ఒకసారి ఓడి నాలుగేళ్ళ తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చి, అమెరికా శ్వేతసౌధంలోకి అడుగుపెట్టడం చాలా అరుదైన అంశం. అలాంటి అరుదైన అవకాశం దక్కిన అమెరికా అధ్యక్షుల్లో గ్రోవర్ క్లీవ్ లాండ్ ఒకరు కాగా, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొకరు. ట్రంప్ రెండవసారి అధికారంలోకి రావడానికి అమెరికాలో స్థిరపడ్డ భారతీయులూ తమవంతు కృషిచేసారు. ఎన్నికల వరకు భారత్ తన మిత్రదేశం, మోడీ తన మిత్రుడంటూ పొగిడిన ట్రంప్‌కు అధికారం రాగానే అహం నెత్తికెక్కింది. అక్రమ వలసదారులంటూ అత్యంత చులకన చేసి, కొంత మంది భారతీయులకు సంకెళ్ళు వేసి యుద్ధ విమానాల్లో భారత్‌కు పంపించి, అత్యంత అవమానకరంగా ప్రవర్తించిన ట్రంప్ భారత్‌పై ఇంకా తన అక్కసును వెళ్ళగక్కుతూ భారత్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని ప్రయత్నించడాన్ని ప్రపంచ దేశాలన్నీ గుర్తించాలి.
అధ్యక్ష ఎన్నికల ముందు వరకు రష్యాకు అనుకూలంగా, పుతిన్ కు రహస్య మిత్రుడిగా పేరొందిన ట్రంప్ తన అవసరం తీరగానే రష్యా పైన, రష్యాకు చిరకాల మిత్రదేశమైన (longtime ally Russia) భారత్‌పైన అసూయతో రగిలిపోతూ, టారిఫ్‌ల రూపంలో అర్ధరహితమైన ఆంక్షలు విధించడం అనైతికం. ఏఏదేశాలు ఎవరితో స్నేహం చేయాలో, ఎవరి వద్ద ఆయుధాలు కొనాలో నిర్ణయించడానికి అమెరికాకున్న హక్కేమిటి? అర్హతలేమిటి? ప్రపంచాన్ని శాసించమని ట్రంప్‌కు ఎవరు అధికారమిచ్చారు? ఇతర దేశాలపై అమెరికా కర్ర పెత్తనమేమిటి? ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలకు అమెరికా ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయం కారణం కాదా? రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి అమెరికా నాయకత్వంలోని నాటో దేశాల నిర్వాకమే మూల కారణం.
రష్యాతో చమురు ఒప్పందం కుదుర్చుకోవడమే భారత్ చేసిన తప్పిదంగా అమెరికా భావించడం, భారత్ రష్యాతో ఆయుధ, ఇతర వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం మానుకోకపోతే అధిక టారిఫ్‌లు విధిస్తానని ప్రకటించి, అనుకున్న విధంగానే భారత్‌పై రెండు విడతలుగా 50% వరకు సుంకాలు విధించడం, ఇదే సందర్భంలో చిరకాల ప్రత్యర్థిగా భావించే చైనాపై కేవలం 30 శాతం టారిఫ్ విధించి, టారిఫ్ అమలుకు ఎక్కువ గడువును ప్రకటించడం ట్రంప్ ద్వంద్వ ప్రమాణాలకు దర్పణం పడుతున్నది. మిత్ర దేశమంటూనే భారత్‌కు వెన్నుపోటు పొడవడం ద్వారా ప్రపంచానికి ట్రంప్ ఇచ్చే సంకేతమేమిటి? భారత్ ఆర్థికంగా బలపడకూడదనే ఏకైక లక్ష్యమే ట్రంప్‌లో అగుపిస్తున్నది. రష్యాఉక్రెయిన్ యుద్ధానికి భారత్ కు సంబంధం ఏమిటి? భారత్ రష్యాతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉండడం వలన రష్యా ఆర్థికంగా బలపడి ఉక్రెయిన్‌పై యుద్ధం చేయగలుగుతుందనే ట్రంప్ వాదన సత్యదూరం.
