Tuesday, August 5, 2025

ఎరువుల గందరగోళం!

- Advertisement -
- Advertisement -

మనిషికి జీవనాధారం వ్యవసాయం. అయితే ప్రస్తుత కాలంలో సాగు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. విత్తనం విత్తినప్పటినుండి పంటకోత వరకు అనేక సమస్యలతో సాగు రైతుకు భారమవుతున్నది. ఈ సమస్యలు నిరంతరం కాలానుగుణంగా మారుతూ కొత్త సమస్యలకు దారితీస్తున్నాయి. ఇలాంటి నూతన సమస్యలే నేడు తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్నది. ఈ సంవత్సరం కూడా సాగు సమస్యలతో మొదలైంది. ఈసారి నైరుతి రుతుపవనాలు ఒక వారం ముందుగానే వచ్చినప్పటికీ తర్వాత నెల రోజులు రాష్ట్రవ్యాప్తంగా వానలు అంతంత మాత్రంగానే కురవడంతో పంట ప్రారంభంలోనే ప్రకృతి వైపరీత్యాలతో రైతుకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి, జొన్న విత్తిన రైతులు విత్తనాలు మొలకెత్తక పోవడం లేదా మొలకెత్తినా సరైన పదునుదొరక్క ఎండి పోయే పరిస్థితులు నెలకొన్నాయి.

ఇది ఇలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం 2025- 26లో సాగుకై వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు ద్వారా రూ. 1,37,757 కోట్లు కేటాయించింది. (కేంద్ర బడ్జెట్‌లో 2.7%). ఇది 2024 -25లో సాగుకు కేటాయించిన దాని కంటే సుమారుగా 2.5 శాతం తక్కువ చేసి సాగుకు ప్రభుత్వం కేటాయింపుల్లో కోతపెట్టింది. ఇక రైతులకు ప్రతి ఏటా లాగే ఈ సారి మళ్లీ ఎరువుల సమస్య (Fertilizer problem again) మొదలైంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎరువుల కేటాయింపుల్లో కోతపెట్టడంతో సరిపడా ఎరువులు అందుబాటులో లేక వానకాలం ప్రారంభం నుంచే రైతులు ఎరువుల సరఫరా కేంద్రాల వద్ద పట్టాపుస్తకాలు, చెప్పులు, రైతులే స్వయంగా క్యూలో గంటల లేదా రోజుల కొద్దీ నిలబడి పడిగాపులుగాసి నిరీక్షిస్తున్నారు. భారతదేశం ప్రపంచంలోనే ఎరువుల వినియోగంలో రెండవ స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 2023- 24లో ప్రధాన ఎరువుల (ఎన్‌పికె) వినియోగం 30.64 మిలియన్ టన్నులు అందులో మన దేశంలో ఉత్పత్తి అయినా ఎరువులు 21.95 మిలియన్ టన్నులు. సుమారుగా 9.64 మిలియన్ టన్నులు ఎరువులను విదేశాల నుండి దిగుమతి అవుతున్నాయి.

దేశంలో స్వదేశీ ఎరువుల ఉత్పత్తులు సరిపోకపోవడంతో, రైతుల అవసరాలకు కావాల్సిన ఎరువులను విదేశీ దిగుమతులపై ఆధారపడుతుంది. అందులో సుమారుగా 20% యూరియా, 50- 60 శాతం డై అమ్మోనియం ఫాస్ఫేట్ (డిఎపి), 100 శాతం మురియేట్ ఆఫ్ పొటాష్ (ఎంఒపి)ల కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవసివస్తున్నది. అంతేకాకుండా, ప్రతి సంవత్సరం ఎరువుల వినియోగం పెరుగుతుంది. ప్రధానంగా యూరియా వినియోగం ఏటికేడు అధికమవుతుంది, 2023- 24లో 357.81 లక్షల మెట్రిక్ టన్నులతో దేశంలో చరిత్రలోనే అత్యధిక యూరియా వినియోగించిన సంవత్సరంగా నిలిచింది. మన దేశంలో ప్రస్తుతం సుమారుగా 36 యూరియా తయారీ యూనిట్లు ఉన్నాయి, దేశీయ ఉత్పత్తి 2014- 15లో 225 లక్షల మెట్రిక్ టన్నులు నుండి 2023- 24 నాటికి 314.07 లక్షల మెట్రిక్ టన్నులు పెరిగినప్పటికీ నేటికీ మన అవసరాల కోసం విదేశ దిగుమతులపై ఆధారపడుతున్నాం.

