Tuesday, September 23, 2025

చివరి అంకానికి ‘స్థానిక’ ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

42 శాతం బిసి రిజర్వేషన్ల దాదాపు ఖరారు..?
బీసీలకు 13 జడ్పీ, 237 ఎంపీపీ, జడ్పీటీసీ,
2,421 ఎంపీటీసీ, 5,359 పంచాయతీ స్థానాలు..?
పంచాయతీరాజ్ శాఖ నుంచి ప్రభుత్వానికి నివేదిక..?
జివో జారీ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ఎస్‌ఇసి సిద్ధం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతోంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లే ప్రధాన అంశంగా ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉంది. ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావడంతో ఆ ప్రక్రియ చివరి అంకానికి చేరింది. రిజర్వేషన్లను తేల్చాల్సిన బాధ్యతను పంచాయతీరాజ్ శాఖకు అప్పగించడంతో ఆ శాఖ దాదాపుగా ఖరారు చేసి ప్రభుత్వానికి మంగళవారం అందజేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం పరిశీలన తర్వాత ప్రత్యేక జివోను జారీ చేస్తుంది. ఇందుకు అవసరమైన క్షేత్రస్థాయి ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇక రిజర్వేషన్లు కూడా తేలిపోవడంతో జిల్లాల్లో యంత్రాంతం సిద్ధంగా ఉంది.

రాష్ట్రవ్యాప్తంగా 12,760 గ్రామపంచాయతీలు, 1,12,534 వార్డులు, 5,763 ఎంపీటీసీలు, 565 ఎంపీపీలు, 565 జడ్పీటీసీలు, 31 జడ్పీ చైర్‌పర్సన్ స్థానాలకు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ సోమవారం రాత్రి వరకు ముమ్మరంగా సాగింది. వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎంపీడీవోలు, సర్పంచ్, ఎంపీటీసీల రిజర్వేషన్లను ఆర్డీవోలు, ఎంపీపీ, జడ్పీటీసీలకు జిల్లా కలెక్టర్లు, జడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్లు ఖరారు చేసి ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. బీసీ రిజర్వేషన్లకు 2024 కుల సర్వే వివరాలను పరిగణనలోకి తీసుకుని ఖరారు చేసినట్లు సమాచారం.

42 శాతం బిసిలకు రిజర్వేషన్ అమలైతే ఇలా ఉండొచ్చు
విశ్వసనీయ సమాచారం మేరకు 42 శాతం బిసి రిజర్వేషన్ల విధానం అమలైతే బీసీలకు 13 జడ్పీ, 237 ఎంపీపీ, జడ్పీటీసీ, 2,421 ఎంపీటీసీ, 5,359 పంచాయతీ స్థానాలు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం అధికారికంగా జీవో వచ్చిన తర్వాత మాత్రమే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఎస్సీ, ఎస్‌టి కులాలకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2019 ఎన్నికల్లో 2,345 గ్రామ పంచాయతీలు, 90 జడ్పీటీసీలు, 95 ఎంపీపీలు, 1,011 ఎంపీటీసీ స్థానాలను బీసీలకు కేటాయించింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టుకునేందుకు వీలుగా బిసిల రిజర్వేషన్లను పెంచేలా ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుపై కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. మరోవైపు హైకోర్టు విధించిన గడువు సెప్టెంబర్ 30 సమీపిస్తుండటంతో ప్రభుత్వం జివో జారీ చేసి రిజర్వేషన్లను అమలు చేసేలా ప్రత్యామ్నాయ మార్గాన్ని అనుసరిస్తోంది. దీంతో ఈ ప్రక్రియను కొనసాగించేందుకు గడువు పొడిగించాలని హైకోర్టును కోరే యోచనలో ప్రభుత్వం ఉంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పెంచుతూ జీవో తదితర అంశాలపై రానున్న రెండు మూడు రోజుల్లోనే జరిగే సీఎం, మంత్రుల సమావేశంలో అధికారికంగా ప్రకటన వస్తుందని సమాచారం. కాగా మరో వైపు ప్రభుత్వం నుంచి ప్రత్యేక జివో విడుదలైన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్దంగా ఉంది.

గ్రామ స్థాయి నుంచి ఎన్నికల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం
కాగా పంచాయతీ ఎన్నికలు, పరిషత్ ఎన్నికల నిర్వహణకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఎన్నికల తేదీలను ప్రభుత్వం ఏ క్షణమైనా ఖరారు చేస్తే సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్, జిల్లా కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, గ్రామ కార్యదర్శులందరికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కులాల వారీగా రిజర్వేషన్లు, బూత్‌ల వారీగా బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ బూత్‌ల ఏర్పాట్లలో పకడ్భంధీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాజకీయ పార్టీల గుర్తులపై ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలే మొదట జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అన్ని జిల్లాల్లోల్లో పంచాయతీ కార్యదర్శులు వార్డుల వారీగా ఓటర్ల జాబితాలపై కులాల వారీగా మార్కింగ్ మొదలుపెట్టారు.

రెండురోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తికావొచ్చునని తెలిసింది. రాష్ట్రం యూనిట్‌గా తీసుకొని ఆయా సామాజిక వర్గాలకు జడ్పీ సీట్లను ప్రభుత్వం కేటాయిస్తుంది. జిల్లాల వారీగా వీటిని పంచాయతీరాజ్ కమిషనర్ ఖరారు చేస్తారు. -ఎంపీపీల స్థానాలను ఏ స్థానం ఎవరికి రిజర్వ్ చేయాలనేది జిల్లా కలెక్టర్ నిర్ణయిస్తారు.- జెడ్పీటీసీ, ఎంపిటిసి స్థానాల రిజర్వేషన్లను కూడా జిల్లా కలెక్టర్ ఖరారు చేస్తారు. 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మొదట ఎస్టీలకు, ఆ తర్వాత ఎస్సీలకు, బీసీలకు, తర్వాత మహిళలకు సీట్లు రిజర్వు చేస్తారు. ఇక మిగిలిన సీట్లు జనరల్ కేటగిరీగా నిర్ధారిస్తారని అధికార వర్గాల సమాచారం. -కాగా సర్పంచ్‌ల రిజర్వేషన్, స్థానాలు ఆర్డీవోలు, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఎంపీడీవోల స్థాయిలో ఖరారు అవుతాయని చెబుతున్నారు. దీంతో స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు దాదాపు పూర్తి చేసింది. ఇక నిర్ణయం ప్రకటించడమే ఆలస్యమని తెలుస్తోంది.

Also Read: రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటం ఆడటం దుర్మార్గం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News