కాళేశ్వరం నివేదికలో మొత్తం గ్యాస్, ట్రాష్ మాత్రమే తప్ప అందులో ఏమీ లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. 650 పేజీల పూర్తి నివేదిక ఎవరూ చదవక ముందే అడ్డమైన రోత వార్తలను రెండు పత్రికలు రాస్తున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 655 పేజీల కమిషన్ నివేదికను 60 పేజీలకు కుదించడంలోనే కాంగ్రెస్ భాగోతం అర్థమైందని విమర్శించారు. 600 పేజీల్లో వారికి ఇష్టమైనవి లేవు అని, ఆ 60 పేజీల్లో మాత్రమే వారికి ఇష్టమైనవి ఉన్నాయని, అందుకే వాటిని మాత్రమే బయటపెడుతున్నారని ఆరోపించారు. ఢిల్లీలో భారత ఎన్నికల కమిషన్ నిర్వహించిన సమావేశానికి కెటిఆర్ నేతృత్వంలో ప్రతినిధి బృందం హాజరైంది. ఈ సమావేశంలో కెటిఆర్‌తో పాటు రాజ్యసభ సభ్యులు కె.ఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్ కుమార్, బాల్క సుమన్ పాల్గొన్నారు.
అనంతరం ఢిల్లీలో కెటిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం నివేదికపై ప్రశ్నకు సమాధాన ఇస్తూ.. సాయంత్రం కమిషన్ రిపోర్ట్ వస్తే అర్ధరాత్రి ఆస్థాన మీడియాకు లీకులు ఇచ్చారని, తెల్లారి అబద్దాలను ప్రచారంలో పెట్టారని మండిపడ్డారు. దమ్ముంటే మొత్తం 655 పేజీల నివేదికను ప్రజల ముందు పెట్లాలని డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకంగా కెసిఆర్‌పై, బిఆర్‌ఎస్‌పై కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని, అసెంబ్లీలో మైకులు కట్ చేయకుండా తమను అసెంబ్లీలో మాట్లాడనిస్తే ప్రభుత్వంతో ఫుట్‌బాల్ ఆడుకుంటామని అన్నారు. అసెంబ్లీలో తమ మైకులు కట్ చేయకుండా తమను మాట్లాడిస్తే ఎవరు నిజం చెబుతున్నారు… ఎవరు అబద్ధం చెపుతున్నారో తెలిసిపోతుందని, కాంగ్రెస్ పార్టీకీ దమ్ముందా..? అంటూ కెటిఆర్ సవాల్ విసిరారు.