మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్లు ఏ షోరూంలో కొనుగోలు చేశారో.. కెటిఆర్ కూడా అక్కడే కొనుగోలు చేశారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జగదీష్ రెడ్డి చెప్పారు. సెకండ్ హ్యాండ్ కార్లు ఎవరైనా కొంటారని, వారు ఎక్కడ తెచ్చారో తమకెలా తెలుస్తుందని అన్నారు. తాను కారు అమ్మేస్తా ఎవరైనా కొంటారని చెప్పారు. బండి సంజయ్ హోమ్ మంత్రిగా ఉండి కనిపెట్టింది ఇదేనా..? అని ప్రశ్నించారు. బండి సంజయ్ ఏమైనా వాస్కోడిగామానా లేక కొలంబసా..అంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు కెటిఆర్‌ను ఉద్దేశిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అంతకుముందు కెటిఆర్‌పై బండి సంజయ్ ఎక్స్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు.
బిఆర్‌ఎస్ పార్టీ అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై నడుస్తుందా..? అని ప్రశ్నించారు. లగ్జరీ కార్ల స్కామ్ నిందితుడు బషరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్లలో కెటిఆర్ ఎందుకు తిరుగుతున్నారని బండి సంజయ్ నిలదీశారు. ఆ కార్లు కెసిఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిస్టర్ అయ్యాయని ప్రశ్నించారు. మార్కెట్ ధర చెల్లించారా.. లేక తక్కువగా చూపించి కొనుగోలు జరిగిందా..? అని అడిగారు. పేమెంట్లు బినామీ పేర్లతో ఉన్నాయా.. నకిలీ ఆదాయమా.. లేక మనీలాండరింగ్ ద్వారానా..? అంటూ కెటిఆర్‌పై ప్రశ్నలు సంధించారు. ఇందులో నిజాలు బయటకు రావాలని, సంబంధిత శాఖలు విచారణ జరపాలని డిమాండ్ చేశారు.