Wednesday, September 24, 2025

రష్యా విమానాలను కూల్చేయాలి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : ప్రపంచంలోని రెండు బారీ శక్తుల మధ్య వివాదం ముదురుతోంది. నాటో కూటమి దేశాల గగనతల సరిహద్దులను ఉల్లంఘించి రష్యా ఫైటర్ జెట్లు దూసుకురావడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే రష్యా విమానాలను కూల్చేస్తామన్నారు. ఆయన ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఓ విలేకరి “ అలాంటి పరిస్థితుల్లో నాటోసభ్య దేశాలు, రష్యా విమానాలన కూల్చేయాలా ? ” అని ప్రశ్నించగా, దీనికి ట్రంప్ “అవును కూల్చేస్తాం” అని బదులిచ్చారు.

ఇటీవల కాలంలో నాటో దేశాలైన పోలాండ్, ఎస్తోనియా సహా పలు నాటో సరిహద్దుల్లోకి రష్యా ఫైటర్‌జెట్లు చొరబడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ట్రంప్ రష్యా , ఉక్రెయిన్‌పై ట్రూత్‌లో ఓ పోస్టు పెట్టారు. ఉక్రెయిన్ 2014 నుంచి కోల్పోయిన తన భూభాగం మొత్తం తిరిగి పొందగలదని తాను అభిప్రాయానికి వచ్చినట్టు పేర్కొన్నారు. ఈ యుద్ధం రష్యాను ఓ ‘పేపర్ టైగర్’గా మార్చేసింది. ఈ యుద్ధం వల్ల దానికి భారీగా డబ్బు ఖర్చవుతోంది. పెట్రోలియం విక్రయాలతో నిధుల సంపాదన కష్టంగా మారిందన్నారు. “సమయం, ఓపిక, ఐరోపా సమాఖ్య, ముఖ్యంగా నాటో మద్దతుతో ఉక్రెయిన్ తన భూభాగం తిరిగి పొందడం ఎందుకు సాధ్యం కాదు. అంతకు మించి కూడా పొందవచ్చునేమో ఎవరికి తెలుసు. పుతిన్, రష్యా భారీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. ఉక్రెయిన్ చేతలకు సమయం ఆసన్నమైంది” అని ఆ పోస్టులో హెచ్చరించారు.

ట్రంప్ పోస్టు భారీ మార్పునకు చిహ్నమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. అమెరికా నాయకుడు ఓ గేమ్ ఛేంజర్ అని అభివర్ణించారు. ట్రంప్‌తో భేటీ సమయంలో యుద్ధ క్షేత్రంలో ఏం జరుగుతోందో తాను వివరించినట్టు చెప్పారు. ఆయనకు మరిన్ని విషయాలు కూడా తెలుసని చెప్పారు. ట్రంప్ పోస్టు చేసిన కొద్ది సేపటికి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో మాత్రం దీనికి భిన్నంగా స్పందించారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని సైనిక చర్యలతో ముగించలేమన్నారు. కేవలం చర్చల ద్వారానే ఇది సాధ్యమని తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఐరాస భద్రతా మండలి సమావేశంలో పేర్కొన్నారు. ఈ ప్రమాదకర సంక్షోభానికి శాంతియుత పరిష్కారం తీసుకొచ్చేందుకు అమెరికా అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు.

Also Read: చైనాలో ప్రపంచంలోనే మొట్టమొదటి ‘కృత్రిమ మేధ’ ఆస్పత్రి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News