బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గులాబీ కండువా కప్పుకుంటేనే పథకాలు అమలు చేస్తామని దుర్మార్గంగా వ్యవహారించారని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ పథకాలు అమలు చేస్తున్నామని అనిరుధ్ రెడ్డి తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేసేందుకు వీలుగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు ప్రతి రోజూ గాంధీ భవన్‌లో ప్రజాప్రతినిధి ఉండే ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం అనిరుధ్ రెడ్డి ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమకు ఎక్కువగా ఇందిరమ్మ ఇండ్లు,
పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, తాము తీసుకున్న దరఖాస్తులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని ఆయన చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గానికి 3500 ఇండ్లు మొదటి విడతగా ఇవ్వడం జరిగిందన్నారు. వంశీ రాం మన్ హట్టన్ భూమిలో ఎవరూ ప్లాట్లు కొనరాదని ఆయన సూచించారు. అది ప్రభుత్వ స్థలమా? కాదా? అని తేలేంత వరకూ ఎవరూ కొనరాదని ఆయన తెలిపారు. దీనిపై నలుగురు ఎమ్మెల్యేలం కలిసి కోర్టులో ‘పిల్’ దాఖలు చేశామని ఆయన చెప్పారు.