Monday, May 20, 2024

అదృశ్యమా? అణచివేతనా?

- Advertisement -
- Advertisement -

హాంగ్‌కాంగ్ : చైనాకు చెందిన ప్రముఖ టెక్ బ్యాంకింగ్ వ్యాపారి బావో ఫ్యాన్ జాడ తెలియడం లేదు. చైనాలో బావో అత్యున్నత స్థాయి బ్యాంకర్లలో ఒక్కరు. పైగా టెక్నాలజీ రంగంలో దిగ్గజ డీల్‌మేకర్‌గా ఉంటూ వస్తున్నారు. టెక్ రంగంలో పలు వ్యాపారాలతో విజయదిశలో ఉన్నాడు . బానోకు చెందిన చైనా రెనైస్సాన్స్ హోల్డింగ్ లిమిటెడ్ పలు రకాలుగా పెట్టుబడుల వ్యాపారంలో ఉంటూ వచ్చింది. దేశంలోని అతి ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులలో ఒక్కటిగా ఉంది. అయితే ఈ సంస్థకు చెందిన షేర్లు ఉన్నట్లుండి శుక్రవారం నుంచి పతనం చెందుతూ వచ్చాయి. ఈ విషయంపై ఆందోళన చెందిన కంపెనీ వర్గాలు తమ సంస్థ వ్యవస్థాపకులు బానో తమకు అందుబాటులోకి రావడం లేదని తెలిపాయి. ఆయనను ఎన్ని స్థాయిల్లో ప్రయత్నించినా సంప్రదించడం కుదరడం లేదని వివరించాయి. ఈ వర్గాలు తమ ఆందోళనను గురువారమే హాంగ్‌కాంగ్‌లోని స్టాక్ మార్కెట్‌కు తెలిపాయి. బానో జాడ తెలియని స్థితిలో హాంగ్‌కాంగ్ షేర్ల లావాదేవీల ట్రెడింగ్‌లో 50 శాతం పతన పరిస్థితి ఏర్పడింది.

పలు షేర్లు గణనీయంగా పడిపోతూ వచ్చాయి. బావోకు పలు రకాల టెక్ ఒప్పందాలు కుదిర్చిన విశేష వ్యాపార అనుభవం ఉంది. ఇ కామర్స్ కంపెనీ జెడి.కామ్‌కు చెందిన రెండు బిలియన్ల పబ్లిక్ ఆఫరింగ్‌లో , కుయిషో వీడియో ప్లాట్‌ఫాం పబ్లిక్ లిస్టింగ్‌లో ప్రముఖ పాత్ర వహించారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? ఎందుకు తమకు అందుబాటులోకి రావడం లేదనేది తెలియడం లేదని కంపెనీ వర్గాలు తెలిపాయి. బిజినెస్‌పరంగా ఆయనతో రోజువారి సంప్రదింపుల క్రమంలో ఇప్పుడీ పరిణామం పట్ల రైనెస్సాన్స్ కంపెనీ ఆందోళన తీవ్రతరం అయింది. బిజినెస్ వ్యవహారాలకు సంబంధించి ఆయన కనబడకుండా పొయ్యారా? లేక ఇతరత్రా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అనేది తెలియడం లేదని ఈ వర్గాలు పేర్కొన్నాయి. శుక్రవారం ఈ కంపెనీకి చెందిన షేర్లు సగానికి సగం పడిపోయ్యాయి. కాగా ఈ ప్రముఖ వ్యాపార దిగ్గజం కన్పించకుండా పోయినట్లు వచ్చిన వార్తలపై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ సమాధానం తెలియచేయలేదు. తమకు దీనిపై ఎటువంటి సమాచారం లేదని అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ తెలిపారు. చైనాలో చట్టపరమైన పాలన ఉంది.

చట్టప్రకారం చైనీయుల హక్కుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ఈ ప్రముఖ వ్యాపారి పరిస్థితి గురించి ఇప్పుడు కంపెనీ షేర్ల దిగజారుడు క్రమంలోనే ప్రపంచానికి తెలిసివచ్చింది. కానీ ఆయన ఎప్పటి నుంచి కన్పించకుండా పొయ్యారనేది స్పష్టం కావడం లేదు. తమకు ఎదురుతిరిగే టెక్, వ్యాపార వర్గాలపై చైనాలోని జిన్‌పింగ్ సారథ్యపు ప్రభుత్వ యంత్రాంగం పలు విధాలుగా ఉక్కుపాదం మోపుతూ వస్తున్న అంశం చైనాలో సర్వసాధారణం అయి ఉంది. ఈ క్రమంలో ఈ బానో అదృశ్యం తిరిగి ప్రపంచవ్యాప్తంగా టెక్ వర్గాలలో సంచలనంగా మారింది. అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకులు జాక్ మా కూడా జాడ లేకుండా పొయ్యారు. అదే విధంగా ఇప్పుడు జాడలేకుండా పోయిన బ్యాంకర్ బానో సంస్థ ఆర్థిక అగ్రసంస్థగా ఉంది. ఇటీవలి కాలంలో ఆయనకు తరచూ ప్రభుత్వ వర్గాల నుంచి విచారణ ఎదురవుతోందని, అధికారులు పలు విషయాలపై ఆరా తీస్తూ వస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.

పలు విషయాలపై తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా తెలియచేస్తాడనే పేరున్న బానో కన్పించకుండా పోవడం చైనా పెట్టుబడుల, పరిశ్రమల వర్గాలలో తీవ్ర ఆందోళనకర పరిస్థితిని తెచ్చిపెట్టింది. రాజకీయ ప్రత్యర్థులు కానీ, వ్యాపార, సాంకేతిక దిగ్గజాలు కానీ చైనాలో అధికార యంత్రాంగం విచారణల పరిధిలోకి వచ్చిన దశల్లో చాలా కాలం వరకూ బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేని స్థితికి గురి కావడం చైనాలో పరిపాటి అయింది. అయితే ఏ కారణంతో చైనా ప్రభుత్వం ఆయనను తాను ఎంచుకున్న బ్లాక్‌లిస్ట్‌లోకి చేర్చింది? ఎందుకు ఆయనను విచారణకు పిలిచింది? ఈ క్రమంలోనే ఆయన కన్పించకుండా పొయ్యారా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనేది ఇప్పుడు డ్రాగన్ సస్పెన్స్ అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News