Monday, April 29, 2024

ఆదివాసీల సాంస్కృతిక విప్లవం

- Advertisement -
- Advertisement -

మేడారం.. ఈ పేరు వింటేనే ఆదివాసీలు తప్పకుండా గుర్తుకు వస్తారు. ఎందుకంటే ప్రకృతిని నమ్ముకొని అడవి.. ఆ అడవి సంపదపైన సంపూర్ణ హక్కుదారులం తామేనంటూ ఆదివాసీ గిరిజనులు చెబుతారు. ఇందుకు కారణం కాకతీయులతో యుద్ధం చేసి ఆత్మార్పణ గాయించిన సమ్మక్క, సారలమ్మ చరిత్ర త్యాగనీయమైనది మరి. మేడారంలోని ఆదివాసీలు, గిరిజనుల దేవతలు సమస్త సబ్బండ జనానికి ఆరాధ్యులైన తీరు మహోన్నతమైనది. ఈ మేడారం జాతర పూర్తిగా ప్రకృతి పండుగ. ఈ మేడారం పండుగ పూజా పద్ధతులు అదే స్థాయిలో ఉంటాయి కూడా. మేడారం అంటే అందరికీ తెలిసిందే కొన్నే అయినా తెలుసుకోవాల్సిన ప్రకృతి సిద్ధమైన వంటకాల వివరాలు తెలుసుకుందామా. ముందుగా చెప్పుకోవాల్సింది భూమి దేవర పండుగ. ఈ భూమి దేవరగా భావించి కొన్ని విత్తనాలను ఇంటికి తెచ్చుకునే సామూహిక పండుగ చేస్తారు. మేడారంలోని ఈ పండుగ సమ్మక్క చుట్టే తిరుగుతుంది.

పండుగ చేసే ముందు విత్తనాలు సమ్మక్క దగ్గర పెట్టి ఆ విత్తనాలు వేస్తారు. పొట్టకు వచ్చిన ఆ వరిని సమ్మక్క దగ్గర పెట్టి సామూహికంగా ఊరికి ఒకరు చొప్పున వచ్చి వేలుపయ్య (ఆవు) కోసం సమ్మక్కను పూజిస్తారు. ఇది చాలా పెద్ద పండుగ. దీన్నే ఎన్నగట్టు పండుగ అంటారు. మరోటి చిక్కుడు కాయ పండుగ. కొత్తగా వచ్చిన చిక్కుడ కాయను వండి సమ్మక్క దగ్గర పెట్టి అందరూ కలిసి సామూహికంగా భోజనం చేస్తారు. ఇక చెప్పుకోవాల్సింది మరోటి ఏంటంటే.. పచ్చల పండుగ. కొత్తగా వచ్చిన ఆకుకూరలను వండి సమ్మక్కకు పెట్టి మొక్కిన తరువాతే తింటారు. ఇలా ప్రతి పంటను ప్రతీది అమ్మవారు సమ్మక్క దగ్గర పెట్టి ఆమె అనుమతి పొందాకే తింటారు. ఇక ఇంకోటి ఏంటంటే కొత్తల పండుగ. దీనినే పెద్దల పండుగ అని కూడా అంటారు. ఈ రోజున సమ్మక్కకు కోడిని కోసి తర్వాత మిగితా కార్యక్రమాలు చేపడతారు. సమ్మక్కను గద్దె తెచ్చే ముందు దడికట్టి అమ్మ వారికి అలంకరణ చేసి సాంప్రదాయ గిరిజన వాయిద్యాలైన డోలు కొమ్ము నృత్యాలతో అమ్మ వారిని గద్దె దగ్గరకు తీసుకొని వస్తారు. ఈ సందర్భంగా సమ్మక్కకు గొర్రెను కోసి రాత్రంతా ఆటపాటలతో సమ్మక్క గద్దెల వద్ద సంబరాలు చేసుకుంటారు. అమ్మవారు సమ్మక్క గద్దెల వద్దకు వచ్చే ముందు ఆర్భాటం ఉండడం షరా మామూలే. పూర్తిగా గిరిజన పద్ధతిలో గిరిజన

పూజారులు తెల్లబట్టలు ధరించి, ఎర్రరుమాలు చుట్టి మాఘ శుద్ధ పౌర్ణమి నాడు అమ్మవారు సమ్మక్కకు మొక్కులు చెల్లిస్తారు. జంపన్న వాగులో సామూహిక స్నానాలు ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు చేస్తుంటారు. ఆ మాటకు వస్తే.. మేడారం జాతరకు గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే ఎడ్ల బండ్లు, పట్టణాల నుండి వచ్చే కార్లు ఇతర వాహనాలు ఆ జంపన్న వాగును దాటవలసిందే. అలా లక్షలాది సంఖ్యలో వచ్చే భక్తులు ఈ వారం.. పది రోజులూ భక్తి పారవశ్యంలో మునిగితేలే పండుగనే మేడారం సమ్మక్క సారలమ్మ పండుగ. కాగా సమ్మక్క జాతర గతంలో కేవలం పూర్తిగా గిరిజన జాతరగా ఉండేది. కానీ ఈ మేడరం జాతర క్రమేపీ సబ్బండ వర్గాలకు గిరిజన దేవతలు ఆరాధ్యులైనారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మేడారం పండుగ అంతగా ప్రాచుర్యం పొందలేదు. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక తెలంగాణ పండుగలన్నింటికీ ప్రత్యేకలు వచ్చాయి. ఆ క్రమంలో నేడు సమ్మక్క సారలమ్మ జాతర చరిత్ర విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తున్నాయి.

అటు భక్తులు తమ కొంగు బంగారం అయిన సమ్మక్క సారలమ్మలకు బంగారం (బెల్లం) నిలువెత్తుగా ఇచ్చి తమ భక్తిని చాటుకుంటున్నారు. పిల్లాపెద్దలే కాదు.. మంత్రులు.. ఎంఎల్‌ఎలు నిలువెత్తు బంగారం సమర్పించుకుంటున్నారు.రెండేళ్లకోసారి వచ్చే ఈ మేడారం మహా జాతరకు ఇసుక వేస్తే రాలనంత జనం వస్తున్నారు. ముందుగా జంపన్న వాగులో సామూహిక స్నానాలు ఆచరించి కల్లు సారలతో.. సాకలు పోసి కోడి పందేల తరహా కోళ్ళు యాటలతో మొక్కులు వారం రోజుల పాటు తీర్చుకుంటూ సమ్మక్క సారలమ్మ తల్లిని కొలుస్తుంటారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మండలి, ఇతర సాంస్కృతిక శాఖలు మేడారం జాతర వైభవాన్ని వివరిస్తూ పలు సాంస్కృతిక సంబరాలను నిర్వహిస్తున్నారు. మేడారంలో ఇక్కడ దేవుడికి భక్తులకు మధ్య పూజారి ఉండడంటే ఆశ్చర్యం వేయకమానదు మరి. అదే ఇక్కడి ప్రకృతి ఆరాధ్యులైన వనదేవతల జాతర. ఈ జాతరను మనం అంతా కూడా ప్రతి ఒక్కరం కులమతాలకు అతీతంగా ప్రకృతితో మమేకమై జరుపుకుందాం. అడవిని, అడవి తల్లిని, ఆదివాసీల సాంప్రదాయాలను కాపాడుకుందాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News