Tuesday, August 5, 2025

కృత్రిమమేధతో ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకం

- Advertisement -
- Advertisement -

ఒకప్పుడు టెకీల గురించి, వారి సంపాదన గురించి చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళం. టెక్ నగరాలంటే ఎంతో మక్కువ ప్రదర్శించే రోజులవి. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో కుటుంబ బాధ్యతలను నెట్టుకురావడం కష్టసాధ్యమైన సందర్భంలో యువత కొంతమంది మధ్యవర్తుల సాయంతో అమెరికా పయనమై, కొంతకాలం పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసి, తర్వాత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేసి ఎంతో కష్టపడి ఆర్థికంగా నిలదొక్కుకుని, తల్లిదండ్రులకు డబ్బు పంపిస్తూ, వారు ఆర్థికంగా పరిపుష్ఠి కావడానికి దోహదం చేసేవారు. అప్పట్లో సాఫ్ట్‌వేర్‌రంగం స్వర్ణయుగాన్ని చవిచూసింది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణె వంటి నగరాల్లో టెక్ కంపెనీలు దేదీప్యమానంగా ప్రకాశించాయి.

అయితే ఇదంతా ఒక గతం. ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. సాఫ్ట్‌వేర్ రంగం సంక్షోభాన్ని చవిచూస్తున్నది. ఒకప్పుడు వందలాది మంది సాఫ్ట్ రంగం వైపు (Hundreds peopletowards soft sector) పరుగెడితే, నేడు భారత్‌లో కూడా లక్షలాదిమంది సాఫ్ట్‌వేర్ రంగంపట్ల మక్కువ చూపుతున్నారు.వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను నిర్లక్ష్యం చేస్తున్నాం. కంప్యూటర్ల వైపు యువత ఇంకా పరుగులు తీస్తున్నది. సాంకేతిక రంగంలో అనేక మార్పులు సంభవించాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ‘ఎఐ’ చాపక్రిందనీరులా చొచ్చుకువచ్చింది. కృత్రిమ మేధను అందిపుచ్చుకుని, అందులో ప్రావీణ్యత సంపాదించగలిగితేనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు నిలబడతాయి. ఇప్పటికే అనేక టెక్ దిగ్గజ కంపెనీలు కృత్రిమమేధను ప్రవేశపెట్టాయి. మరికొద్ది సంవత్సరాల్లో కృత్రిమ మేధ సాంకేతిక రంగాన్ని శాసించబోతున్నది. ఇప్పటికే ఎఐ సాఫ్ట్‌వేర్ రంగంపై తన ప్రభావాన్ని, ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టింది.

అమెరికాలోని టెక్ కంపెనీలు భారతీయులను ఉద్యోగాల్లో తీసుకోవద్దని ఇప్పటికే ట్రంప్ హుకుం జారీ చేయడం జరిగింది. ఇదే సందర్భంలో ఎఐ వలన ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, అమెజాన్ వంటి సంస్థలు వేలాది మందిని ఉద్యోగాలనుండి తొలగిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. అయినప్పటికీ యువతలో ఇంకా సాఫ్ట్‌వేర్‌పట్ల మక్కువ తగ్గకపోవడం వాస్తవాన్ని గ్రహించక చేస్తున్న తీవ్రమైన తప్పిదం. నకిలీ సర్టిఫికెట్లతో, ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌తో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు సంపాదించడం ఇక సాధ్యపడదు. రోబో శకం ప్రారంభమైనది. మానవశక్తి స్థానంలో యాంత్రిక శక్తి అత్యంత ఖచ్చితత్వంతో, వేగవంతంగా పనులు చేస్తూ సత్ఫలితాలు సాధించే పరిస్థితులు ఏర్పడ్డాయి.

పదిమంది చేసేపనిని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సహాయంతో కేవలం ఒక్కరితో సుసాధ్యం చేసే విప్లవాత్మక మార్పులు చోటుచోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఇంకా గతంలో మాదిరిగా బట్టీచదువులతో, మార్కుల కోసం కుస్తీపడడం, ఇందుకోసం లక్షలాది రూపాయలను కిండర్‌గార్డెన్ స్థాయినుండే విద్యార్థులపై వెచ్చించడం సహేతుకం కాదు. ఉన్నతమైన, నాణ్యమైన విద్యా ప్రమాణాలతో, మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలి. వివిధ రంగాల్లో నెలకొన్న సంక్లిష్ట సాంకేతిక సమస్యలను పరిష్కరించడం, అధిక ఖర్చులకు కళ్లెంవేయడం, సమయాన్ని ఆదా చేయడం, ఉత్పాదకత పెంచడం, అలసట ఎరుగని రోబోలతో 24 గంటలు పని చేయించడం కృత్రిమ మేధవలన సుసాధ్యం కాగలదు. కృత్రిమ మేధ వేగవంతమైన ప్రపంచంలో ఉత్తమమైన సేవలను అందిస్తుంది. ఎఐ ప్రపంచంలోకి ఇప్పటికే అడుగులుపడ్డాయి.

కృత్రిమమేధ ప్రభావంతో రాగలరోజుల్లో ప్రతిభావంతులైన యువత ఉపాధికి ఏవిధమైన నష్టం జరగదనే అభిప్రాయముంది. కృత్రిమమేధ వలన ఉద్యోగావకాశాలు తగ్గి రోబోల ఆధిపత్యం మొదలయ్యే అవకాశం ఉంది. మానవభద్రతకు, వివిధ దేశాల రక్షణ వ్యవహారాలకు కృత్రిమ మేధ వలన ఒక విధంగా లాభం, మరొక విధంగా నష్టం జరిగే అవకాశ ముందనే వార్తల్లో నిజమెంతో తెలియాలి. కృత్రిమమేధ ప్రవేశంతో టెక్నాలజీ రూపురేఖలు పూర్తిగా మారిపోయే అవకాశముంది. ప్రపంచ మానవ జీవనక్రమంలో అనేక విప్లవాత్మక మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. కాబట్టి కృత్రిమమేధ వలన తలెత్తే పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. కృత్రిమమేధ మానవజీవితాలను మరింత సౌకర్యవంతంగా మార్చాలి. ఉద్యోగ అవకాశాలను పోగొట్టకుండా, పెరుగుతున్న విద్యావంతుల ఉపాధికి నష్టంలేకుండా చూడాలి. ఎంతవరకు కృత్రిమ మేధ అవసరముందో అంతవరకే వినియోగించాలి. మానవశక్తికి వీలు కుదరని చోట్ల, ప్రమాదకరమైన పనుల్లోను, ఇతర సంక్లిష్టమైన కార్యకలాపాల్లోను కృత్రిమమేధను వినియోగించి, అభివృద్ధిని సాధించవచ్చు.

  • సుంకవల్లి సత్తిరాజు, 97049 03463
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News