తెలుగు సాహిత్యంలో ప్రామాణిక పరిశోధకుడిగా, విమర్శకుడిగా, బహుగ్రంథ రచయితగా, వ్యాఖ్యానకర్తగా సుప్రసిద్ధులైన ఆచార్య ఎస్‌వి రామారావు (85) బుధవారం దిగంతాలకేగడం తెలుగు సాహిత్యరంగానికి తీరనిలోటు. ఒక సంస్థ చేయాల్సిన పనిని ఒక్కడే చేయడం అతని పరిశోధన తృష్ణకు తార్కాణం. తెలుగులో సాహిత్య విమర్శ, సమగ్ర తెలుగు సాహిత్య చరిత్ర, సమగ్ర తెలంగాణ సాహిత్య చరిత్ర, తెలుగు భాషా సాహిత్య వైశిష్ట్యం, తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం, తెలంగాణ సాహిత్య విమర్శ చరిత్ర, తెలంగాణ సాంస్కృతిక వైభవం, విమర్శక వతంసులు, సమగ్ర తెలంగాణ వాజ్ఞ్మయ కోశం, శతజయంతి సాహితీమూర్తులు (రెండు భాగాలు) వంటి పుస్తకాలను వెలుగులోకి తీసుకొచ్చిన అవిశ్రాంత అక్షర తపస్వి.
రామారావు సృజించిన రచనలు ఆయన పరిశోధనాపటిమకు గీటురాళ్ళు. తెలుగు పరిశోధనా విమర్శనా రంగంలో ఈ పుస్తకాలు ఆయనను అజరామరం చేశాయనడంలో ఎలాంటి అత్యుక్తి లేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖ అధ్యక్షులుగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, ఆర్ట్ ఫ్యాకల్టీ డీన్‌గా అనేక ఉన్నత పదవులు నిర్వహించిన ఆచార్య ఎస్‌వి రామారావు సుమారు నలభై (40)మంది పిహెచ్.డి., ఎం.ఫిల్ పరిశోధక విద్యార్థులకు పర్యవేక్షకులుగా ఉన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా పెబ్బేరు మండలంలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీరంగాపురంలో రామచూడమ్మ, సూగూరు వాసుదేవరావు దంపతుల జ్యేష్ట పుత్రునిగా జన్మించిన రామారావు స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి సాహిత్య రంగం లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. 1941 జూన్ 5 న పుట్టిన ఆయన 85 సంవత్సరాల వయసులోనూ పుస్తకాల మధ్యనే జీవించి అమరలోకానికి పయనమయ్యారు. ఎస్‌వి రామారావు బాల్యమంతా పుస్తకాలు, పత్రికలు, సినిమాలతోనే గడిచింది.
వనపర్తి హైస్కూలు విద్యార్థిగా ఉన్నపుడు స్కూలు లైబ్రరీలో ఉన్న సాహిత్యమంతా చదివేశారు. సాహిత్య పోషణకు ప్రసిద్ధిపొందిన వనపర్తి సంస్థానంలో జన్మించటం వల్ల కాబోలు జన్మతః సాహిత్యాభిలాష ఏర్పడింది. స్కూలు విద్యార్థిగా ఉన్నప్పుడే 15 సంవత్సరాల ప్రాయంలోనే ఆయనలో రచనాకళ మొగ్గ తొడిగింది. 1956 జూన్ లో ఆయన తొలిరచన పద్మిని కథానిక ఆంధ్రజనత దినపత్రికలో అచ్చయింది. ఆ సంవత్సరమే మద్రాసు నుండి వెలువడిన చిత్రసీమ పత్రికలో ఆయన సినిమా సమీక్షలు కూడా రాశారు. హైదరాబాద్‌లో కాలేజీ విద్యార్థిగా ఉన్నపుడు కూడా సినిమాలు ఎక్కువగా చూస్తుండటంతో తెలుగుదేశం (సూర్యదేవర రాజ్యలక్ష్మిసంపాదకులు), స్వతంత్ర (గోరాశాస్త్రి సంపాదకులు) వారి పత్రికలలో 1962వరకూ చిత్రసమీక్షలు అనేకం రాశారు. కాలేజీ విద్యార్థి దశలో ఉద్దండులైన కవులు, పండితులు ఆయనకు అధ్యాపకులుగా లభించటంతో ఆయన దృష్టి సాహిత్యరచనవైపు మరలింది.
