Sunday, April 28, 2024

ఆదిత్య ఎల్-1 సక్సెస్

- Advertisement -
- Advertisement -

నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన పిఎస్‌ఎల్‌వి

నిర్ణీత కక్షలో ఆదిత్య ఎల్-1ను ప్రవేశపెట్టిన రాకెట్

సూర్యుడి దిశగా ప్రయాణం ప్రారంభించిన ఉపగ్రహం

125 రోజుల్లో 15లక్షల కి.మీ. ప్రయాణించి ఎల్1 పాయింట్ చేరుకోనున్న శాటిలైట్

ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ, బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిర్

శ్రీహరికోట: చంద్రయాన్3 విజయవంతం అయిన త రువాత సూర్యుడి దిశగా ఇస్రో ప్రయోగాలకు సిద్ధమైం ది. ఇందులో భాగంగా ఆదిత్యఎల్ 1 ఉపగ్రహాన్ని తీసుకొని పీఎస్‌ఎల్‌వీసీ 57 వాహకనౌక శనివారం నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. తిరుపతి జిల్లా లో ని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) తాజాగా ప్రయోగానికి వేదికైంది. ఇస్రో అంచనాల ప్రకారమే ప్రయోగం సాగుతోంది. ఆదిత్యఎల్1 గమనాన్ని షార్ నుంచి శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. ఆదిత్య ఎల్1 లాంచింగ్ విజయవంతమైనట్టు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. రాకెట్ నుంచి ఆదిత్య ఎల్1 విజయవంతంగా విడిపోయిందని, దానిని కక్షలోకి ప్రవేశ పెట్టినట్టు పేర్కొన్నా రు. ఈ ప్రయోగం విజయవంతమవడానికి సహకరించిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఆదిత్య ఎల్1 ఉపగ్రహం చాలా ప్రత్యేకమైందని, 125 రోజుల పాటు ఈ ఉపగ్రహం ప్రయాణం చేస్తుందని, భూమి నుంచి సూ ర్యుడి దిశగా ఉన్న ‘ఎల్1’(లగ్రాంజ్) పాయింట్‌ను చేరుకోనుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. అంతరిక్షంలో లగ్రాంజ్ పాయింట్ అనేది పార్కింగ్ ఏరియాలాంటిది. ఆదిత్య ఎల్1 ఇక్కడకు చేరుకున్న తరువాత సూర్యుడి దగ్గర జరిగే పరిణామాలను మనకు అందిస్తుం ది. ఇలా సూర్యుడి చుట్టూ ఐదు లగ్రాంజ్ పాయింట్‌లు ఉన్నాయి. అందులో ఎల్1 వద్దకు ఆదిత్య ఉపగ్రహం చేరుకుని అక్కడ నుంచి సూర్యుడిని నిరంతరం పరిశీలిస్తుంది. 15 లక్షల కిలోమీటర్ల దూరం లోని ఈ ప్రదేశం లోకి భారత్ ఉపగ్రహ ప్రయోగం చేపట్టడం ఇదే మొదటిసారి. ఈ ప్రదేశం నుంచి ఎలాంటి అవరోధాల్లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసే వీలుంది. ఇం దులో 7 పరిశోధన పరికరాలు ఉన్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫోటో స్పియర్, క్రోమో స్పియర్ సహా వెలుపల ఉండే కరోనానూ అధ్యయనం చేస్తాయి. సౌర జ్వాలలు, సౌర రేణువులు, అక్కడి వాతావరణం గురించి ఎన్నో అం శాలను శోధిస్తాయి. వీటివల్ల సౌర తుపానుల నుంచి అంతరిక్షం లోని ఆస్తులను కాపాడుకోవడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన మొత్తం 22 సూర్య ప్రయోగాల్లో నాసా 2018లో చేసిన పార్కర్ ప్రోబ్ ప్రయోగం అత్యంత వ్యయంతో కూడుకున్నది. దానికి ఏకంగా 12వేల కోట్లు ఖర్చు కా గా, మన ఆదిత్య ఎల్1 ప్రయోగానికి కేవలం రూ. 400 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి. దీంతో సూర్యుడిపై అ త్యంత చౌక ప్రయోగంగా ఆదిత్య ఎల్1 నిలవనున్నది.