మన దేశానికి ప్రధాన యూరియా ఎగుమతి చేస్తున్న దేశాలలో రష్యా, సౌదీ అరేబియా, చైనా, ఈజిప్ట్, ఒమన్, మొరాకో లాంటి దేశాలున్నాయి. దేశీయంగా ఉత్పత్తవుతున్న ఎరువుల ముడిసరుకైనా రీ-గ్యాసిఫైడ్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఆర్‌ఎల్‌ఎన్‌జి) కోసం దాదాపు 90% దిగుమతుల ద్వారానే తీరుతుంది. అదే విధంగా, స్వదేశీ డిఎపి ఉత్పత్తికి అవసరమైన ఫాస్పోరిక్ ఆమ్లం, రాక్ ఫాస్ఫేట్, అమ్మోనియా లాంటి ముడిసరుకులు కూడా దిగుమతి చేసుకుంటున్నాం. చారిత్రాత్మకంగా స్వతంత్ర భారత దేశంలో ఎరువుల దిగుమతికి అయిన ఖర్చు చూసినట్లయితే 1960లో 0.307 మిలియన్ టన్నులు దిగుమతి చేసుకోగా, అందుకైన ఖర్చు రూ. 307 కోట్లు మాత్రమే, 1990లో దిగుమతి చేసుకున్న ఎరువులు 7.56 మిలియన్ టన్నులు కాగా, అందుకైనా ఖర్చు రూ. 1766 కోట్లు, ఇక 2023 -24 నాటికి ఎరువులు దిగుమతి కోసం అయిన ఖర్చు సుమారుగా రూ. 86,567 కోట్లు.

ఈ లెక్కల ప్రకారం మనకు స్పష్టంగా అర్ధమవుతున్న విషయం ఏమిటంటే, దేశంలో హరిత విప్లవం తర్వాత పంటల ఉత్పత్తికి అధిక మొత్తంలో ఎరువుల వినియోగం పెరిగింది. అంతేకాకుండా, ఎరువుల దిగుమతికి అధికంగా వెచ్చించడం వల్ల, ఈ భారం ఎరువుల అధిక ధరల రూపంలో లేదా సాగు ముడిసరుకు ఖర్చు పెరిగి రైతులకు పెనుభారంగా మారుతుంది. ప్రపంచంలో చైనా యూరియా, డై-అమ్మోనియం ఫాస్ఫేట్ (డిఎపి)ను అధిక భాగం ఎగుమతి చేస్తున్నది. 2024లో చైనాలో దేశీయ ధరలను స్థిరీకరించడం, తన దేశ వ్యవసాయ ఉత్పత్తికి సరఫరాలను ప్రాధాన్యత ఇవ్వడంతో చైనానుంచి నత్రజని ఎరువుల ఎగుమతులు తగ్గాయి. అదే విధంగా, యూరోపియన్ యూనియన్ దేశీయ పరిశ్రమలు, రైతులు ప్రతికూలంగా ప్రభావితం కాకుండా చూసుకోవడానికి రష్యా, బెలారస్ నుండి వచ్చే ఎరువులపై సుంకాలను అమలు చేయడంతోపాటు ప్రపంచంలో కొనసాగుతున్న ఘర్షణలు వల్ల ఎరువుల సరఫరా గొలుసుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఎరువుల దిగుమతి తగ్గించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం విదేశ యూరియా దిగుమతులను తగ్గించింది. 2023- 24లో యూరియా కేవలం 70.42 లక్షల మెట్రిక్ టన్నుల మాత్రమే దిగుమతి అయింది. ఇది గత ఐదు సంవత్సరాలలో తక్కువగా దిగుమతి చేసుకున్న సంవత్సరంగా నిలిచింది. అంతేకాకుండా, నెల సంరక్షణ కోసం ‘ప్రధాన మంత్రి ప్రాణం’ (PM-PRANAM) అనే కార్యక్రమం ద్వారా సామూహిక ఉద్యమాన్నీ ప్రారంభించారు. అందులో భాగంగా రాష్ట్ర /కేంద్రపాలిత ప్రాంతాల్లో భూమి తల్లి పునరుద్ధరణ కోసం ఎరువుల సమత్యులంగా వాడకాన్ని, ప్రత్యామ్నాయ ఎరువులను, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించి అమలు చేయాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా రాష్ట్రప్రభుత్వాలు వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ పరిశోధన సంస్థల ద్వారా వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని, సేంద్రియ ఎరువులు, బయో- ఎరువులను భూసార పరీక్ష ఆధారిత సిఫార్సుల మేరకు సమత్యులంగా వినియోగించాలని సూచిస్తున్నారు.

ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న సేంద్రియ, జీవఎరువులు దేశ రైతాంగ ఎరువుల అవసరాలను తీర్చే స్థితిలో లేవు. ఇక సేంద్రియ వ్యవసాయ భూమి విస్తీర్ణం చూస్తే, ప్రపంచవ్యాప్తంగా 2022లో 96.4 మిలియన్ హెక్టార్లలో సేంద్రియ వ్యవసాయ భూమి ఉండగా, అందులో ఆస్ట్రేలియా సుమారుగా 53.0 మిలియన్ హెక్టార్లు సేంద్రియ వ్యవసాయ భూమితో ముందు స్థానంలో ఉండగా, మన దేశంలో 4.7 మిలియన్ హెక్టార్లు రెండవ స్థానంలో ఉంది. అయితే, దేశంలో నికర సాగు విస్తీర్ణంతో పోల్చి చూస్తే దేశ సేంద్రియ వ్యవసాయం ఇంకా ప్రారంభ దశలో ఉంది. దేశసాగును సేంద్రియ సాగు దిశగా నడపాలంటే దశలవారీగా ముందుకు నడవాలి. ఈ విషయంలో చిన్న చిన్న దేశాలైన లీచ్టెన్ స్టెయిన్ (43.0 %), ఆస్ట్రియా (27.5%), ఎస్టోనియా (23.4%) లాంటి దేశాలలో మొత్తం వ్యవసాయ భూమిలో సేంద్రియ వాటా మెరుగ్గా ఉంది.

ఈ దేశాల స్ఫూర్తితో మన సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల ద్వారా మన దేశసాగును సేంద్రియ వ్యవసాయ దిశగా దశలవారీగా మళ్లించాలి. ప్రభుత్వం యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియాను రైతులకు అధికార యంత్రాంగం ద్వారా ఒక నానో యూరియా బాటిల్ (500 మి.లీ) దాదాపు 45 కిలోల సాంప్రదాయ యూరియాతో సమానం అని విస్తృతంగా సిఫార్సు చేస్తున్నది. అధికారిక లెక్కల ప్రకారం ఆగస్టు 2021 నుండి జనవరి 2024 వరకు నానో యూరియా అమ్మకాలు 7.3 కోట్లు (500ml బాటిళ్ల). నానో యూరియా పేరిట విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్న. ఇక నానో యూరియా పనితీరు, ధరలపై రైతులు నేటికీ అంతగా మక్కువ చూపట్లేదు. సబ్సిడీ తర్వాత 45 కిలోల సాంప్రదాయ యూరియా బ్యాగ్ గరిష్ట రిటైల్ ధర (ఎంఆర్‌పి) బ్యాగ్‌కు రూ. 266.5 కాగా, వివిధ కంపెనీలు ఉత్పత్తి చేసే నానో యూరియా 500 ml బాటిల్‌కు దాదాపుగా రూ. 225 నుండి 325 వరకు ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా 2022లో ఒక హెక్టారు సాగు భూమికి సగటు రసాయన ఎరువుల వినియోగం 113 కిలోల (ఎఫ్‌ఎఒ) ఉండగా, వివిధ దేశాలలో ఒక హెక్టర్ సాగుభూమి వినియోగించే సగటు రసాయన ఎరువుల (ఎన్‌పికె) వినియోగం చూసినట్లైతే, చైనా 267.7 కిలోలు, ఈజిప్టు 336.2 కిలోలు, పాకిస్థాన్ 192.9 కిలోలు వినియోగిస్తున్నాయి (2020). అయితే, భారతదేశంలో 2023- 24లో హెక్టారుకు సగటు ఎరువుల వినియోగం దాదాపు 139.81 కిలోలు. యూరియా ఉత్పత్తికై దేశీయ యూరియా తయారీ యూనిట్లు పెంచి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ద్వారా పెట్టుబడులను ప్రోత్సహించాలి. అంతేకాకుండా అధిక ఎరువులు వినియోగిస్తున్నారు అని రైతులపై నింద వేసి, రైతాంగాన్ని తప్పుదోవ పట్టించకుండా రాజకీయ నాయకులూ ఎరువుల సమతుల్య వాడకంపై రైతులకు అవగాహన కల్పించి చెతన్యపరచాలి.

ప్రత్యమ్నాయ ఎరువులను గ్రామస్థాయిలో తయారీ చేయడానికి గ్రామీణ యువతకు సరైన శిక్షణ ఇచ్చి ఎరువుల తయారీకి నూతన వ్యాపార మార్గాలు ఏర్పరచడం ద్వారా ఎరువుల కొరతను అరికట్టవచ్చు. ఇక నానో ఎరువులను విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల ద్వారా కనీసం ఒక సీజన్లో వేరువేరు ప్రాంతాల్లో, బహుళ- పంటలపై వాటి సామర్ధ్యం, బయో -భద్రత, బయో-టాక్సిసిటీ లాంటి అనేక నాణ్యతా పరమైన విషయాలను క్షేత్రస్థాయి పరీక్షించాలి. చివరిగా, ఎరువుల వినియోగంపై రైతులకు సరైన అవగాహన కల్పించి సేంద్రియ, రసాయన ఎరువులను సమతుల్యంగా వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా పంటకు సరిపడా ఎరువులు లభించి పంట దిగుబడి పెరగడంతోపాటు అధిక ఎరువుల వినియోగం తగ్గి నేల సారవంతతను కాపాడుకోవచ్చు.

  • డా. రేపల్లె నాగన్న
    79908 42149
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News