Tuesday, September 23, 2025

ఇది అమెరికాకే స్వీయహాని

- Advertisement -
- Advertisement -

విదేశీ వృత్తినిపుణులు అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగాలు చేసుకోవాలంటే హెచ్1 బీ వీసా దరఖాస్తులు తప్పనిసరి. ఈ వీసా దరఖాస్తు రుసుం ప్రస్తుతం 2000 నుంచి 5000 డాలర్ల వరకు ఉండగా, ఇప్పుడు అమాంతంగా లక్ష డాలర్లకు వన్‌టైమ్ చెల్లింపుగా పెంచడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రతి దేశం నుంచి నైపుణ్యం కలిగిన వారిని అమెరికా సంస్థలు ఆహ్వానించడం గత కొన్ని దశాబ్దాలుగా సాగుతుండగా ఇప్పుడు ఈ వీసా భారం ఆ అవకాశాలపై పిడుగుపటినట్టయింది. ప్రస్తుతం హెచ్1 బి వీసాలు కలిగి ఉన్న వారిపై ఎలాంటి ప్రభావం ఉండబోదని, కొత్త దరఖాస్తుదారులకే లక్ష డాలర్ల రుసుం వర్తిస్తుందని అమెరికా ప్రభుత్వం వివరణ కొంత ఊరట కలిగిస్తున్నా భవిష్యత్ పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటాయి.

సాంకేతిక పరంగా వివిధ రంగాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండడానికి ఇతర దేశాల నుంచి వచ్చి పనిచేస్తున్న నిపుణులే అన్నది వాస్తవం. సైన్స్, టెక్నాలజీ, మెడిసిన్, తదితర రంగాల్లో అమెరికా ప్రతిభ , నైపుణ్యాల కొరతతో అల్లాడుతోంది. ఈ లోటు విదేశీ నిపుణులతోనే తీరుతోంది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా తదితర ఐటి దిగ్గజ సంస్థలు హెచ్1 బి వీసాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. 2025 లోనే అమెజాన్ సంస్థ 12 వేలకు పైగా హెచ్1 బి వీసా అనుమతులు పొందింది. ఇప్పుడు ఈ వీసాలకు ఒక్కోదానికి లక్ష డాలర్ల వంతున వచ్చే మూడేళ్లలో ఒక్క అమెజాన్ సంస్థే ఏకంగా 3.6 బిలియన్ డాలర్లు అంటే రూ.31 వేల కోట్లు అదనంగా ఖర్చు చేయ వలసి వస్తుంది.

ఈ విధంగా మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎన్‌విడియా, ఒరాకిల్ తదితర టాప్ 5 ఐటీ దిగ్గజ సంస్థల వార్షిక ఆదాయం 80 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.7 లక్షల కోట్లు కాగా, ఈ ఐదూ కలిపి 10 వేల కొత్త హెచ్1 బీ వీసాల కోసం దరఖాస్తు చేస్తే తమ వార్షికాదాయం పై రూ.8 వేల కోట్ల మేర నష్టం సంభవిస్తుందని అంచనాగా తెలుస్తోంది. హెచ్1 బీ వీసాదారులైన ఉద్యోగుల సరాసరి వేతనం ఏడాదికి 100, 000 నుంచి 200, 000 డాలర్ల వరకు ఉంటుంది. అమెరికాలో మధ్యతరగతి ఆదాయం కన్నా ఇది చాలా తక్కువ. భారతీయ ఉద్యోగులు, కార్మికులు అక్కడ చాలా చవకగా తమ శ్రమను ధారపోస్తున్నా భారతీయ కన్సల్టింగ్ సంస్థలు సాధారణంగా తమ క్లయింట్ల నుండి ఏటా 150,000 నుంచి 200, 000 డాలర్ల వరకు వసూలు చేస్తుంటాయి. అంటే అక్కడ ఉద్యోగికి వచ్చే జీతం కన్నా ఎక్కువ.

