Saturday, September 20, 2025

కులవైషమ్యాలతో అభివృద్ధి కుంటినడక

- Advertisement -
- Advertisement -

‘భారత దేశ గ్రామాలు స్థానికతతో కూరుకుపోయి, అజ్ఞానాంధకారంలో మునిగి, సంకుచిత తత్వంతో మతతత్వ, కులతత్వ భావనలకు పుట్టినిల్లుగా ఉన్నాయి’ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో అన్నమాటలు. గ్రామాలకు అధికారాలు,గ్రామ స్వరాజ్యం లాంటి విషయాలపై చర్చ జరిగిన సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అంతకన్న ముందు 1932లో బొంబాయి ఎగ్జిక్యూట్ కౌన్సిల్‌లో సభ్యులుగా ఉన్న సమయంలో కూడా గ్రామ పంచాయితీలకు న్యాయాధికారాలు ఇవ్వాలని చేసిన ప్రతిపాదనను కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే మహత్మాగాంధీ మాత్రం గ్రామ స్వరాజ్యం గురించి, గ్రామాలు స్వయం ప్రతిపత్తి గురించి చాలా ప్రసంగాలు చేశారు. గాంధీ సిద్ధాంతాల్లో ఇది ప్రధానమైనది కూడా.

బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మాగాంధీల మధ్య దాదాపు 30 సంవత్సరాల పాటు సాగిన సిద్ధాంత చర్చ ఈనాటికీ సజీవం. ఈ రెండు అభిప్రాయాలు ఇప్పటికీ ఘర్షణ పడుతూనే ఉన్నాయి. ఇందులో బాబా సాహెబ్ అంబేద్కర్ వాస్తవిక, భౌతిక, అనుభవ పూర్వక అభిప్రాయమైతే మహాత్మా గాంధీది కేవలం ఆదర్శ ఊహాలోకం ఆలోచన మాత్రమే. ఎందుకంటే ఇప్పటికే గ్రామాలు దాదాపు వంద ఏళ్ళ అనంతరం కూడా ఇంకా కులతత్వ మూఢత్వంలోనే కునారిల్లుతున్నాయి. ఇప్పటికే కులమే మనిషికి గుర్తింపుని, అదే జీవన మార్గంగా సాగుతున్నది. ఎంత మంది ఎన్ని మాటలు చెప్పినా సామాజికంగా, ఆర్థికంగా ఆధిపత్యంలోనే ఉన్న కులాలు గ్రామాల జీవనాన్ని శాసిస్తున్నాయి. ఇది వేదభూమి అయినా హిమాచల్‌ప్రదేశ్ నుంచి దేవభూమి అయినా కేరళ వరకు ఒకటే అనుభవం. డిగ్రీలలో తేడా తప్ప సారంలో తేడా లేదు.

చాలా సందర్భాల్లో దళితులపైన ఈ దాడులు, దౌర్జన్యాలు జరగడం సర్వసాధారణం. అయితే గ్రామాల్లో ఉన్న అధిపత్య కులాలు దళితులపైనే కాకుండా వెనుకబడిన కులాలు ముఖ్యంగా బిసి కులాలు పైనా దాడులు, వివక్ష, అణచివేతలు కూడా సాగుతున్నాయి. అయితే తెలంగాణలో ప్రత్యేకించి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో ఆధిపత్య కులాలు తమ దౌర్జన్యాలను చాలా సంఘటిత రూపంలో చేస్తున్నాయి. ఆధిపత్య కులాల సంఘటిత రూపమే గ్రామాభివృద్ధి కమిటీ. దానినే ఇంగ్లీషులో విలేజ్ డెవెలప్‌మెంట్ కమిటీలు అంటారు. ఎందుకంటే ఇంగ్లీషు తెలియనోళ్లు కూడా దీనిని విడిసి గానే పిలుస్తారు. ఈ విడిసిలు ఒకటి, రెండు ఆధిపత్య కులాల నాయకత్వంలో సాగుతుంటాయి.