నిజాం కాలేజీలో ఆయనకు ప్రత్యక్ష గురువులైన ఆచార్య పల్లా దుర్గయ్య, ఆచార్య సి.నారాయణరెడ్డి, ఆచార్య కె. గోపాలకృష్ణారావులు ఆయనలోని సాహిత్యాభిలాషను గమనించి ఎంతో ప్రోత్సహించారు. కాలేజీ తెలుగు సంచిక సంపాదకునిగా, హాస్టల్లో లైబ్రరీ మానిటర్‌గా, ఆంధ్రాభ్యుదయోత్సవాలలో వ్యాసరచన పోటీల్లో ప్రథమ బహుమతి పొందటం అంతా సాహిత్య వాతావరణంలోనే గడిపాడు. 1962లో ఉస్మానియా క్యాంపస్‌లోని ఆర్ట్ కాలేజీలో ఎం.ఎ. విద్యార్థిగా చేరినప్పుడు ఖండవల్లి లక్ష్మీరంజనం, బిరుదురాజు రామరాజు, దివాకర్ల వెంకటావధాని, చెలమచెర్ల రంగాచార్యులు వంటి ఆచార్యులు గురువులుగా లభించటం ఆయన అదృష్టం. క్యాంపస్ లోని ఏ హాస్టల్లో ఎం.ఎ. పి.హెచ్.డి. విద్యార్థిగా నాలుగు సంవత్సరాలు ఉన్నపుడు మాదిరాజు రంగారావు, వరవరరావు, హరగోపాల్, అంపశయ్య నవీన్ మొదలైనవారితో సన్నిహిత పరిచయం ఏర్పడటం ఆయన చేసుకున్న అదృష్టం.
1964లో తెలుగులో ‘సాహిత్య విమర్శ- అవతరణ వికాసాలు’ అన్న అంశంపై డాక్టరేట్ పరిశోధనకు అవకాశం లభించటం ఆయన చేసుకున్న సుకృతం. పి.యు.సి. నుంచి పిహెచ్.డి వరకు ఆచార్య సి. నారాయణరెడ్డి ఆయనకు మార్గదర్శకులుగా, గైడ్‌గా వ్యవహరించారు. వయసులో వారికన్నా పది సంవత్సరాలు చిన్నవాడైన ఎస్‌వి రామారావు ఆంధ్ర సారస్వత పరిషత్తు కార్యవర్గసభ్యునిగా వారి అధ్యక్షతన పని చేశారు. ఎస్‌వి రామారావు పిహెచ్.డి సిద్ధాంత గ్రంథం ‘తెలుగులో సాహిత్య విమర్శ’ ఆయనకు జీవన సాఫల్యగ్రంథంగా (లైఫ్ అచీఫ్ మెంట్) ఎంతో పేరు ప్రఖ్యాతుల్ని గడించింది. అన్ని విశ్వవిద్యాలయాల్లోని సాహిత్య విద్యార్థులకు ఉపయుక్తంగా ఉన్న ఈ గ్రంథం ఇప్పటికీ కొనసాగుతున్నది. ఈ గ్రంథ రచన మూలంగా మొత్తం తెలుగుసాహిత్యమంతా ఆయన గుప్పిట్లోకి వచ్చినట్లయింది. ఇటు సాహిత్యరచనలూ, అటు వాటిపై విమర్శలూ అధ్యయనం చేయటం వల్ల సాహిత్యతత్త్వాన్ని స్పష్టంగా అవగాహన చేసుకోగలిగారు.
974లో మొదటి గ్రంథం ప్రచురితమైన నాటినుంచీ గత యాభై సంవత్సరాలలో వెనుచూడకుండా అనేక గ్రంథాలు ఆయన కలం నుంచి వెలువడ్డాయి. తెలంగాణ వైతాళికులు, సుప్రసిద్ధ పరిశోధకులు సురవరం ప్రతాపరెడ్డి ఉద్భవించిన నేలలో పుట్టడం చేత ఆయన స్ఫూర్తితో పాలమూరు సాహిత్య రంగ చైతన్యానికి దోహదం చేయాలన్న సంకల్పంతో 1965 లోనే ‘జ్యోతిర్మయి’ సాహిత్య సమితిని స్థాపించారు. తొలిసారిగా 1966లో పాలమూరు జిల్లా కవుల (33 మంది) కవితా సంకలనం ‘జ్యోతిర్మయి’ ను వెలువరించారు. ఆధునిక యుగసాహిత్యంలోనే మొట్టమొదటి జిల్లా కవుల సంకలనంగా ఇది ప్రశస్తి పొందింది. అనంతరం 1972లో మొదటిసారిగా జిల్లా రచయిత మహాసభలు రెండు రోజులపాటు ఘనంగా జరిపించారు.
మహాకవి దాశరథి జ్యోతిర్మయి సమితి ప్రతినిధిగానే రాష్ట్ర సాహిత్య అకాడమీ సభ్యులై ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఒక ప్రాంతమనే కాకుండా ‘సమగ్ర తెలుగు సాహిత్య చరిత్ర’ను వెలువరించాలన్నది ఎస్‌వి రామారావు అభిలాష. ఆ దిశగా విశేషంగా శ్రమించి 18వ శతాబ్దం వరకూ గల చరిత్రను చారిత్రక సాక్ష్యాలతో, వాస్తవమైన నిజాలను వినూత్న రీతిలో తెలుగు సాహిత్య చరిత్రను ఆవిష్కరించారు. వీరి సేవను స్మరిస్తూ ‘అక్షర తపస్వీ ఆచార్య ఎస్‌వి రామారావు’ పేరుతో పాలమూరు సాహితి ఒక డాక్యుమెంటరీనీ కూడా రూపొందించారు. నిరంతరం సాహిత్య సేవలోనే గడిపిన ఎస్‌వి రామారావు మరణం నిజంగా తెలుగు సాహిత్యరంగానికి తీరనిలోటు.
Also Read : ఓటు చోరులకు సిఇసి అండ
- డా. భీంపల్లి శ్రీకాంత్, 90320 44017