హైదరాబాద్: తెలంగాణ దేశంలోనే కొత్త రాష్ట్రమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ 2047 రూపొందించుకున్నామన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో కోటమంది నివసిస్తున్నారని పేర్కొన్నారు. ‘భారత్ ప్రపంచం సహకారం అనుసంధానం పోటీతత్వం’ పేరుతో నిర్వహించిన పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా వార్షిక సదస్సులో సిఎం ప్రసంగించారు. ప్రస్తుతం 70 కిలో మీటర్లు ఉన్న మెట్రో లైన్లను 150 కిలో మీటర్లకు విస్తరిస్తున్నామని, హైదరాబాద్ మెట్రోలో రోజు ఐదు లక్షల మంది ప్రయాణిస్తున్నారని, వచ్చే ఐదేళ్లలో దీన్ని 15 లక్షలకు పెంచాలనేదే తమ లక్ష్యమన్నారు. గుజరాత్‌లోని సబర్మతి తీరం తరహాలో మూసీ నది తీరాన్ని అభివృద్ధి చేస్తామని, ఇప్పటికే మూసీ రివర్‌ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు.
Also Read: హైదరాబాద్ విలవిల
హైదరాబాద్‌కు ఎంతో చారిత్రక నేపథ్యం ఉందని, భాగ్యనగరాన్ని నెట్ జీరో సిటీగా మార్చడమే తమ లక్ష్యమని, కాలుష్య నివారణ కోసం పరిశ్రమలను హైదరాబాద్ బయటకు తరలిస్తున్నామని, హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇవి వాహనాలను ప్రోత్సహిస్తున్నామని, హైదరాబాద్‌లో తయారీ పరిశ్రమలను చైనా ప్లస్ వన్‌గా మార్చాలనేది తమ లక్ష్యమని రేవంత్ పేర్కొన్నారు. ప్రణాళికబద్ధమైన అభివృద్ధి కోసం ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నామని, విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి కనెక్టవికీ ఏర్పాటు చేస్తున్నామని రేవంత్ రెడ్డి వివరించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు బుల్లెట్ రైలు ఇవ్వాలని కోరుతున్నామని, ఆర్‌ఆర్‌ఆర్ వెలుపల రూరల్ తెలంగాణ ఉందని, రూరల్ తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ సదస్సులో 500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.