ప్రయాణం ఇలా…
పీఎస్‌ఎల్‌వీ రాకెట్ మొదట ఆదిత్య ఎల్ 1ను భూదిగువ కక్షలో ప్రవేశ పెడుతుంది. ఆ తర్వాత దీన్ని మరింత దీర్ఘవృత్తాకార కక్షలోకి పంపుతారు. ఆదిత్య ఎల్1 లోని రాకెట్లను ఇందుకు ఉపయోగిస్తారు.
ఆ తర్వాత ఎల్1 బిందువు వైపు ఆదిత్యను నడిపిస్తారు. ఈ క్రమంలో అది భూ గురుత్వాకర్షణ ప్రభావ ప్రాంతం (ఎస్‌వోఐ)ను దాటి వెళుతుంది.
అనంతరం క్రూజ్ దశ ప్రారంభమౌతుంది. ఇలా నాలుగు నెలల ప్రయాణం తర్వాత ఉపగ్రహం… ఎల్1 బిందువును చేరుకుంటుంది. ఆదిత్య ఎల్1 మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లింది. అందులోని ప్రధాన సాధనమైన విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనా గ్రాఫ్ (వీఈఎల్‌సీ)… రోజుకు 1,440 చిత్రాలను పం పుతుంది. అంటే నిమిషానికి ఒక ఫోటో అన్నమాట. ఇది ఆదిత్య ఎల్1లో సాంకేతికంగా అత్యంత సంక్లిష్టమైన సాధనం.. వీఈఎల్‌సీ బరువు 190 కిలోలు, అది ఐదేళ్ల పాటు సేవలు అందిస్తుంది. ఇంధన వినియోగ తీరును బట్టి అది మరింత ఎక్కువ కాలం పనిచేసే అవకాశం కూడా ఉంది.
మరో ఆరు పరికరాలు…
సోలార్ అల్ట్రావయలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ : ఇది సూర్యుడిలోని ఫొటోస్పియర్, క్రోమోస్పియర్ ప్రాం తాలను అతినీల లోహిత తరంగ దైర్ఘంలో చితీకరిస్తుంది. తద్వారా సౌర రేడియో ధార్మకతను కొలుస్తుంది.
సోలార్‌లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్ (సొలెక్సెస్), హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్ (హెచ్‌ఈ ఎల్1 ఓఎస్) : ఈ రెండు సాధనాలూ సూర్యుడి నుంచి వచ్చే ఎక్స్‌రే జ్వాలలను అధ్యయనం చేస్తాయి.
ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్ (ఆస్పెక్స్), ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య (పా పా) : ఈ రెండు పరికరాలు సౌర గాలులు, ఆవేశిత అయాన్లు, వాటిలో శక్తి విస్తరణ తీరును శోధిస్తాయి.
మ్యాగ్నెటో మీటర్ : ఎల్1 బిందువు వద్ద గ్రహాంతర అయస్కాంత క్షేత్రాలను పరిశీలిస్తుంది.
చంద్రుడిపై చంద్రయాన్3ని ల్యాండింగ్ చేసినట్టుగా ఆదిత్య ఎల్1ను కూడా సూర్యుడిపై ల్యాండ్ చేస్తారా అన్న సందేహాలు అందరి లోనూ నెలకొన్నాయి. అయితే గ్రహాల మాదిరిగా సూర్యుడి ఉపరితలం ఘన స్థితిలో ఉండదు. సూర్యుడు వాయుగోళం మాదిరిగా ఉంటాడు. దీంతో సూర్యుడి బయటి పొర కరోనా లోకి రాకెట్ ప్రవేశిస్తే సూర్యుడిపై దిగినట్టుగానే పరిగణిస్తారు. శనివారం నింగిలోకి పయనమైన ఆదిత్య ఎల్1 ఉపగ్రహం… భాను డి భగభగల మాటున దాగున్న అనేక నిగూఢ అంశాల గుట్టును విప్పుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News