Friday, March 29, 2024

మత స్వేచ్ఛకు సురవరం మద్దతు

- Advertisement -
- Advertisement -

“ఈ మహాసభ రైతు సమస్యయు, హరిజన సమస్యయు మన రాష్ర్టమున ఇది వరకెప్పుడును లేని యుగ్ర రూపము దాల్చియున్న సమయమున సమావేశమగుచున్నది… కనుక మహాసభవారి ఆలోచనలో ఈ రెండు సమస్యలకును ప్రాముఖ్యత ఒసగబడవలసియుండును. హరిజన సమస్యయు నిరుడే విషమించుటకు ప్రారంభించినది. బ్రిటీషిండియాలోని అంబేద్కర్ శంఖారావమునకు మన రాష్ట్ర మందు కొందరు హిందూమతమునుండి లేచిపోవలెనని ఘోషింప ప్రారంభించగా, ఇతరు మతస్థులు కొందరు ఇదే సమయమని మన “హరిజను”లను కొందరిని కొద్ది కొద్ది ద్రవ్యాశపెట్టి తమ తమ మతములలో కలుపుకొనుటకు యత్నించుచున్నారు. మన సనాతనులకింకను హరిజన సమస్య విషయమున సమరస భావము కల్గినట్లు కనిపించుటలేదు… ఎవడైనను సరే హిందూ మతము కంటె ఇంకొక మతమే తనను భగవంతుని చేర్చుటకు ఎక్కువ తగినదని నమ్ముచో అతడు ఆ మతములో చేరిన విచారపడవల్సిన పని లేదు” (గోలకొండ పత్రిక సంపాదకీయాలు- 2 పుటలు 35- 38). ఈ సంపాదకీయం మహాసభ పయనదిశను సూచించింది.

ఈ సభల అనంతరం “ఆంధ్రమహాసభ” ను అనగా ఆంధ్రోద్యమాన్ని తిరస్కరిస్తూ ‘రహబరె దక్కన్’ అనే పత్రికలో వచ్చిన వ్యాసాన్ని (వ్యాసకర్త: సయ్యదు మహమ్మదు అబ్బాసు) అనువదింపజేసి గోలకొండ పత్రిక (27.1.1936)లో అచ్చేసి, తెలంగాణ జాతీయతను ప్రస్ఫుటీకరిస్తూ సమాధానం రాసినాడు, భారత జాతీయత, దక్కన్ జాతీయతను ప్రస్ఫుటీకరిస్తూ సమాధానం రాసినాడు, భారత జాతీయత, దక్కన్ జాతీయత, తెలంగాణ జాతీయత గురించి జరిగిన ఈ చర్చను మొత్తంగా తెలుసుకోవడం అవసరం అది ఇది. ‘ఆంధ్రోద్యమాన్ని ముస్లింలు, యువకులు అర్థం చేసుకొన్న విధానము ఈ వ్యాసమును బట్టి తెలుస్తుంది’
(ఆంధ్రమహాసభ పరిధి)“తెలంగాణాల జిల్లాల వరకు మాత్రమే యేలనిర్ణయించుకొనిరి? సభ్యత్వకవాటము రాష్ట్రము యొక్క యితర (కర్నాటక,మహారాష్ర్ట) ప్రజలకేల బంధింపబడుట అవసరమని భావింపబడినది?…యీ రెండు ప్రాంతముల ప్రజల యీ దృక్పథము బలవంతమయ్యెడిచో…హైదరాబాదు సంస్థానము యొక్క యేక రాజకీయ స్వరూపత్వము నిలువజాలకుండును… ఆంధ్ర, మహారాష్ట్ర ఉద్యమములు దక్కన్ జాతీయతకు, రాష్ట్ర రాజకీయ స్వరూపమునకు గొప్ప నష్టమును వాటిల్లజేయును కావున యవి తక్షణమే సమసిపోవలయును… భారత దేశ విభజనము భాషాప్రయుక్త విధానముపై గావింపబడెడిచో జాతీయత మిగిలి యుండజాలదు.. జాతీయైక్యత కొరకు సార్వజనిక భాషయుండుట తప్పనిసరియగు విషయము… ఇందువలన రాష్ట్ర విభజనము భాషా ప్రయుక్త విధానముపై గావింపబడినచో భారత జాతీయతకు నష్టమగునని స్పష్టముగా తేటపడుచున్నది” అని ఆ వ్యాసకర్త రాసినాడు.

