ఛత్తీస్‌గఢ్‌లో ముంపు పరిహారం చెల్లిస్తామని సర్కారు హామీ
రాయపూర్‌లో ఛత్తీస్‌గఢ్ సీఎం విశ్ణుదేవ్ సాయిని కలిసిన మంత్రి ఉత్తమ్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై తలపెట్టిన సమ్మక్కసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా సమ్మతి తెలియజేసింది. సోమవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సినియర్ అధికారులతో కలిసి రాయపూర్‌లో ఛత్తీస్గడ్ ముఖ్యమంత్రి విష్ణ్ణుదేవ్ సాయి కలుసుకుని సమ్మక్కసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులను మంత్రి ఉత్తమ్ వివరించారు. దాంతో సమ్మక్కసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) ఇచ్చేందుకు సిద్దమని ఛత్తీస్‌ఘడ్ సిఎం విష్ణుదేవ్ సాయి సూత్రప్రాయంగా అంగీకరించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఛత్తీస్‌ఘడ్ సిఎం విష్ణ్ణుదేవ్ సాయి సానుకూల ప్రతిస్పందనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం ప్రాజెక్టు సాధనలో కీలక మలుపు అని మంత్రి ఉత్తమ్ అభివర్ణించారు. ఛత్తీస్‌గఢ్‌లో భూసేకరణ, పరిహారం, పునరావాస బాధ్యతను పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని వివరిస్తూ ఒక పత్రాన్ని సమర్పించినట్లు ఆయన తెలిపారు. ఎన్ఓసీ అనేది కేంద్ర జల సంఘం ఆమోదం పొందడానికి అవసరమైన చివరి అంతర్రాష్ట్ర అనుమతిగా ఉందన్నారు. ఎన్ఓసి లేకుండా సమ్మక్కసాగర్ ప్రాజెక్టు ముందుకు సాగలేదని ఆయన స్పష్టం చేశారు.
పిపిపితో వివరించిన మంత్రి ఉత్తమ్
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి వద్ద పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమ్మక్కసాగర్ బ్యారేజ్ ములుగు జిల్లాలోని తుపాకులగూడెంలో నిర్మాణంలో ఉందని వివరించారు. 83 మీటర్ల పూర్తి రిజర్వాయర్ లెవల్ వద్ద 6.7 టిఎంసిల నిల్వ సామర్థ్యంతో రూపకల్పన చేయబడిన ఈ ప్రాజెక్టు ఇంద్రావతి సంగమం దిగువన గోదావరి నదిపై ఉందని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా బీడు భూములు, ఫ్లోరైడ్ ప్రభావిత జిల్లాలుగా ఉన్న నల్లగొండ, వరంగల్‌లోని ప్రాంతాలకు తాగునీటి, సాగునీటి అవసరాలను తీర్చేందుకు ఈ ప్రాజెక్టు రూపకల్పన జరిగినట్లు ఆయన వివరించారు. తాగునీటి కొరతను మాత్రమే కాకుండా భారీ స్థాయిలో సాగునీటి ప్రయోజనాలను కూడా ఈ ప్రాజెక్టు అందిస్తుందన్నారు.ప్రాజెక్టు ప్రణాళికల ప్రకారం, సమ్మక్కసాగర్ ప్రాజెక్టు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండో స్టేజి కింద 1.78 లక్షల హెక్టార్ల ఆయకట్టును స్థిరపరచడమే కాకుండా రామప్ప-పాకాల లింక్ కెనాల్ కింద 12,146 హెక్టార్ల కొత్త ఆయకట్టును సృష్టిస్తుందని వివరించారు. ఈ అదనపు సాగునీటి సామర్థ్యం వరంగల్, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. రైతులు సుదీర్ఘ కాలంగా ఎదుర్కొంటున్న అనిశ్చిత పరిస్థితులకు ఇది శాశ్వుతపరిష్కారం అవుతుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
ఫ్లోరైడ్ నివారణ
తాగునీటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ నల్లగొండ, వరంగల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు అధిక ఫ్లోరైడ్ కారణంగా భూగర్భజల కలుషితం వల్ల చాలా కాలంగా ప్రభావితమవుతున్నాయని తెలిపారు. భూగర్భజలాలపై ఆధారపడడం తగ్గించడానికి గోదావరి ఆధారిత సురక్షితమైన నీటిని అందించడానికి సమ్మక్కసాగర్ ప్రాజెక్టు ప్రతిపాదన చేసినట్లు వివరించారు. సాగునీరు, తాగునీటి అవసరాలను ఏకకాలంలో తీర్చడం ద్వారా తెలంగాణలో లక్షలాది మందికి ఈ ప్రాజెక్టు ప్రాణాధారంగా మారుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. బ్యారేజ్‌తో పాటు ప్రాజెక్టులో విస్తృత సహాయక మౌలిక వసతులు ఉన్నాయి. కమాండ్ ప్రాంతాలకు నీటిని తరలించడానికి యాక్సెస్ ఛానెళ్ళు, గ్రావిటీ కెనాల్స్ ఉండేలా ప్రణాళిక చేశారు. భారీ పరిమాణంలో నీటి ప్రవాహాన్ని నిర్వహించడానికి మూడు పంప్ హౌస్‌లు, డెలివరీ సిస్టమ్ కూడా ఉన్నాయి. దాదాపు 90 కిలోమీటర్ల టన్నెల్ నెట్వర్క్ తో ఇది నాలుగు టన్నెల్‌లుగా ఈ ప్రాజెక్టును విభజించారు. ఒక్కోటి 8 మీటర్ల వ్యాసంతో, 182 క్యూసెక్స్ ప్రవాహ సామర్థ్యాన్ని సరఫరా చేస్తుంది. ఈ టన్నెల్లు, క్రాస్ డ్రైనేజ్ పనులు, నియంత్రణలు మరియు కాలువలపై రోడ్డు వంతెనలు ప్రాజెక్టు ఇంజనీరింగ్ రూపకల్పనకు వెన్నెముకగా నిలుస్తాయి.
బ్యాక్ వాటర్‌తో బిజాపూర్‌కు ప్రయోజనం
సమ్మక్కసాగర్ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా తెలంగాణ రాష్ట్రం ప్రయోజనాల తర్వాత కూడా ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లాలోని భూపాలపట్నం తహసీల్‌లోకి విస్తరించి ముంపు కలిగిస్తుందని, సుమారు 13.06 హెక్టార్ల భూమి, 54.03 హెక్టార్ల నది ప్రాంతంతో పాటు 6.35 హెక్టార్ల నాళా భూమి ప్రభావితమవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ఈ ప్రభావంపై ఛత్తీస్‌గఢ్ ఇప్పటికే తన ఆందోళనలను వ్యక్తపరిచిందని ఆయన గుర్తు చేశారు. ఈ ఆందోళనలను తెలంగాణ గుర్తించి తదనుగుణంగా వ్యవహరించిందని తెలిపారు. ముంపునకు సంబంధించిన అన్ని ఖర్చులను, ఛత్తీస్‌గఢ్ పరిధిలోని భూసేకరణ, పునరావాసాన్ని తెలంగాణ ఇప్పటికే భరించడానికి అంగీకారం తెలిపిన విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. ముంపును అధ్యయనం చేయడానికి ఛత్తీస్‌గఢ్ ఐఐటీ ఖరగ్‌పూర్‌ను నియమించిందని, ఆ అధ్యయన ఫలితాలను అంగీకరించి అమలు చేయడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.
Also Read: జిఎస్టీ తగ్గింపుతో తెలంగాణకు రూ.7వేల కోట్ల నష్టం: రేవంత్ రెడ్డి