Wednesday, September 24, 2025

‘ఒజి’కి పెద్ద షాక్.. అందుకు నో చెప్పిన హైకోర్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఒజి’ (OG Movie). గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాపై పవన్‌ అభిమానులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటివరకూ చిత్రం నుంచి వచ్చిన ప్రతీ అప్‌డేట్ సినిమాపై హైప్‌లో అంతకంతకూ పెంచేశాయి. ఈ సినిమా టికెట్లను ఇప్పటికే వేలం పాటలో లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు పవన్ అభిమానులు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమాకు తెలంగాణ హై కోర్టు షాక్ ఇచ్చింది.

‘ఒజి’ (OG Movie) సినిమా ప్రీమియర్ షోలను ప్రదర్శించడంతో పాటు.. టికెట్ ధరల పెంపునకు ఇప్పటికే తెలంగాణ హోంశాఖ అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను సవాల్ చేస్తూ.. మహేశ్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టికెట్ల పెంపునకు అనుమతి ఇచ్చేందుకు హోంశాఖ స్పెషల్ సిఎస్‌కు ఎంలాటి అధికారాలు లేవని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దీంతో ఈ అనుమతులను కోర్టు రద్దు చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎన్‌.వి. శ్రవణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో ప్రీమియర్ షో టికెట్లు రూ.800 కాగా, సినిమా టికెట్లు సింగిల్ స్క్రీన్ రూ.100 (జిఎస్‌టితో కలిపి), మల్టీప్లెక్స్ రూ.150 (జిఎస్‌టితో కలిపి) పెంచేందుకు అనుమతి ఇచ్చారు. తాజాగా కోర్టు వీటిని రద్దు చేసిన నేపథ్యంలో బుధవారం రాత్రి నుంచి ప్రదర్శించే ప్రీమియర్ షోలు, ఇప్పటికే కొనుగోలు చేసిన టికెట్లపై సందిగ్ధం నెలకొంది.

కాగా, ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక మోహన్, విలన్‌గా ఇమ్రాన్ హష్మీ నటించారు. ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, శుభలేఖ సుధాకర్, అర్జున్ దాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్ సినిమాకు సంగీతం అందించారు.

Also Read : ‘తెలుసు కదా’ నుంచి సొగసు చూడతరమా…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News