భారతదేశంలో మొట్టమొదట విప్లవాత్మక సంస్కరణలకు బీజంవేసిన వ్యక్తి పెరియార్ ఇవి రామస్వామి. ఆయన గొప్ప రాజకీయవేత్త, ఆత్మగౌరవ ఉద్యమం వ్యవస్థాపకులు. ఈ ఏడాదికి పెరియార్ ప్రారంభించిన ఆత్మగౌరవ ఉద్యమానికి వందేళ్లవుతుంది. ఆ విప్లవ నాయకుని గురించి మాట్లాడుకోవాలంటే ఆధిపత్యం, అణచివేత, ఛాందస భావాలపై ఆత్మగౌరవ రణభేరి గురించే. ఈ ఉద్యమం తమిళనాడు ప్రజల సామాజిక, రాజకీయ, సాంస్కృతిక జీవనంలో పెను మార్పులకు సృష్టించింది. దక్షిణ భారతదేశంలో ద్రావిడ ఉద్యమానికి ఆజ్యం పోసింది. వెనుకబడిన వర్గాలలో చైతన్యాన్ని రగిలించింది. ఈ సందర్భంగా వందేళ్ళ ఆత్మగౌరవ ఉద్యమ ప్రస్థానాన్ని సింహావలోకనం చేసుకోవాల్సిన సమయమిది.
తమిళనాడులో 1925లో ఇవి రామస్వామి ఆత్మగౌరవ ఉద్యమం ప్రారంభించారు. వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న కులవ్యవస్థ, బ్రాహ్మణ ఆధిపత్యం, సామాజిక అసమానతలపై సవాల్ విసిరారు. అనేక రూపాల్లో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షను అంతమొందించడానికి కృషిచేశారు. పూజారులు లేకుండా ఆత్మగౌరవ వివాహాలు జరుపుతూ చట్టపరమైన గుర్తింపు ఇచ్చారు. భారతదేశంలో మొదటిసారిగా చట్టబద్ధంగా గుర్తించబడిన వివాహాలు ఇవే. అట్టడుగు వర్గాలకు కులాల మధ్య సమానత్వం, గౌరవాన్ని ప్రోత్సహించారు. హేతుబద్ధమైన ఆలోచనను ప్రోత్సహిస్తూ, గుడ్డి ఆచారాలను వ్యతిరేకిస్తూ శాస్త్రీయ దృక్పథానికి పెద్దపీట వేశారు. ఆయన సంస్కరణవాద, తార్కిక ఆలోచనలను వ్యాప్తి చేయడానికి ‘కుడి అరసు’ అనే తమిళ వారపత్రికను ప్రచురించారు.
పెరియార్ సమానత్వాన్ని ప్రబోధించి, సామాజిక అసమానతలపై పోరాడిన జ్యోతిరావు ఫూలే, బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంతో గాఢంగా ప్రభావితమయ్యాడు. 1919 నుండి 1925 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. తదనంతర కాలంలో కాంగ్రెస్ పెద్దలతో విభేదించి దేశ స్వాతంత్య్రం కన్నా సాంఘిక సమానత్వమే ముఖ్యమని పోరాడారు. కేరళలో 1924-, 25లో అంటరానితనానికి వ్యతిరేకంగా, ఆలయ ప్రవేశ హక్కుల కోసం జరిగిన వైకోమ్ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఆయన సామాజిక విప్లవపోరాటం తమిళనాడులో పెనుమార్పులను తీసుకువచ్చింది. వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు, విద్య మద్దతు వంటి ప్రగతిశీల సామాజిక విధానాలను పునాదిపడ్డది. ఇప్పటికీ తమిళనాడు ఉద్యమాలు, ప్రభుత్వ విధానాలు దేశరాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి.
ఆయన ఆత్మగౌరవ ఉద్యమ ప్రభావంతో లౌకిక, సమానత్వ భావాలు భారత రాజ్యాంగంలో చేర్చబడ్డాయి. ప్రశ్నించడం, శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవడం లాంటి అంశాలను ప్రాథమిక విధులలో అధికరణ 51ఎ(హెచ్)లో పొందుపరిచారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన 42% బిసి రిజర్వేషన్లను తమిళనాడు తరహాలో తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ జరుగుతున్నది. పెరియార్ ఆత్మగౌరవ నినాదంతో ద్రావిడ కజగం అనే రాజకీయ సంస్థను ఏర్పాటు చేశాడు. దీన్నుంచే తమిళనాట రాజకీయ పార్టీలైన డిఎంకె, ఎఐఎడిఎంకె వంటివి పుట్టాయి. నేటికీ ఇవే అక్కడి రాజకీయాలను శాసిస్తూ ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నాయి. పెరియార్ ఆత్మగౌరవ పునాదుల మీదనే దేశంలో అట్టడుగు వర్గాలనుంచి పలు రాజకీయ పార్టీలు, ఉద్యమ సంస్థలు వచ్చాయి.
ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఆవిర్భవించిన పార్టీలు ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. దేశంలో కులచైతన్యం, కులగణన, రాజకీయ డిమాండ్లు, రిజర్వేషన్స్ పెంపుపై చర్చ జరుగుతుంది. మరోవైపు కులాధిపత్య రాజకీయాల్లో వెనకబడిన వర్గాలు, మహిళల అవకాశాలకు దూరమవుతున్నారు. ఛాందస భావాలు, గుడ్డి నమ్మకాలు ప్రబలుతున్నాయి. ప్రశ్నించే వారిపై దాడి జరుగుతుంది. కుల, మతపరమైన అస్తిత్వ రాజకీయాలు మళ్లీ తలెత్తిన సందర్భంలో పెరియార్ ఉద్యమం ప్రబోధించిన భావాలు తిరిగి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇటీవల ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో సెయింట్ ఆంటోనీ కళాశాలలో ‘ఆత్మగౌరవ ఉద్యమం, దాని వారసత్వం’ పై సదస్సు జరిగింది. పెరియార్ ఇవి రామస్వామి స్థాపించిన ఆత్మగౌరవ ఉద్యమం వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించారు.
భారతదేశంలో ఇలాంటి ఆత్మాభిమాన ఉద్యమం గురించి చర్చ జరగకపోవడం గమనార్హం. నేటికీ మెజారిటీ బిసి, ఎస్‌సి, ఎస్‌టి వర్గాలు అగ్రకుల రాజకీయ పార్టీల నీడలోనే బ్రతుకుతున్నారు. తమ విముక్తికి సంబంధం లేని పరధర్మంలో జీవిస్తున్నారు. ఇదెలా ఆత్మగౌరవమవుతుంది?. మనువాద భావజాలంపై ప్రతిఘటనే పెరియార్ ఉద్యమం . ఇదీ నిచ్చినమెట్ల కులవ్యవస్థ, అస్పృశ్యత, అంటరానితనం, మహిళల అణిచివేత వంటి వాటిపై ధిక్కార స్వరమే. ఇప్పటికీ వీటి ఛాయలు సమాజంలో పరోక్షంగా కొనసాగుతున్నాయి. వీటి నుంచి విముక్తి పొందాలంటే నేడు స్వధర్మాన్ని తెలుసుకొని రాజ్యాంగ ఆయుధాలతో స్వరాజ్యాన్ని నిర్మించుకోవాలి.
అప్పుడే మెజారిటీ వర్గాలైన బిసి, ఎస్‌సి, ఎస్‌టిల సామాజిక ఆర్థిక, రాజకీయ సాధికారత సాధ్యమవుతుంది. పెరియార్ స్పష్టంగా బ్రాహ్మణ ఆధిపత్యాన్ని మాత్రమే వ్యతిరేకించి అట్టడుగు వర్గాల విముక్తికి కృషి చేశాడు. సామాజిక, సాంస్కృతిక, వైజ్ఞానిక చైతన్యంతో రాజ్యాధికారం కోసం పోరాటం చేశాడు. బహుజన రాజ్యాధికారాన్ని రుచి చూపించిన కాన్సీరాం సైతం పెరియార్‌ను ఉత్తర భారతదేశంలో పరిచయం చేసి ఆత్మగౌరవాన్ని ప్రబోధించాడు. ఇది పెరియార్ అనుచరులు అర్థం చేసుకోకపోవడం బాధాకరం. కావున ఇప్పటికైనా ఆ చీకటి పొరల నుంచి విద్యావంతులు బయటకు రావాలి. అప్పుడే పెరియార్ వందేళ్ళ ఆత్మగౌరవ పోరాటాన్ని అర్థం చేసుకున్నట్టు.
Also Read : కెటిఆర్ మీద బచ్చాను నిలబెట్టి గెలిపిస్తా
సంపతి రమేష్
మహారాజ్
79895 79428
- పెరియార్ ఆత్మగౌరవ ఉద్యమానికి వందేళ్లు