న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం దేశంలో వైద్య విద్య విస్తరణ, లక్షలాది మంది రైల్వే ఉద్యోగుల బోనస్‌కు సంబంధించి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. దేశంలోని 10.9 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు ఉత్పాదక అనుసంధాన పద్ధతిన 78 రోజుల బోనస్‌ను ప్రకటించింది. దసరా దివాళి నేపథ్యంలో రైల్వే ఉద్యోగులకు ఈ మేరకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఇక దేశంలో వైద్య విద్య సామర్థం మరింత విస్తరించుకునేలా ఇప్పుడున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడికల్ కాలేజీల అప్‌గ్రేడ్ ద్వారా 5000 వరకూ మెడికల్ పిజి సీట్లు పెరుగుతాయి. దేశంలో మెడికల్ పిజి యుజి సీట్ల పెంపుదల పధకం ఫేజ్ 3లో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని వివరాలను ఆ తరువాత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలిపారు. విస్తారిత పథకంతో దేశంలో ఇక మొత్తం మీద కొత్తగా 5వేల పిజి సీట్లకు ఆమోదం తెలిపారు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం (సిఎస్‌ఎస్) పరిధిలో 202829 నాటికి వరకూ ఎంబిబిఎస్ సీట్లు పెంచాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఇక ప్రతి సీటుకు ఇప్పుడున్న వ్యయ పరిమితిని రూ 1.50 కోటిగా ఖరారు చేశారు.
దేశంలో వైద్య విద్య విస్తరణ కార్యక్రమం దశల వారిగా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించుకుంటూ సాగుతుంది. ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో స్పెషాల్టీ, సూపర్ స్పెషాల్టీల వైద్య విద్యకు మరింత అవకాశం ఏర్పడుతుందని మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో అదనపు పిజి సీట్లను , నూతన స్పెషాల్టీ వైద్యకోర్సులను నెలకొల్పడం జరుగుతుందని మంత్రి వివరించారు. పిజి , ఎంబిబిఎస్ మెడికల్ సీట్ల పెంపుదలకు సంబంధించిన నిర్ణయాన్ని సమగ్ర రీతిలో అమలుపర్చేందుకు కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాలు వెలువరిస్తుందని మంత్రి తెలిపారు. దేశంలో దుర్గాపూజా, విజయదశమి సెలవుకు ముందు ప్రతి ఏటా అర్హులైన రైల్వే ఉద్యోగులకు ఇచ్చే ఉత్పాదక సబంధిత బోనస్ (పిఎల్‌బి)కి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని రైత్వేల మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మొత్తం 10,91,146 మంది రైల్వే ఉద్యోగులకు వారి గణనీయ పనితీరు ప్రాతిపదికన బోనస్ ఉంటుంది. దీనిని 78 రోజుల వేతనం లెక్కన చెల్లించడం జరుగుతుంది. దీని మొత్తం రూ 1,886 కోట్లు అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. బోనస్ రైల్వేలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు వర్తిస్తుంది. మొత్తం మీద ఉద్యోగులకు చెల్లించే బోనస్ గరిష్టంగా రూ 17,951 వరకూ ఉంటుంది.రైల్వేలోని పలు కేటగిరిల సిబ్బంది ట్రాక్ మెయింటేనర్స్, లోకో పైలట్లు, గార్డు, స్టేషన్ మాస్టర్స్, సూపర్‌వైజర్లు, టెక్నిషియన్స్, హెల్పర్స్, పాయింట్స్‌మెన్ , మినిస్టిరియల్ స్టాఫ్,
ఇతర గ్రూప్ సి స్టాఫ్‌నకు అంటే ఎక్కువగా క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి బోనస్ వర్తిస్తుంది. 2024 25 ఆర్థిక సంవత్సరంలో రైల్వేల పనితీరు చాలా బాగుందని అధికార వర్గాలు తెలిపాయి. రికార్డు స్థాయిలో రైల్వేలో 1,614.90 మిలియన్ టన్నుల సరుకుల లోడ్ జరిగింది. దాదాపుగా 7.3 బిలియన్ల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసిందని అధికారిక ప్రకటనలో తెలిపారు. కేంద్ర మంత్రి మండలి సమావేశంలో బీహార్‌కు సంబంధించి రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భక్తియార్‌పూర్ రాజ్‌గిర్ తిలైయా సింగిల్ లైన్ డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 104 కిలోమీటర్ల దూరపు ఈ పనులకు రూ 2192 కోట్ల వ్యయ అంచనాలు వేశారు. బీహార్‌లో ఈ ఏడాది చివరిలో ఎప్పుడైనా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. బీహార్‌లో అత్యంత చారిత్రక కట్టడాలు రాజ్‌గిర్ శాంతిస్థూపం, నలందా, పవాపురి వంటి చోట్లకు రైల్వే లైన్ డబ్లింగ్ వల్ల యాత్రికుల సంఖ్య పెరుగుతుందని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇక బీహార్‌కు సంబంధించే నాలుగులైన్ల సాహెబ్‌గంజ్ అరెరాజ్ బెటాయ్ సెక్షన్‌లో ఎన్‌హెచ్ 139 డబ్లుపై దాదాపు 79 కిలోమీటర్ల రాదారి నిర్మాణానికి కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ రహదారి నిర్మాణ వ్యయం రూ 3822.31 కోట్లుగా అంచనావేశారు. ఈ రాదారితో పాట్నాకు రాష్ట్రంలోని పలు మారుమూల ప్రాంతాల నుంచి సరైన రోడ్డు సౌకర్యం ఏర్పడుతుంది.
Also Read: బిసి రిజర్వేషన్లపై పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు