Thursday, September 25, 2025

సుంకాల దెబ్బతో ‘స్వదేశీ’ గానం

- Advertisement -
- Advertisement -

భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల ముందు (సెప్టెంబర్ 21, 2025) జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ‘స్వదేశీ’ని మరోసారి పునరుజ్జీవింపు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్‌లు, హెచ్-1బి వీసా, ఫీజులు లక్ష డాలర్లకు పెంచిన నిర్ణయం వల్ల భారతీయ ఐటి కంపెనీలు, ఉద్యోగులు కష్టాల్లో పడ్డారు. ఈ నేపథ్యంలో మోడీ ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘స్వదేశీ 2.0’ అని పిలుపునిచ్చారు. ‘మన పెద్ద శత్రువు విదేశీ వస్తువులపై ఆధారపడటం’ అని చెప్పి, నవరాత్రి నుంచి ‘బచత్ ఉత్సవ్’ (సేవింగ్స్ ఫెస్టివల్) ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇది జిఎస్‌టి 2.0 సంస్కరణలతో కలిపి విదేశీ వస్తువులను తిరస్కరించి స్వదేశీ ఉత్పత్తులు వాడమని సూచించారు. కానీ, ఇంటా బయటా ఈ మోడీ పిలుపు ప్రజల కోసం మా!, తన కోసం (మోడీ కోసం) కాదా! అనే చర్చ ప్రజలు మధ్య రగిలిపోతోంది.

ఎందుకంటే మోడీ నిత్యం ధరించే దుస్తులు (ఫారిన్ డిజైన్‌లు), స్పెట్స్ (ఇటాలియన్ బ్రాండ్), షూస్, వాచ్ (స్విస్), పెర్ఫ్యూమ్ స్ప్రేలు అన్నీ విదేశీ ఉత్పత్తులే. తినే ఆహారం (ఇంటర్నేషనల్ బ్రాండ్స్), తాగే పానీయాలు (కోక్, పెప్సీలా, వాటర్), వాడే వాహనాలు (బోయింగ్ జెట్‌లు, మెర్సిడెస్ బెంజ్ కార్లు, ఇతర విదేశీ కంపెనీలకు చెందిన 60 కార్లు) కూడా ఫారిన్. భారత్‌లో కాకుండా విదేశీ పర్యటనలు (గత ఏడాది 50 దేశాలు) ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ భారతీయులను అమెరికా ఉద్యోగాల నుంచి తొలగించి, ఇక్కడికి పంపితే ఆ కోపంతో ‘స్వదేశీ’ మంత్రం జ్ఞాపకం వచ్చిందా! అందుకే ఈ హిత బోధలు చెస్తూన్నారా? ఇది కేవలం ప్రధానికి ఆచరణలో అనుభవం లేని విషయాలను మాత్రమే ప్రజలకు చెబుతున్నారా? అనే సందేహాలు సాధారణ ప్రజలకు కలుగుతున్నాయి. ఎందుకంటే పేదలు, సాధారణ, దిగువ మధ్యతరగతి ప్రజలు ఎలాగూ అత్యంత ఖరీదైన విలాసవంతమైన వస్తువులు కొనలేరు. విమానాలు ఎక్కలేరు. వ్యాపార ప్రకటన వల్ల ఎంత గాఢమైన కోరికలు వారికి కలిగినా బలవంతంగా ఆ కోర్కెలు తీర్చుకొనే ఆదాయం కూడా వాళ్ళకు ఉండదు.