దీనికి సురవరం ఇలా సమాధానం చెప్పినారు,“భళీ! హైదరాబాదు రాష్ర్టమున గొప్ప జాతీయవాది బయలుదేరినాడు? వీరు ఆంధ్రమహాసభపై గురిపెట్టిరి… సభ్యత్వకవాటము యితర ప్రాంతీయుల కెందుకు రాకుండ బంధించవలెను ప్రభుత్వమువారే తెలంగాణ, మరట్వాడా విభాగములను చేసిరని మన వ్యాసకర్త మరచియుండెనా?.. కాన దేశమునకు అంతర్విభాగములు సహజములు, తిరిగి అంతర్విభాగములందు వివిధ సాంప్రదాయములను గుర్తింపవలెను. దేశీయ సాంప్రదాయములలో భాషకున్న స్థానము మరిదేనికి లేదు… ఘనత వహించిన ప్రభువుగారి భాషను రాజభాషగా చేసిననూ హైద్రాబాదు రాష్ర్టములో ఆంధ్రము ప్రథమ గణ్యస్థానమునలంకరించుచున్నది…

దక్కను జాతీయతపై మమకారము గల వానికి భారత జాతీయతను గురించి ప్రసక్తి ఏల?…మైసూరు విద్యాశాఖ డైరెక్టరు మొన్నటి కన్నడ సాహిత్య పరిషత్తులో యిట్లు వచించెను “…సామాన్య ప్రజావళికి యందుబాటులో నుండునట్లును మనభాషను వాఙ్మయమును వృద్ధి చేయవలెను… విద్యా విధానములో మాతృభాషలనుపోషించు బాధ్యత విశేషముగనున్నది” రెవెరెండు ధర్ అను మహనీయుడు ఈ విధముగ మాతృభాష ఉత్కృష్టతను వర్ణించెను.“…మాతృభాష అతిపవిత్రమై, వ్యక్తిగతమై, సన్నిహితమై అన్యుల కొసంగబడ జాలనిదైన ఆత్మీయమగు అమూల్యసంపద. ఈ హక్కును పరులు ధిక్కరింపరాదు. దానిని ఎన్నడును విడనాడకూడదు.

మన మానసిక వికారము, విజ్ఞాన నైతిక ఆధ్యాత్మిక పరిణామముకును మాతృభాషకును అవినాభావాసంబంధము. మన స్వాతంత్య్రమునకు మాతృభాషా స్వాతంత్య్రము మూలాధారము. భాషా స్వాతంత్య్రమును తొలగించినచో మన స్వాతంత్య్రము భగ్నమగును… భారత ప్రభుత్వము వారు భాషా ప్రయుక్త విధానముననుసరించియే సింధు ఉత్కల రాష్ర్టములను విభజించినారు. కాంగ్రెసు వారు భాషా పద్ధతినే రాష్ట్ర సంఘములు నేర్పరచియున్నారు… గాన నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ హైదరాబాదు ఏర్పడుటకు ఎంతమాత్రము (జాతీయవాదం)అడ్డురాదు. (నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలు 1. పుటలు- 749- 756) ఈ సభల అనంతరం 9-1-11936 న రాసిన సంపాదకీయంలో సభల తీరును సమీక్షించినాడు. తాను పైన సూచించిన విధంగా వ్యాయామ పోటీలు, నాటక ప్రదర్శనలు, పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శనం జరగడాన్ని స్వాగతించినాడు.

పైన ప్రస్తావించిన బాల్యవివాహ చర్చలో సనాతనులు ఓడి, ఆధునికులు (సంస్కరణ ఉత్సాహులు) గెలవడాన్ని అభినందించినాడు. సభా కార్యక్రమాలు తెలుగులోనే ఉండాలనే చర్చలో తెలుగు భాషావాదులు విజయం సాధించడాన్ని కూడా అభినందించినాడు. ఆయన మాటల్లోనే చూద్దాం.

“ఈసారి సిరిసిల్లలో జరిగిన చతుర్ధ నిజాం రాష్ట్రాంధ్ర మహాసభకు హైద్రాబాదు నగరము నుండి పోయిన 13 బస్సులతో సహా మొత్తము వివిధ ప్రాంతముల నుండి 30 బస్సులలో (రావడం).. ఈ సభల యందు ఆదరమును సూచించును… ఆంధ్రసభల వృత్తాంతములు … బ్రిటిషిండియాలో ఒక్కటే దిన పత్రికగా నుండిన ఆంధ్ర పత్రిక యందు వచ్చుట ప్రారంభమయ్యెను… టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో గూడ కొద్దియే గొప్పయో యీ సభ వార్త వచ్చినది. కాబట్టి ఆంధ్రోద్యమ అంకురము నానా దిక్కుల కొమ్మలను వేయనారంభించినదన్నమాట. గత ఖమ్మం మహా సభలో యెవరో సనాతనులమని ప్రకటించుకొనుచు వివాహ వయో నిర్ణయమునకు సంబంధించిన తీర్మానము మున్నగు రెండు మూడు సంఘ సంస్కరణపు తీర్మానములను తుదకు చర్చకైనను రానీయకుండ, పడగొట్టి యుండిరి… నిరుడు సంఘ సంస్కరణ తీర్మానములు పడగొట్టబడినపుడు అనేకులు సంస్కరణ ఉత్సాహులు, ఎవరో తీర్మానములను పడగొట్టజూచుటయు మీరు లొగుటయున్నాయని నాయకులపై చాలా కోపించి యుండిరి.