ఈ విడిసిలు ప్రారంభంలో అంటే యాభై ఏళ్ళ క్రితం ఏర్పడినప్పుడు దాని లక్షం గ్రామాధివృద్ధే కావచ్చు. అయితే క్రమంగా అవి ఒకటి, రెండు కులాల రాజ్యాలుగా మారిపోయాయి. దానికి ఉదాహరణగా ఇటీవల నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్ళరాంపూర్ గ్రామంలో విడిసి నాయకులు ఆ గ్రామంలోని గౌడ కులస్థులపై జరిపిన దాడి వల్ల విడిపిల దౌర్జన్యాల చరిత్ర మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ గ్రామంలోని గౌడ వృత్తిదారులను విడిసికి లక్షల రూపాయాలు ఇవ్వాలని విడిసి డిమాండ్ చేసింది. ఆ మొత్తం ఇవ్వనందున, వారు తీస్తున్న కల్లును ఎవ్వరూ తాగరాదని, ఒకవేళ ఎవరైన తాగితే దానికి జరిమానాలు కూడా విధించారు. అప్పటికే కల్లుగీత వృత్తిదారులు లొంగిరాకపోవడంతో ఇటీవల శ్రీరామ నవమి సందర్భంగా గౌడ మహిళలను గుడిలోనికి కాకుండా అడ్డుకున్నారు. అది కూడా వారి ద్వేషాన్ని సంతృప్తి పరచలేదు.

దానితో ఎకంగా వారి జీవనాధారమైన ఈత చెట్లను తగులబెట్టారు. దాడి చేసి అనేక మందిని గాయపరిచారు. ఇది ఏదో ప్రత్యేకంగా జరిగిన సంఘటన కాదు. ఇప్పటికే ఈ ప్రాంతంలో అనేక గ్రామాల్లో సాంఘిక బహిష్కరణలు, జరిమానాలు సర్వసాధారణం. ఇదీ నిజామాబాద్ జిల్లా కోర్టులో రెండు గ్రామాల్లో ఒకటి మునిపల్లె, రెండోది కొలిపాకలలో సాంఘిక బహిష్కరణ చేసిన వారికి శిక్షను కూడా పడ్డాయి. ఇది ఒక మంచి పరిణామం. భూములు లాక్కోవడం, కబ్జాను చేయడం, డబ్బులు వసూలు చేయడం, లిక్కర్ బెల్ట్ షాపులకు, కిరాణా దుకాణాలకు, కూల్ డ్రింక్స్ షాపులకు పర్మిషన్ పేరిట డబ్బులు వసూలు చేయడం వాటిని వ్యతిరేకించిన వారిని వెలివేయడం సర్వసాధారణం. అంతేకాకుండా, ప్రభుత్వ భూములను పేదలకు దక్కకుండా కాజేసి కొంతమంది విడిసి నాయకులు కాజేయడం.

దీనికి రామన్నపేట గ్రామం ప్రత్యక్ష ఉదాహరణ. ప్రభుత్వ భూమిగా ఉన్న రెండు వందల ఎకరాలను పేదలకు పంచాలని జరిగిన ఉద్యమాన్ని నీరుగార్చి, చివరకు విడిసి దీనిని కాజేసింది. ఇట్లా ఎన్నైనా చెప్పవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ సమాంతర ప్రభుత్వాలు నడుస్తున్నవి. ఎందుకంటే ఒక్క ప్రభుత్వం కాదు, ఊరూరుకు ఒక ప్రభుత్వం వాళ్ళే. పన్నులు వసూలు చేస్తారు. వాళ్ళే తీర్పులు చెప్పి శిక్షలు వేస్తారు. వాళ్ళే దాడులు చేసి భయభ్రాంతులను చేస్తారు. ప్రారంభంలో 80 ఏళ్ళ కిందట నిజాం హయాంలో గ్రామాల్లో పటేల్, పట్వారీ వ్యవస్థలతో పాటు ఈ ప్రాంతంలోకి ఎవరైనా అధికారులు వస్తే వాళ్ళకు సౌకర్యాలు కలిగించడానికి సర్వసమాజ్ పేరిట కొంతమంది ఒక సంఘంగా ఏర్పాటయ్యాయి. అది క్రమంగా 1970 వచ్చే సరికి విడిసిలుగా మారినట్లు ఇప్పటికి 90 ఏళ్ళ వయస్సులో ఒక వృద్ధుడు చెప్పారు.