Also Read : టిజిపిఎస్‌సి సభ్యులుగా మరో ముగ్గురి నియామకం

ఇందులో ట్రావెల్, వీసా దరఖాస్తులు,శెలవులు తదితర ఖర్చులన్నీ కలుపుకుని ఉంటాయి. ఈ ఉద్యోగాలకు అమెరికాలో ఉన్న డిమాండ్‌కు స్థానికంగా మానవ వనరులు లభించడం లేదు. 2024లో హెచ్1 బీ వీసాల్లో 71 శాతం భారతీయులే ఉన్నారు. వారంతా తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులు కాదు. ఇంజినీర్లు, రీసెర్చర్లు, ఆర్కిటెక్టులు, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి ఐటీ దిగ్గజాల్లో అత్యాధునిక సాంకేతిక నిపుణులుగా రాణిస్తున్నారు. ఇప్పుడు వీరందరిపై కేవలం చిన్నచూపే కాదు, వ్యూహాత్మకంగా అమెరికా తనకు తాను స్వీయ హాని తెచ్చుకున్నట్టే. అయితే హెచ్1 బి పద్ధతి దుర్వినియోగం మవుతోందని అమెరికా గగ్గోలు పెడుతుండటం నిజమే. కొన్ని సంస్థలు ఈ హెచ్1 బీ వీసాదారుల బలహీనతలతో ఆడుకుంటున్నాయి. తక్కువ వేతనాలు చెల్లించి చేతులు దులుపుకుంటున్నాయి.

కొన్ని దశాబ్దాలుగా తమ అత్యధిక నైపుణ్య సామర్ధాలతో అమెరికాను సాంకేతిక ఆధిపత్యస్థాయికి తీసుకువచ్చే వారెవరో తెలిసిందే. ఈ ప్రపంచాన్ని శిక్షించడమంటే మన స్వంత భవిష్యత్తును నాశనం చేయడమే. భారత దేశం విషయంలో ఈ సంకేతాలు దౌత్యపరమైన అంశానికి మించి కనిపిస్తున్నాయి. అమెరికా నైపుణ్యాలకే పన్ను విధించి అవకాశాలను పరిమితం చేస్తుంటే భారత దేశం మౌన ప్రేక్షకునిలా అంగీకరించడం మానుకోవాలి. అంతర్గతంగా దృష్టి కేంద్రీకరించాలి. ఈ యుగం చాలా వేగంగా సాగుతోంది. స్వదేశీ సామర్థాన్ని పెంపొందించుకోడానికి ఇదే సరైన అవకాశం. భారత్ కేవలం నైపుణ్య ఎగుమతిదారు కాకూడదు. ఆలోచనలకు, ఆవిష్కరణలకు, పెట్టుబడులకు గమ్యస్థానం కావాలి. వాషింగ్టన్ నుంచి వచ్చే సందేశం సుస్పష్టం. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల్లో స్థానిక అమెరికన్లకే మొదట ప్రాధాన్యం ఇవ్వడానికే ట్రంప్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని వైట్‌హౌస్ సమర్థిస్తోంది. గ్రేట్ ఎగైన్ అమెరికా సిద్ధాంతాన్ని తెరపైకి తెస్తోంది.

ఇప్పుడు నైపుణ్యానికే అత్యంత విలువ. భారత్ తగినట్టు స్పందించాలి. అవకాశాలకు కొత్త చిరునామా అవసరం. ఇది ప్రతీకారం కాదు. పునరుద్ధరణ కార్యక్రమం. భారతీయ నైపుణ్యాన్ని బహిష్కరిస్తే మనం దానిని అందిపుచ్చుకోవాలి. ప్రపంచ మేధో పరిజ్ఞాన ప్రముఖులు తదుపరి దేన్ని నిర్మించాలకుంటున్నారో దానికి భారత్ హబ్ గా రూపొందాలి. కృత్రిమ మేధ (ఎఐ), సెమీ కండక్టర్స్, రోబోటిక్స్, క్వాంటమ్, డ్రోన్ టెక్నాలజీ, తదితర సాంకేతిక, వైజ్ఞానిక పురోగతి (డీప్‌టెక్)లో ఉన్నంతగా ఈ ఆవశ్యకత మరెక్కడా లేదు. ఇవి 21 వ శతాబ్దంలో ప్రపంచ శక్తికి గట్టి పునాదులు. భారత్‌కు ముడి వనరులు ఉన్నాయి. ఆపైన నైపుణ్యం, రిస్క్ కోరుకునే స్టార్టప్‌లు, విధానపరమైన లక్షాలు ఉన్నాయి. భారత ప్రభుత్వం రూ. 10,000 కోట్లతో డీప్‌టెక్ ఫండ్‌ను ప్రారంభించింది. వచ్చే దశాబ్దానికి రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్, వాణిజ్యపురోగతి తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించడానికి భారత్‌కు రూ.లక్ష కోట్ల డీప్‌టెక్ మిషన్ అవసరం. ఇన్నాళ్లూ అమెరికా వంటి దేశాలపై ఆధారపడే కాలం నాయకత్వ యుగానికి దారి తీయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News