ఉక్రెయిన్‌కు అమెరికా, నాటో దేశాలు ఆయుధ సహకారం అందించకపోతే ఇన్ని సంవత్సరాలుగా ఉక్రెయిన్ రష్యాతో యుద్ధం చేయగలిగి ఉండేదా? నాటోలో చేరాలనే జెలెన్ స్కీ నిర్ణయమే పుతిన్ ఆగ్రహానికి, ఉక్రెయిన్‌తో యుద్ధానికి మూలకారణం. ఇప్పటికైనా ఉక్రెయిన్ అధ్యక్షుడు తమ దేశం నాటోలో చేరబోదనే హామీ ఇవ్వగలడా? అమెరికా అందుకు ఉక్రెయిన్ ను ఒప్పించగలదా? ఉక్రెయిన్- రష్యా యుద్ధానికి చరమగీతం పలుకుతానని ప్రగల్భాలు పలికిన డొనాల్డ్ ట్రంప్, యుద్ధం ఆపలేక చివరికి ఉరిమురిమి మంగళం మీద పడినట్టు నెపమంతా భారత్‌పై నెట్టి, ప్రతీకార సుంకాలతో భారత్‌ను బెదిరించడం దశాబ్దాల ప్రజాస్వామ్య అమెరికా చరిత్రకు మాయనిమచ్చ. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీనుంచి తప్పుకుని ట్రంప్‌కు మద్దతునిచ్చిన రిపబ్లికన్ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీ భారత్‌పై ట్రంప్ విధిస్తున్న వాణిజ్య సుంకాలను తప్పుబడుతూ, భారత్ వంటి బలమైన దేశంతో సంబంధాలను తెంపుకోరాదని సూచించడం గమనార్హం. అమెరికాలో ఇప్పటి వరకు ఎంతో మంది అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.
కాని ట్రంప్ వంటి నాయకుడొస్తే ఏం జరుగుతుందో బహుశా అమెరికన్లు ఊహించి ఉండరు. ఇప్పటివరకు తాను ఆరు యుద్ధాలను ఆపానని, తాను లేకపోతే అణ్వాయుధ యుద్ధం జరిగి ఉండేదని, భారత్- పాక్ మధ్య కూడా తానే మధ్యవర్తిత్వం వహించి, యుద్ధాన్ని నివారించానని ట్రంప్ పదేపదే పేర్కొనడంలో ఎలాంటి ఔచిత్యం లేదు. నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ ఇంతగా దిగజారిపోవడం సిగ్గుచేటు. ఉగ్రవాద దేశమైన పాక్‌కు మద్దతునీయడమే కాకుండా ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాక్ సైనికాధిపతి మునీర్‌తో కలిసి శ్వేతసౌధంలో విందారగించడం ట్రంప్ దిగజారుడు తనానికి నిదర్శనం. అన్ని రంగాల్లోను అభివృద్ధి సాధించానని చెబుతున్న అమెరికా నేడు ఆర్థికంగా పతనమైపోయింది. ఇతర దేశాల బలహీనతలపై దెబ్బకొట్టి, కొర్రీలుపెట్టి పరాన్నజీవిలా మనుగడ సాగించే దుస్థితి అగ్రరాజ్యానికి ఏర్పడడం దౌర్భాగ్యం.తమ వద్దే ఆయుధాలు కొనాలని అమెరికా వాంఛించడం మూర్ఖత్వం.
శాంతి వచనాలు వల్లించే అగ్రరాజ్యాధినేత ట్రంప్‌కు ఆయుధాలతో సంబంధమేమిటి? ఒక యుద్ధ పిపాసికి నోబెల్ శాంతి పొందాలన్న ఆశ, ఆరాటం ఎందుకు? అమెరికాపట్ల భారత్ జాగరూకత వహించాలి. భారత్‌పై కక్షతో అమెరికా అధ్యక్షుడు పాక్‌కు ఆయుధ ,ఆర్థిక సహాయం చేసే అవకాశముంది. ఆర్థికంగా పతనమై, ప్రజల తిరుగుబాటుతో ఛిన్నాభిన్నమవుతున్న పాక్‌కు అమెరికా వత్తాసు పలకడమేమిటి? భారత్ ఆర్థిక వ్యవస్థను మృత ఆర్థిక వ్యవస్థగా పేర్కొనడమే కాకుండా భారత్‌లో అమెరికా కంపెనీలు పెట్టుబడులు పెట్టవద్దని, భారతీయులకు ఉద్యోగాలివ్వరాదని ట్రంప్ బెదిరించడం హాస్యాస్పదం. అమెరికా ఆర్థ్ధిక వ్యవస్థలో భారతీయుల స్థానం కీలకమైనది. ఈ విషయాన్ని విస్మరించడం ట్రంప్ హ్రస్వదృష్టికి నిదర్శనం. అమెరికా ఆంక్షలకు తలొగ్గకుండా, భారత్ ఎప్పటి మాదిరిగానే రష్యాకు మిత్రదేశంగా మెలగాలి. అమెరికా దురహంకారానికి లొంగకుండా భారత్ అన్ని రంగాల్లో స్వావలంబన సాధించాలి.
- సుంకవల్లి సత్తిరాజు
97049 03463