Tuesday, September 23, 2025

కాల్మొక్తా… ఒక్క బస్తా ఇప్పించండి

- Advertisement -
- Advertisement -

నెక్కొండ పోలీసుల కాళ్లపై పడి బాంచెన్ అంటూ ఓ రైతు వేడుకోలు
దుగ్గొండిలో టోకెన్ల కోసం బారులు తీరిన మహిళా రైతులు
నారాయణపేట జిల్లాలో తోపులాట.. విరిగిన రైతు కాలు

మన తెలంగాణ/నెక్కొండ/దుగ్గొండి/రేగొండ/దామరగిద్ద: రాష్ట్రంలోని పలు హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, నారాయణపేట జిల్లాల్లో సోమవారం యూరియా దొరక్క రైతులు ఆందోళన బాట పట్టారు. హనుమకొండ జిల్లా, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ ముందు రైతులు ధర్నా చేయడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ క్రమంలో ఒక రైతు నిస్సహాయంగా ఒక పో లీసు అధికారి కాళ్లపై పడి.. ఒక్క బస్తా యూరియా అయి నా ఇప్పించండి సార్, మీ కాళ్లు మొక్కుతా బాంచెన్.. అంటూ బతిమాలాడిన దృశ్యం అందరినీ కదిలించింది.

దుగ్గొండి: హనుమకొండ జిల్లా, దుగ్గొండి మండలం, తిమ్మంపేట, ముద్దునూరు, లక్ష్మీపురం గ్రామాల్లో యూ రియా టోకెన్ల కోసం మహిళా రైతులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. యూరియా బస్తాల కోసం టోకెన్లు తీసుకోవాలనే సమాచారం తెలుసుకున్న రైతులు పెద్ద సంఖ్యలో ఉదయం నుంచే లైన్లు కట్టారు. తమ వాటా కోసం చెప్పులు క్యూలో పెట్టి అధికారులు వచ్చిన తరువాత లైన్లో నిలబడ్డారు. అధికారులు, పోలీసుల బందోబస్తు నడుమ రైతులకు టోకెన్లు అందించారు.

టోకెన్లు రానివారు నిరాశతో వెనుతిరిగి వెళ్లిపోయారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, రేగొండ మండల కేంద్రంలో సోమవారం రెండు మండలాల రైతులు వివిధ గ్రామాల నుండి రైతు వేదిక వద్దకు వచ్చి ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంటకే చేరుకున్నారు. ఆ సమయానికి యూరియా రాకపోవడంతో రైతులు పెద్ద సంఖ్యలో ఆందోళన చేపట్టారు. రైతులకు బిఆర్‌ఎస్ మండల నాయకులు మద్దతు తెలిపారు. సుమారు గంట పాటు రైతులు, బిఆర్‌ఎస్ నాయకులు పరకాలభూపాలపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎస్‌ఐ రాజేష్, సెకండ్ ఎస్‌ఐ సాయి త్రిలోక్‌నాథ్ రెడ్డి సిబ్బందితో వచ్చి ఆందోళన చేస్తున్న బిఆర్‌ఎస్ నాయకులకు, రైతులకు నచ్చజెప్పి పంపారు. నారాయణపేట జిల్లా, దామరగిద్ద మండలంలో యూరియా వచ్చిందని రైతులు తెలుసుకొని ఏకంగా కేంద్రం వద్దకు భారీ సంఖ్యలో రైతులు గుమికూడటంతో రైతుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా నర్సాపూర్ గ్రామానికి చెందిన రైతు వెంకటప్పకు కాలు విరగడంతో తోటి రైతులు అతనిని బయటికి తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు.

Also Read: ఆర్‌టిసి కార్మికులకు గుడ్ న్యూస్..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News