ఆపరేషన్ సిందూర్ లో జైష్ -ఏ- మొహమ్మద్ కు చెందిన మసూద్ అజర్ కుటుంబం చిన్నాభిన్నమైందని అగ్రకమాండర్ ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత అదే ఆపరేషన్ లో మురిడ్కేలోని మర్కజ్ తైబా లోని టెర్రరిస్ట్ సంస్థ ప్రధాన కార్యాలయం సర్వనాశనం అయిందని లష్కరే తోయిబా (ఎల్‌ఐటి) కార్యకర్త అంగీకరించారు. మే7న భారత వైమానిక దళాలు పాకిస్తాన్ లోనూ, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పిఓకే) లో నేలమట్టం చేసిన తొమ్మిది టెర్రరిస్ట్ స్థావరాలలో లష్కరే మురిడ్కే శిబిరం కూడా ఉంది. మురిడ్కే టెర్రరిస్ట్ శిబిరాన్ని అంతకు ముందు కన్నా మరింత పెద్దగా పునర్నిర్మిస్తున్నట్లు ఎల్‌ఇటి కమాండర్ ఖాసిం ప్రకటిస్తూ, విడుదల చేసిన వీడియో వైరల్ అయింది. మురిడ్కే పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లోని షేక్ పురా జిల్లాలో ఓ పట్టణం.
భారతసైన్యం దాడిలో ధ్వంసమైన మురిడ్కేలోని మర్కజ్ తైబా శిధిలాల ముందు నిలబడి ఖాసిం మాట్లాడుతూ దీనిని పునర్నిర్మించే పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఆ వీడియోలో నేలమట్టమైన నిర్మాణం శిథిలాలు స్పష్టమయ్యాయి. ధ్వంసమైన మర్కజ్ తైబా మసీదులో చాలా మంది ఉగ్రవాదులు, విద్యార్థులు శిక్షణ పొందారని కూడా ఖాసిం అంగీకరించాడు. కాగా ధ్వంసమైన భవనంలో ఇకపై టెర్రరిస్ట్ సంస్థ కార్యకలాపాలకు ఉపయోగించచబోరని పాకిస్తాన్ ప్రకటించింది.
మరో వీడియోలో మురిడ్కే లోని మర్కజ్ తైబా వద్ద ఉన్న దౌరా-ఎ-సుఫాలో చేరాలని లష్కరే తోయిబా కార్యకర్త పాక్ యువకులను కోరారు. దౌరా-ఎ-సుఫా అనేది టెర్రరిస్ట్ శిక్షణ కార్యక్రమం. ఇందులో జిహాదీ శిక్షణా కార్యక్రమంలో భాగంగా మతపరమైన బోధనల్లో శిక్షణ ఇస్తారు.
మరో వీడియోలో లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి తమ టెర్రరిస్ట్ సంస్థకు పాక్ మద్దతు ఇస్తున్నట్లు ధైర్యంగా ప్రకటించారు. మురిడ్కే లోని టెర్రరిస్ట్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని పునర్నర్మించడానికి పాక్ ప్రభుత్వం, సైన్యం నిధులు సమకూర్చాయని కూడా కసూరీ చెప్పిన అంశం వైరల్ అయిన వీడియోలో కన్పించింది. భారత గూఢచారి సంస్థల నివేదిక, ఎన్ డిటివీ చూపిన వీడియోల ప్రకారం లష్కరే భారతదేశం ఆపరేషన్ సిందూర్ దెబ్బకు ధ్వంసమైన తన ప్రధాన కార్యాలయాన్ని నిశ్శబ్దంగా తిరిగి నిర్మిస్తున్నట్లు సుస్ఫష్టమైంది.
Also Read: విషాదం: హీరోయిన సదాకు పితృవియోగం