1. ఇపుడా పక్షమువారు మొదటి విజయము పొందినారు. బాలికలకు 15 ఏండ్ల వయస్సు వచ్చు వరకు వివాహము చేయరాదని సంస్కరణోత్సాహుల వాదము. దీనికి సనాతనుల పక్షము తీవ్రముగా ప్రతిఘటించి ఓడిపోయినను పిమ్మట మహాసభలో ఆ తీర్మానముపై చర్చ జరిగి సంస్కరణ ప్రతిఘటన … ఓడునంత వరకు తృప్తి నొందలేదు. ఇంకొకటి సంస్కరణోత్సాహుల విజయము, ఇంతకంటి ముఖ్యమైనది (సభ వ్యవహారాలు) తెలుగు భాషలోనే నుండవలసినదని వారు పట్టుబట్టిరి… ఆంధ్ర భాషా వ్యవహారమును ప్రోత్సహించుటకు అటు ప్రభుత్వము వారికి సాధ్యము కానేలేదు…

ప్రత్యేకము ఆంధ్రుల కొరకై ముఖ్యముగా సాంఘిక భాషాభివృద్ధి కొరకై పాటు పడుచున్నట్లు చెప్పుకొను ఆంధ్రమహాసభ కూడ యితర భాషా దాస్యమును వదలించుకొన జాలనిచో అది యెంత లోపమో… సిరిసిల్ల మహాసభకు ఆంధ్రోద్యమ చరిత్ర యందు వాస్తవమయిన ప్రాముఖ్యమునిచ్చునది ‘ఆంధ్ర భాషా విజయము’న్ను దానికి మూలమయిన సంస్కరణోత్సాహుల విజయమున్ను అని చెప్పక తప్పదు. ముందు ముందు యీ పక్షము అంతకంతకు ప్రబలమై ఆంధ్రోద్యమపు నావను వశపరచుకొనగల రోజు మాకు దూరమున నైనను స్పష్టముగా గోచరించుచున్నది” (గోలకొండ పత్రిక సంపాదకీయాలు-1 పుటలు-215- 218).

ఈ సంపాదకీయాన్ని బట్టి ఆంధ్రోద్యమం ఏ దిశగా సాగాలో ఆయన స్పష్టం చేసినాడు, ఆ దిశ ఆధునికత వైపు, సంస్కరణలవైపు, తెలంగాణ జాతీయతా నిర్మాణం వైపు, తెలుగు భాషా జాతీయత నిర్మాణం వైపు అని అర్థమవుతుంది. 1936 డిసెంబర్‌లో షాద్‌నగర్‌లో జరిగిన ఐదవ మహాసభ ప్రారంభం రోజునే ఈ సభ ప్రత్యేకతను దాని కర్తవ్యాన్ని వివరిస్తూ, గోలకొండ పత్రికలో సంపాదకీయం రాసినాడు. అందులోని కొన్ని భాగాలు “ఈ మహాసభ రైతు సమస్యయు, హరిజన సమస్యయు మన రాష్ర్టమున ఇది వరకెప్పుడును లేని యుగ్ర రూపము దాల్చియున్న సమయమున సమావేశమగుచున్నది…

కనుక మహాసభవారి ఆలోచనలో ఈ రెండు సమస్యలకును ప్రాముఖ్యత ఒసగబడవలసియుండును. హరిజన సమస్యయు నిరుడే విషమించుటకు ప్రారంభించినది. బ్రిటీషిండియాలోని అంబేద్కర్ శంఖారావమునకు మన రాష్ట్ర మందు కొందరు హిందూమతమునుండి లేచిపోవలెనని ఘోషింప ప్రారంభించగా, ఇతరు మతస్థులు కొందరు ఇదే సమయమని మన “హరిజను”లను కొందరిని కొద్ది కొద్ది ద్రవ్యాశపెట్టి తమ తమ మతములలో కలుపుకొనుటకు యత్నించుచున్నారు. మన సనాతనులకింకను హరిజన సమస్య విషయమున సమరస భావము కల్గినట్లు కనిపించుటలేదు… ఎవడైనను సరే హిందూ మతము కంటె ఇంకొక మతమే తనను భగవంతుని చేర్చుటకు ఎక్కువ తగినదని నమ్ముచో అతడు ఆ మతములో చేరిన విచారపడవల్సిన పని లేదు” (గోలకొండ పత్రిక సంపాదకీయాలు- 2 పుటలు 35- 38). ఈ సంపాదకీయం మహాసభ పయనదిశను సూచించింది.

డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి
9885682572

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News