ఆ విడిసిలు గ్రామాభివృద్ధికి ఉపయోగపడుతున్నాయనే మాట పాక్షిక సత్యం. కొన్ని మౌలిక సదుపాయాల కోసం ఆ కమిటీలు పని చేస్తున్న మాట వాస్తవం. అయితే అవి అంతటికే పరిమితమైతే, అందరి భాగస్వామ్యంతో, అన్ని కులాలను కలుపుకొని ఒక ప్రజాస్వామ్య దృక్పధంతో పని చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ఇది ఒకటి, రెండు కులాల ఆధిపత్య వేదికలుగా, అధికార కేంద్రాలుగా తయారయ్యాయి. ఈ విడిసిలు ఎక్కువగా ఎక్కువగా దళితులను, వెనుక బడిన కులాలను అణచివేసే సాధనాలుగా ఉన్నాయి. వీటి మీద గత పది పదిహేను సంవత్సరాలుగా నిరసనలు, వ్యతిరేకతలు మొదలయ్యాయి. కానీ వీటి ఆగడాలు ఆగలేదు. కారణమేమిటంటే ఈ విడిసిలు రాజకీయ నాయకులను ప్రత్యేకించి ఎన్నికైన ప్రజా ప్రతినిధులను బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి.

ఒక గ్రామంలో విడిసి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు ఒక ఎంఎల్‌ఎను సాంఘిక బహిష్కరణ చేసే స్థితికి విడిసిల దుర్మార్గం చేరుకున్నది. అందువల్ల రాజకీయ పార్టీలు తమ ఓట్లకు ఎక్కడ గండిపడుతుందనే భయంతో దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి, కనీసం మాట్లాడడానికి సుముఖం చూపడం లేదు. ఇది ఒక రకంగా కుల సమాజం వికృతి రూపం. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు గ్రామాలు ఒక నరక కూపాలు అనడానికి ఇంతకన్న మంచి ఉదాహరణ అక్కరలేదు. ఈ ప్రాంతాంలో ఉన్న ఎస్‌సి, బిసిలు ఎవరికి వారు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. కానీ అది సంఘటిత రూపం తీసుకోవడం లేదు. దీనికి బలమైన కారణం ఉన్నది. ఇక్కడ ఒక కులం గ్రామాల్లో సంఖ్య రీత్యా ఎక్కువ సంఖ్యలో ఉన్నది.

ఆ కులం చేతుల్లోనే అన్ని వనరులున్నాయి. అయితే వాళ్ళు ప్రజాస్వామ్య భావజాలాన్ని అలవరచుకోవడం లేదు. ఈ కులం నుంచే చాలామంది విద్యావంతులు, ఉద్యోగాలు వచ్చాయి. అయితే ఎటువంటి మార్పులేదు. ఒకవేళ ఎస్‌సి, బిసిలు ఏకమై ప్రతిఘటిస్తే, ఇది ఒక ప్రజల మధ్య యుద్ధంగా మారే ప్రమాదముంది. ఇక్కడ ప్రభుత్వం జోక్యం అవసరం. ప్రభుత్వం ఇప్పటికైనా మించిపోయింది లేదు. విడిసిలను అన్నింటినీ రద్దు చేసి, వాటికి ఎటువంటి చట్టపరమైన రక్షణ ఇవ్వకూడదు. ఇప్పటికి జరిగిన ఘటనలన్నింటిపై ఒక కమిషన్ వేసి వాటికి బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాలి. అంతే కాకుండా జిల్లా యంత్రాంగం ప్రత్యేకించి కలెక్టర్, ఎస్‌పి, ఉన్నతాధికారులు గ్రామాల్లో అవగాహన సదస్సులు పెట్టి సామాజిక అవగాహన కల్పించాలి. అలా చేయకుండా ఇలాగే వదిలి వేస్తే ఇది గ్రామగ్రామాన ఘర్షణలకు దారితీసే ప్రమాదముంటుంది.

Also Read : మైనారిటీల సంక్షేమానికి రెండు పథకాలు

  • మల్లేపల్లి లక్ష్మయ్య (దర్పణం)
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News