% పైగా ఈ దేశానికి సంపదను సృష్టించే సృష్టికర్తలు బిసిలు, ఏ రంగంలో కూడా బిసిలకు సరైనా సమాన వాటా లభించటం లేదు అన్న బిసిలా స్థూల ప్రయోజనాలను సూక్ష్మంగా కవిత పరిశీలించి చూసారు.
ప్రపంచీకరణ నేపథ్యంలో వచ్చిన ఆధునికీకరణ, గ్రామాల్లో చేతివృత్తులను చేరిపి వేసింది. కుల వృత్తులన్నీ కూలిపోయి, బతుకు జీవుడా అంటూ పట్టణాలకు వలసలు (Migration cities) పోయినాయి. నాగలి చెక్కి రైతుకు అందించే వడ్ల కమ్మర కులాలు, మట్టిని ప్రేమించి పూలకుండీలు, బొకేలు లేని కాలంలో ఇంటికి పెంకులను, ఆహార పాత్రలను, కల్లు లొట్లును, బోనం పటాలను అమ్మడం ద్వారా మెరిసిన కుమ్మరులు, ఆకాశానికి అంటి ఉన్న తాటి చెట్లను శరీరానికి మోకు అనే బంధనం వేసుకొని ఏ కాలంలోనైనా బతుకు పోరులో నిత్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పోరాడే గౌడన్నలు, నేనేమి సేతును, నేనెట్ల బతుకుడు, ఊరోళ్లకు కల్లు పోస్తే ఉద్దెర అడిగితిరి, పైసలు అడిగితే కట్టేసి కొడతాం అంటిరి, ఊరు కానీ ఊరు పోయి కల్లును అమ్ముకుంటే కన్నెర్ర చేస్తిరి, బీరు, బ్రాందీలు వచ్చి ఎర్రమందు లోకమంత ప్రాకిపోయి తెల్లకల్లు తాగేటోడు లేక బతుకు భారమయ్యే, కులవృత్తిని నమ్ముకుంటే కూడుకు గతిలేకపాయె అని బతుకు భారమవుతున్న గౌడన్నల జీవితాలను, ఇలా అన్ని బిసి కులాల బతుకుల్లోకి తొంగిచూసింది, వారు అనుభవిస్తున్న బాధలను సూక్ష్మంగా గ్రహించారు కవిత.
ఇలా చెప్పుకుంటూపోతే కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, గౌడ, యాదవ, కురుమ, పెరిక, కాపు, చాకలి, మంగలి, గంగపుత్ర, బెస్త, శాల, ఇతర సంచార జాతుల వందల కులాల చరిత్రలను, జీవన విధానాలను, వారికి ఉండే ఉపాధి అవకాశాలను, రాజకీయ ప్రాతినిధ్యాలను, విద్య, ఉద్యోగావకాశాలన్నింటినీ తరువుగా చూసింది. నిశితంగా తెలుసుకున్నది కవిత. తదనంతరం అనేక రాజకీయ కుట్రలు, కేసులతో ఒక మహిళను ఎంతగా ఇబ్బంది పెట్టకూడదో అంతగా ఇబ్బందిపెట్టిల్లు రాజ్యమేలే రాబందులు. అయినా వేరవకుండా నేను మొండి దాన్ని, నన్ను అన్యాయంగా జైలుకి పంపి జగమొండిని చేసిళ్ళు అని నాడు ప్రకటించినా, ఆ ప్రకటన రాజకీయ వర్గాల్లో వణుకు తెప్పించాయి. అదే వరవడిని, వాడిగా బిసి సమాజం వైపు కదిలించింది కవిత. అధికారదాహంతో ఉన్న కాంగ్రెస్ అనేక తప్పుడు హామీలను ఇచ్చింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ బిసిలకు 42% వాటా రిజర్వేషన్స్ కల్పిస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్ చేసింది. బిసిల ఓట్లు దండుకొని ఈ ఉసేలేకుండా కాలం ఎల్లదీస్తూపోతున్న కాంగ్రెస్‌కి కంట్లో నలుకలా మారింది కవిత.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తూనే బిసి ఉద్యమాన్ని తన భుజాలపైకి ఎత్తుకున్నది కవిత. ఈ మట్టి మనకు తినటానికి తిండినీ ఇస్తున్నది, బతకటానికి దారి చూపుతున్నది. ఈ మట్టే ఇల్లయి, ఇటుఇటుక అయ్యి మనకు ఇంత నీడను ఇస్తున్నది. తనువు చాలిస్తే తనలో మనల్ని దాచుకుంటుంది. ఈ మట్టితో రుణబంధం ఇంతేనా అని ప్రశ్నించుకున్నారు కవిత. కేవలం కూడు, గుడ్డ కల్పించినంత మాత్రాన ఈ సమస్య పరిష్కరింపపడదని నాడే సంకల్పించారు. బిసి బిడ్డలైన ఈ ఉత్పత్తి మట్టి కులాలకు, తాను ఆధునిక సావిత్రిబాయి కావాలనుకున్నది. పూర్తిగా బిసి సమస్యలు, రిజర్వేషన్ ఫలాలను, అందించటమే లక్ష్యంగా కంకణం కట్టుంది. అది ఎలాంటి కంకణమంటే, ఈ రాష్ట్రంలోనే అనేక బిసి ఉద్యమాలను నడిపిన అనేక బిసి సంస్థలకు, కులాల వారీ సపోర్ట్ తెలంగాణ జాగృతి యునైటెడ్ ఫూలే ఫ్రంట్ యుపిఎఫ్‌కి అనుబంధంగా 112 కులాలను పోగు చేసి, ఒకే గొడుగు కిందకు తీసుకొని వచ్చింది కవిత. కులాల వారీగా, 112 కులాలతో కులాలవారీగా సమావేశాలను నిర్వహించడం, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటించి జిల్లాకొక రౌండ్ టేండ్ సమావేశం నిర్వహించడం, ప్రతి జిల్లాల్లో నిద్రావస్థలో ఉన్న బిసి ఉద్యమ అస్తిత్వాన్ని తట్టిలేపింది.
