చెన్నై: ప్రముఖ తమిళ సినీ నటుడు విజయ్ (Thalapathy Vijay) గతేడాది రాజకీయ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం అనే పార్టీతో ఆయన పొలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్‌గా ఆయన వరుస పొలిటికల్ మీటింగ్స్‌తో తమిళ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నారు. అయితే విజయ్ ఇంట్లో తాజాగా భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆయన ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నీలంకరైలోని విజయ్ (Thalapathy Vijay) ఇంట్లోకి ఓ వ్యక్తి చొరబడి ఇంటి టెర్రస్‌పై తిరుగుతూ ఉండటాన్ని భద్రతా సిబ్బంది గమనించారు. వెంటనే అప్రమత్తమై ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి పేరు అరుణ్(24) అని.. గత నాలుగేళ్లుగా అతడి మానసిక స్థితి సరిగ్గా లేదని గుర్తించారు. అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
విజయ్‌కు కేంద్ర హోం శాఖ ఇటీవల వై+ భద్రతను కల్పించింది. వై+ అంటే నాలుగో అత్యున్నత స్థాయి భద్రత. మొత్తం 11 మంది ఈ భద్రతలో పని చేస్తారు. ఇందులో ఇద్దరి నుంచి నలుగురు కమాండోలు.. మిగిలిన వాళ్లు పోలీసులు ఉంటారు. అయితే ఇంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓ వ్యక్తి విజయ్ ఇంటిలోకి ప్రవేశించడం ఆందోళన కలిగిస్తుంది. ఈ ఘటనపై విజయ్ పార్టీ ఇంకా స్పందించలేదు.
Also Read : ‘కల్కీ’ సీక్వెల్ నుంచి దీపికా ఔట్