Tuesday, April 30, 2024

మన చట్టాలపై మార్గదర్శిని

- Advertisement -
- Advertisement -

తెలుగులో సాహిత్యంపై ఎన్నో పుస్తకాలు వస్తుంటాయి. కాని సామాజిక అంశాలపై వచ్చేవి మాత్రం తక్కువేనని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా మన చట్టాలకు సంబంధించిన కనీస పరిజ్ఞానాన్ని అందించే పుస్తకాలు రావలసిన మాత్రం ఎంతో ఉంది. ఏ దేశ చట్టాలైనా ఆయా దేశ పౌరుల నడవడి కోసం, సాంఘిక జీవన విధానానికి, దేశంలోని సాంప్రదాయకత, సామరస్యాన్ని కాపాడేందుకు రూపొందుతాయి. వాటిని తెలుసుకోవడం పౌర ధర్మం. అయితే వీటి గురించి సరైన అవగాహన కల్పించే వ్యవస్థలు మాత్రం మన దేశంలో అంతగా ఏర్పడలేదు. మన సామాజిక, కుటుంబపర జీవితంలో చట్టానికి ఉన్న ప్రాధాన్యత, ఆవశ్యకతలను చెప్పే రచనలు, వేదికలు కూడా అరుదే. చాలా మంది చట్టంలో ఏముందో తెలియక స్వంత నిర్ణయాలతో, తప్పుడు అవగాహనతో తోచినట్లు చేసుకుపోతుంటారు. దాని వల్ల కలిగే లాభం కన్నా నష్టమే ఎక్కువ.

చట్టానికి కళ్ళు లేకపోవచ్చు కాని దానిని పాటించే వారు మాత్రం కళ్ళు తెరుచుకొని నడవాల్సిందే. తాగి వాహనం నడపకూడదని, నలుగురిలో ధూమపానం చేయకూడదని తెలియదంటే చట్టం ఊర్కోదు. అది నీ తెలివి తక్కువ తనమని భావించి చెవులు పిండి శిక్ష వేస్తుంది.
ఇలాంటి పుస్తకాల కొరత వల్ల సామాన్యుడి నుండి మేధావి దాకా చట్టంపై ఎవరికీ పరిపూర్ణ అవగాహన లేదనే చెప్పాలి. ఎందుకంటే న్యాయం, చట్టం అనేవి ప్రత్యేక శాస్త్రబద్ధ విషయాలు. వాటిని కూలంకషంగా చదివితే తప్ప అన్నిరకాల సమస్యలకు, సందేహాలకు పరిష్కారం దొరకవు. వీటన్నిటికి సులభమైన సమాధానంగా అడ్వొకేట్ జి. గంగాధర్ న్యాయ సలహాలతో కూడిన సమాచారాన్ని పుస్తక రూపంగా తెచ్చారు.

దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే చట్టపరమైన చిక్కులను ఇంత సులువుగా, వివరంగా విప్పి చెప్పే అరుదైన తెలుగు పుస్తకంగా దీనిని భావించవచ్చు. న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ ల్యాండ్ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన డాక్యుమెంట్ల రచనలో సుదీర్ఘ అనుభవం గల ఈ రచయిత ప్రజా మంటలు అనే దినపత్రికలో రాసిన వ్యాసాలు, ప్రశ్నలకు జవాబుల సంకలనమిది. ఈ వ్యాసాలు చదువుతుంటే ఎన్నో న్యాయ సందేహాలపై సమాధానాలు దొరుకుతాయి. చట్టం ఇలా చెబుతుందా అన్నట్లు ఎన్నో కొత్త విషయాలు అవగాహనకు వస్తాయి. ఇంతకాలం మనం అనుకున్న విషయాలకు చట్టం చట్రంలో వాటికున్న అసలైన అర్థమేమిటో మనకు తెలుస్తుంది.

ఎన్నో భూ తగాదాలు, ఆస్తి పంపకాల కేసుల్లో సమర్థవంతంగా వాదించిన న్యాయశాస్త్ర పరిజ్ఞానిగా రచయిత గంగాధర్ ఈ పుస్తకంలో భూసంబంధిత మరెన్నో అంశాలపై వ్యాస రూపంలోనూ, ప్రశ్నలు, -జవాబుల రూపంలోనూ పరిష్కారం చూయించారు. యాజమాన్యపు హక్కులు, భూకబ్జాలు, వారసత్వం, భూబదిలీ, ఆస్తి పంపకాలు, రెవెన్యూ రికార్డులలో నమోదు ప్రక్రియ లాంటి కీలక విషయాలపై సవివరణాత్మక చర్చ వీటిలో ఉంది.

సమాజంలోని వ్యక్తులు, కుటుంబాలు పలు వివాదాల్లో చట్టపరమైన చిక్కులను ఎదుర్కొని బాంధవ్యాలకు కూడా దూరమవుతుంటారు. వారికి ముందే చట్టం ఏం చెబుతుందో తెలిస్తే ఎన్నో సమస్యలు సులువుగా పరిష్కారమై వారిలో సామరస్యత పెంచుతాయి. ఈ దిశగా ఇందులో ఎన్నో ప్రశ్నలకు రచయిత ఇచ్చిన వివరణాత్మక సమాధానాలున్నాయి. వీలునామా అంటే ఏమిటి. దానిని ఎలా రాయాలి. ఆడబిడ్డలకు ఆస్తి హక్కు, రెండో భార్య పిల్లలకు ఆస్తిలో వాటా, హిందూ వితంతు పునర్వివాహ చట్టం ఇలా ఎన్నో అంశాలపై తగిన వివరాలు ఇందులో ఉన్నాయి. ఈ రోజుల్లో భూతగాదాలకు కొదువ లేదు. పవర్ ఆఫ్ అటార్నీ, అక్రమ లే అవుట్‌లు, డబల్ రిజిస్ట్రేషన్లు, ఎన్.ఆర్.ఐ.ల స్థిరాస్తి కొనుగోలు, స్టాంపు పేపర్ పై బయానా ఒప్పందం, ప్రామిసరీ నోట్, గ్రామకంఠం భూమి, ధరణి ఇలా పలు అంశాలపై ఎంతో స్పష్టమైన సమాచారం వీటిలో ఉంది.

ఇలా చట్టం తెలియడం వల్ల వ్యక్తిగత బాధ్యతలపై అవగాహన రావడంతోపాటు సాటి మనిషి హక్కులకు భంగం కలుగకుండా కూడా వ్యవహరించడం జరుగుతుంది. తద్వారా అనవసరపు తగాదాలు తగ్గి సమాజంలో ప్రశాంతత నెలకొంటుంది.
చట్టం సముద్రమంత పెద్దది. సంఘజీవిగా బతుకుతున్న మనకు ఏదో ఒక విషయంలో చట్టం దృష్టిలో న్యాయమేదో తెలుసుకోవలసిన అవసరం వస్తుంది. కాని మనకు కావలసిన చిన్న సమస్యపై న్యాయ గ్రంథాలు తిరగేయడం శక్తికి మించిన, శ్రమతో కూడుకున్న పని. ఈ వెతుకులాటను తప్పించి మన అవసరాన్ని సులువుగా తీర్చేందుకు ఈ పుస్తకం ఒక మార్గదర్శిగా ఉపయోగపడుతుంది. తక్షణం న్యాయపరమైన సమాధానం సూచించే ఈ పుస్తకం ఇంటింటి అవసరం అని చెప్పవచ్చు.

బి.నర్సన్
9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News