Saturday, September 20, 2025

తెలంగాణలో రీడింగ్ క్యాంపెయిన్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల పఠనాశక్తి పెంపునకు, విజ్ఞానాన్ని అందించేందుకు ఒక ముఖ్యమైన అడుగువేసిందని చెప్పవచ్చు. విద్యా రంగంలో నూతన పంథాను అనుసరిస్తూ, పాఠశాలల్లో చదివే విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచడానికి అనేక సంస్కరణలు చేపడుతోంది. ఈ క్రమంలో ఒక కీలక ఉపక్రమణగా రీడింగ్ క్యాంపెయిన్ ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.ఈ కార్యక్రమం ప్రధానంగా విద్యార్థులలో పఠన అలవాటు పెంపొందించడానికి, చదవడం పట్ల ఆసక్తి పెంచడానికి, చదవడానికి సమయం కేటాయించడానికి, వారు నేర్చుకున్న విషయాలను అర్థం చేసుకుని వాటిని జీవితంలో అన్వయించుకోవడానికి దోహదపడుతుంది. రీడింగ్ క్యాంపెయిన్ అనే కార్యక్రమం ప్రస్తుతానికి నిజంగా అవసరమా అవసరమైతే ఏస్థాయిలో దాని క్షేత్రస్థాయిలో ప్రజలలోకి ముఖ్యంగా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఏ విధంగా తీసుకెళ్లాలి.

ఇటీవలి కాలంలో మొబైల్ ఫోన్ల విస్తృత వాడకం, సోషల్ మీడియా, ఇంటర్నెట్ వాడకం పబ్జి గేమ్‌లు, ఇంస్టాగ్రామ్, స్నాప్ షాట్స్ కారణంగా విద్యార్థులలో పుస్తక పఠన అలవాటు దాదాపు తగ్గిపోయింది. మేధావులు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులందరూ ఈ పరిస్థితిపై ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఒకప్పుడు పుస్తకాలను చదవడం ఒక సంస్కృతిలా ఉండేది. పుస్తకం హస్తభూషణంల ఉన్న నాడు చిన్నారులు నుండి యువత వరకు చదవడమనే అలవాటు ఉండేది. కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్ హస్తభూషణంలో తయారయింది అది బుక్‌కల్చర్ నుండి లుక్ కల్చర్‌గా మారిపోయింది. ఫోన్ స్క్రీన్‌పై మాత్రమే సమయాన్ని వెచ్చిస్తూ, పుస్తకాల పట్ల ఆసక్తి కోల్పోతున్నారు. నిజంగా మొబైల్ ఫోన్ అవసరానికి వాడుకుంటే తప్పు లేదు కానీ చీటికిమాటికి, అవసరం ఉన్నా లేకపోయినా, వ్యసనంలా మొబైల్ వాడకం తయారైంది.

విద్యార్థులలో పఠనాశక్తి పెంచడానికి ముందుగా ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణ పొందాలి.ఈ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఇఆర్‌టి అండ్ ఎన్‌సిఇఆర్‌టి వారి సహాయ సహకారాలతో వేసవి సెలవుల్లో కానీ దసరా సెలవుల్లో కానీ ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలి. ఈ విషయంలో ప్రభుత్వం గత వేసవికాలంలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణలో ఉపాధ్యాయులు విద్యార్థులను ఎలా ప్రోత్సహించాలి, ఎవరి స్థాయిలో వారికి పఠన అలవాటు కలిగించాలి, ఉన్నత తరగతుల వారికి ఎలా క్లిష్టమైన పాఠ్యాంశాలను అర్థమయ్యేలా చేయాలి వంటి మాడ్యూళ్లను బోధించారు. అదే విధంగా తరగతిని బట్టి, వారి సామర్థ్యాన్ని బట్టి, వారికి నచ్చిన పాఠ్యాంశం గాని, కథను కానీ, పద్యాన్ని కానీ, కవితను గాని, సాహిత్యాన్ని గాని చదివించే ప్రయత్నం చేయాలి.

ఉపాధ్యాయులు ఈ అవగాహనతో తరగతులను నిర్వహించడంతో విద్యార్థుల అభ్యసన ఫలితాలు మరింత మెరుగుపడతాయని, అదేవిధంగా విద్యార్థుల్లో ఉండే సృజన కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నది. నాణ్యమైన ఆలోచనల వైపు, నాణ్యమైన నిర్ణయాల వైపు, నాణ్యమైన గమ్యాల వైపు అడుగులు వేసేందుకు ఆస్కారం ఉంటుంది. విద్యార్థులు చదవడం నేర్చుకోవాలి, ఇకపై ఒక్కో పిల్లవాడికీ చదవడం తప్పనిసరి పాఠ్య నైపుణ్యంగా మారాలి. చదివింది అర్థం చేసుకోవాలి. పఠనం అనేది కేవలం అక్షరాలు పలకడమే కాదు, దాని భావాన్ని గ్రహించగలగి ఆకలింపు చేసుకోవడమూ ముఖ్యమే. అర్థమయిన విషయాలను వ్యక్తీకరించాలి. అంటే విద్యార్థి తన భావాన్ని, ఆలోచనను మాట్లాడటం లేదా రాయడం ద్వారా వ్యక్తపరచగలగాలి. చదివిన విషయాన్ని జీవితంలో అన్వయించుకోవాలి.

పాఠశాలలో నేర్చుకున్నది, ఆ పరిజ్ఞానం తన వ్యక్తిగత జీవితంలో ఉపయోగపడే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఈ రోజుల్లో సాంకేతికత ఎంతగా పెరిగినా, పుస్తకాల ప్రాముఖ్యత ఎప్పటికీ తగ్గదు. పుస్తకం జీవనది, పుస్తకం సమస్త బుద్ధి జీవులకు మస్తకం లాంటిది. ఒక పుస్తకం మనసుకు ఆలోచనల దారిని చూపుతుంది. ఒక పేజీ మన జీవితాన్ని మారుస్తుంది. ఈ భావనను తిరిగి విద్యార్థులు ఆకళింపు చేసుకునేందుకు రీడింగ్ క్యాంపెయిన్ ఒక కొత్త దిశ చూపుతోంది. ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో రీడింగ్ క్యాంపెయిన్‌ను నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు పాఠశాలలో గ్రంథాలయం కచ్చితంగా ఉండి తీరాల్సిందే. విద్యార్థులలో పఠనాభిరుచిని పెంపొందించడం ద్వారా, వారిలో సృజనాత్మకతను, స్వీయ అభివ్యక్తిని, అభ్యసన నైపుణ్యాలను పెంపొందిస్తోంది. భవిష్యత్ తరాలకు ఒక బలమైన పునాది వేసే ఈ కార్యక్రమాన్ని సమాజమంతా స్వాగతిస్తోంది.

Also Read : తెలంగాణ నోట్లో ఆల్‌మట్టి

  • రవికుమార్ చేగొని, 98669 28327
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News