మన దేశంలో నూటికి 90% ప్రజలు ఉప్పు, పప్పు, వంట నూనె, కూరగాయలు, గ్యాస్, మందులు, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం మొదలైనవి అందుబాటు ధరల్లో దొరికితే చాలు అనుకునే పేదలు, దిగువ మధ్యతరగతి వారే అధిక సంఖ్యలో ఉన్నారు. వారికి మేలు జరిగితే చాలు. గత ఎనిమిదేళ్ళుగా జిఎస్‌టి సామాన్య ప్రజలు ఆర్థిక, పరిపాలనా గానుగలో నలిగిపోయారు. ప్రజల రక్తమాంసాలు వివిధ ట్యాక్స్‌ల రూపంలో పిండి అదానీ, అంబానీ లాంటి బడా కార్పొరేట్ కంపెనీల ఓనర్లకే సకలం సమకూర్చి తరించిపోయారు. జిఎస్‌టితో రాష్ట్రాల ఆదాయాన్ని నిలువు దోపిడీ చేసి గవర్నర్ల పాలనా కిరికిరీలతో రాష్ట్రప్రభుత్వాలను భ్రష్టుపట్టించారు. ఇప్పుడు అనుంగు మిత్రుడు ట్రంప్ దయవల్ల ఇంత కాలానికి స్వదేశీ వస్తువులను మాత్రమే వాడాలి అనే నినాదం ప్రధానమంత్రి మోడీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి జ్ఞానోదయం కలిగించినందుకు భారత ప్రజలు ట్రంప్ కు కృతజ్ఞతలు చెప్పాలి.

బహుశా ఇంత కాలానికి ప్రధాని మోడీ స్వదేశీ పిలుపు వ్యూహాత్మకంగా సరైనది. ట్రంప్ టారిఫ్‌లతో భారత్ ఎగుమతులు (ముఖ్యంగా ఐటి, ఫార్మా) ఎగుమతులు 20- 30 శాతం తగ్గిపోవచ్చు. హెచ్-1బి వీసా ఫీజు ఐటి సంస్థల మార్జిన్‌లు దెబ్బ తీస్తాయి. స్వదేశీ ప్రచారం ద్వారా భారతీయ కంపెనీలు (జోహో, పేటిఎం) పెరిగి, ఉద్యోగాలు సృష్టించవచ్చు. కానీ, ప్రధాని నాయకత్వ వ్యక్తిగత జీవితం ప్రజలకు ఉదాహరణగా, మార్గదర్శకంగా ఉండాలి కదా! మోడీ తన జీవనశైలిని మార్చుకోకపోతే, ఇది కేవలం ‘డొల్ల’ మాటలుగానే మిగిలిపోతాయి. గాంధీజీ ‘స్వదేశీ’ విధానంలో తాను స్వయంగా నూలు వడికారు. నేత ఖద్దరు దుస్తులు జీవితాంతం తయారు చేసుకుని ధరించారు. ఆయన ప్రజలకు ఏమి చెప్పారో అంతకంటే ముందు స్వయంగా ఆచరించి, ఆ తర్వాతనే ఇతరులకు బోధించేవారు. అందుకే, ఆయన మాటలకు, చేతలకు మధ్య వైరుధ్యాలు ఉండేవి కావు. అది నిజమైన ప్రేరణ.

ఇప్పుడు, ప్రభుత్వం ఫారిన్ లగ్జరీ బ్రాండ్స్‌పై ట్యాక్స్ పెంచి, స్వదేశీ పరిశ్రమలకు సబ్సిడీలు ఇస్తే మంచిది. లేకపోతే, ఇది కేవలం ఒక రాజకీయ నినాదంగా మిగిలిపోతుంది. ప్రజలకు విదేశీ వస్తువులు దేశీయ మార్కెట్‌లో అంగళ్ళలో అందుబాటులో లేకుండా ప్రభుత్వం చేయగలిగితే బాగుంటుంది. అప్పుడే విదేశీ వస్తువులపై వ్యామోహం కలగకుండా కొంత మేరకు అయినా కోర్కెలు అదుపులో పెట్టుకొనేందుకు అలవాటు పడే అవకాశం ఉంటుంది. దేశంలో మీడియా, ఇంటర్నెట్ ద్వారా, విదేశీ వస్తువుల వ్యాపారం జరగకుండా చూడాలి. వ్యాపార ప్రకటనలు నిలుపుదల చేయాలి. మరి ప్రధాని మోడీ ఆ పని చేయగలరా? మహాత్మాగాంధీ వలే స్వయంగా స్వదేశీ వస్తువులను మాత్రమేవాడి పరోక్షంగా విదేశీ వస్తువుల బహిష్కరణలకు తోడ్పాటు అందించి, ప్రజలకు స్ఫూర్తిని ఇచ్చే పని చేయగలరా? వేచి చూద్దాం ఏం జరుగుతుందో.

భారతదేశంలో మీడియా స్పందన మిశ్రమంగా ఉంది. సానుకూలంగా, న్యూస్18లోని ఒక ఆర్టికల్‌లో రచయిత అభిజిత్ మజుందర్ మోడీ స్వదేశీ పిలుపును ‘వ్యూహాత్మక ప్రతిస్పందన’గా చెప్పారు. ట్రంప్ టారిఫ్‌లకు భారత్ స్వదేశీతో సమాధానం ఇస్తోందని, ఇది ఆర్థిక స్వాతంత్య్రానికి దారితీస్తుందని అన్నారు. హిందుస్తాన్ టైమ్స్‌లోని ఒక ఆర్టికల్, జిఎస్‌టి సంస్కరణలను స్వదేశీతో జోడించి ‘బచత్ ఉత్సవ్’ను సానుకూలంగా చూపింది. మంత్రి అశ్వినీ వైష్ణవ్ జోహోకు మారి, ‘అందరూ స్వదేశీలో చేరండి’ అని ట్వీట్ చేశారు. ఇది ఎన్‌డిటివిలో వచ్చింది. అయితే, విమర్శలు కూడా ఎక్కువగానే కన్పించాయి. టైమ్స్ ఆఫ్ ఇండియాలోని ఒక ఆర్టికల్‌లో ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్, మీరు విదేశీ జెట్‌లో తిరుగుతూ స్వదేశీ మాట్లాడతారా? అని ప్రశ్నించారు. ఆప్ ఎంపి సంజయ్ సింగ్, మోడీ ఇటలీ గ్లాసెస్, స్విస్ వాచ్, అమెరికన్ ఫోన్ ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఎకనామిక్ టైమ్స్‌లో కూడా ఈ విమర్శలను హైలైట్ చేశారు.

శివసేన యుబిటి నేత సంజయ్ రౌత్, మోడీ ప్రసంగం ‘ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్’ సమయంలో జరిగిందని విమర్శించారు. ది హిందూ ఆర్టికల్‌లో కాంగ్రెస్, ఆప్ నేతలు, మోడీ ట్రంప్ స్నేహితుడు అయినప్పటికీ మోడీ నుండి బలమైన ప్రతీ స్పందన లేకపోవడాన్ని తప్పుపట్టారు. ఈ విషయంలో విదేశీ మీడియాలో స్పందన తక్కువగానే కనీపించింది. కానీ ఆసక్తికరంగా ఉంది. (రాయిటర్స్) ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో, ట్రంప్ టారిఫ్‌ల నేపథ్యంలో స్వదేశీని ఉద్రిక్తతల మధ్య ప్రతిస్పందనగా చూపింది. (టిసిఎస్) న్యూస్ (బంగ్లాదేశ్) వాణిజ్య ఉద్రిక్తతలపై దృష్టి పెట్టి, హైపోక్రిసీని ప్రస్తావించ లేదు. యాహూ న్యూస్, ట్రంప్ హెచ్1బి వీసా ఫీజు పెంపును కవర్ చేస్తూ, స్వదేశీ ప్రచారాన్ని తాకింది. అయితే, విదేశీ మీడియా హైపోక్రిసీ కంటే వాణిజ్య ఉద్రిక్తతలపై ఎక్కువ దృష్టి పెట్టింది. మొత్తంగా మోడీ స్వదేశీ పిలుపు భారత్ ఆర్థిక స్వాతంత్య్రానికి అవకాశం ఇస్తుంది. కానీ, నాయకులు మాటలతో కాకుండా చర్యలతో మారాలి. ప్రజలు స్వదేశీని స్వచ్ఛందంగా అనుసరిస్తే, ట్రంప్ టారిఫ్‌లు భయపెట్టవు. లేకపోతే, ఇది కేవలం రాజకీయ నాటకంగా మిగిలిపోతుంది.

Also Read: ఇరాన్‌లో ఆగని ఆర్తనాదాలు

డా. కోలాహలం రామ్ కిశోర్
98493 28496

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News