లోతుగా వారి సమస్యలను విన్నారు. ఇందిరా పార్క్ వేదికగా బిసి మహాధర్నా, బిసి గర్జన లాంటి కార్యక్రమాలు నిర్వహిం చి, యావత్ బిసి సమాజం అంతా కూడా పోరాడితే కవితలా నిత్యం లైవ్‌లో అంశాన్ని ఉంచి పోరాడాలి అనే అంతగా. నాడు ప్రభుత్వం కులగణన చేయడానికి ముందుకు వచ్చింది. తానే స్వయంగా కులగణనలో నమోదు చేసుకొని దానిలో ఉన్న పొరపాట్లను వేలెత్తి ప్రభుత్వానికి తెలియజేసింది. బిసి డెడికేషన్ కమిషన్ వేయాలని అనేకమార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేసిన డెడికేషన్ కమిషన్‌కి బిసి సంఘా లతో వెళ్లి నివేదిక సమర్పించారు. దాని కాలపరిమితి తీరిపోతే డెడికేషన్ కమిషన్ కాలపరిమితిని పెంచాలని డిమాండ్ చేసింది. బిసి హక్కుల కోసం, వారి రిజర్వేషన్ల సాధన కోసం ప్రభుత్వం ఒక బిల్లు తీసుకొస్తాయంటే ఒక్క బిల్లు కాదు, మూడు బిల్లులు తీసుకురావాలని, రాజకీయపరమైన రిజర్వేషన్స్ ఒకటి అయితే భావితరం బాగుండాలి అంటే విద్యలో, ఉద్యోగాలలో సైతం బిసిలకు అన్యాయం జరగొద్దని మండలిలో గర్జించింది, ఆ మూడు బిల్లులను సాధించింది. ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో లోపాలను నిత్యం ప్రశ్నిస్తూ ఉన్న సంఖ్యను తగ్గించి చూపెట్టిన ప్రభుత్వానికి చురకలు అంటించి మళ్ల్లీ కులగణనకు డిమాండ్ చేసింది.
పతాక శీర్షికలో కవిత బిసి ఉద్యమ ప్రయాణం నడుస్తుంటే దాన్ని ఇంకో దశకు మార్చటం కోసం రైల్ రోకోకు పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో బిసి సమాజం విస్మయానికి లోనయింది. కొన్ని ప్రధాన పార్టీలు ఏంటి ఈమె ధైర్యం అని నోరెళ్ళ పెట్టినాయి అంటే అతిశయోక్తి కాదు. ఒక మహిళగా ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నప్పుడే బిసిల కోసం పుట్టిన ఆధునిక సావిత్రిబాయి అని బిసి సమాజం భావించింది. కుటుంబంలో అభిప్రాయ భేదాలు వచ్చినా పెద్దగా లెక్కచేయకుండా బిసి సమాజమే తన కుటుంబంగా కదిలిందంటే ఆమె ముమ్మాటికీ బిసిల ఆత్మబంధువు కాక ఇంకేమవుతారు. భవిష్యత్ రాజకీయాలను తెలంగాణ రాష్ట్రం లో ప్రభావితం చేయగలిగిన నేర్పరి, విషయ పరిజ్ఞాని, పరిశోధకురాలు, అకుంటిత దీక్షాదక్షురాలు, ధారాళంగా అన్ని భాషల్లో కెసిఆర్‌లా అనర్గళంగా మాట్లాడి ఒప్పించే దిట్ట. ధైర్య శీలి మాస్ లీడర్ కవిత అన్న విషయం గుర్తెరగాలి. కవిత బతుకమ్మను ఎంత పవిత్రంగా ఎత్తుకుంటారో అంతే పవిత్రంగా బిసి ఉద్యమాన్ని ఎత్తుకున్నారు. ఇవ్వాళ బతుకమ్మను విశ్వపీఠాన నిలబెట్టింది. రేపు బిసి హక్కులను అంతేస్థాయిలో నిలబెడుతుంది. తెలంగాణ చారిత్రక ఘట్టాలలో కవిత చేపట్టిన బిసి ఉద్యమం నిలిచిపోతుంది.
- డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్