Thursday, May 2, 2024

మళ్లీ రిజర్వేషన్ల వివాదం

- Advertisement -
- Advertisement -

Those who live in slums are vulnerable to corona

 

మళ్లీ మరొక్కసారి రిజర్వేషన్ల వివాదం, ఈసారి తమిళనాడు మీదుగా. తమిళనాడు నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్టు)కు సమర్పించిన తమ రాష్ట్ర వైద్య విద్య సీట్లలో 50 శాతాన్ని ఇతర వెనుకబడిన తరగతుల (ఒబిసి)కు కేటాయించాలని కోరుతూ దాఖలైన అఖిల పక్ష వ్యాజ్యంపై సుప్రీంకోర్టు వ్యతిరేక తీర్పు ఇచ్చింది. రిజర్వేషన్లు పొందడం ప్రాథమిక హక్కు కాదని ఆ తీర్పు స్పష్టం చేసింది. సాధారణంగా ఒక దాని పొడ మరొక దానికి గిట్టకుండా, ఎడమొగం పెడమొగంగా ఉండే తమిళనాడు రాజకీయ పార్టీలన్నీ ఈ విషయంలో ఒక్క త్రాటిపైకి వచ్చి ఉమ్మడి పిటిషన్ వేయడం వెనుకబడిన తరగతుల పట్ల వారికున్న శ్రద్ధను రుజువు చేస్తున్నదంటూనే ‘మీరంతా ఒక్క తమిళనాడు కోసమే 50 శాతం ఒబిసి రిజర్వేషన్లు కోరుతున్నారు’ అని జస్టిస్ ఎల్‌ఎన్ రావు పిటిషనర్లను ఉద్దేశించి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానంలో భాగంగా ఒబిసిలకు ఇస్తూ వచ్చిన 50 శాతం కోటాను నీట్ అమలు జరపకపోడం తమిళనాడు ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతమని పిటిషనర్ల తరపు న్యాయవాది పి. విల్సన్ చేసిన వాదనపై అవి ప్రాథమిక హక్కుల పరిధిలోకి రావని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇతర అనేక రాష్ట్రాలకు భిన్నంగా తమిళనాడు జనాభాలో ఒబిసిలు అత్యధిక శాతంగా ఉన్నారు. అందుకే విద్య, ఉద్యోగాలలో ఈ వర్గానికి 50 శాతం కోటాతో కలుపుకొని ఆ రాష్ట్రంలో మొత్తం 69 శాతం రిజర్వేషన్లను చాలా కాలంగా అమలు చేస్తున్నారు. వైద్య విద్యలో ప్రవేశాల కోసం అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించేలా జాతీయ స్థాయిలో నీట్ అవతరించక ముందు తమిళనాడులోని మెడికల్ డెంటల్ కాలేజీల్లో ఒబిసిలకు 50 శాతం కోటా అమలవుతూ ఉండేది. అందుచేతనే నీట్ వ్యతిరేక ఉద్యమం ఆ రాష్ట్రంలో పెల్లుబికింది. ఆ తర్వాత అది కూడా మిగతా రాష్ట్రాలతో పాటుగా తన మెడికల్ సీట్లను నీట్ అధీనానికి అప్పగించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు నిరాకరించినందున రిజర్వేషన్లను ప్రాథమిక హక్కుల జాబితాలో చేర్చాలన్న డిమాండ్ అక్కడ ఊపందుకుంటున్నది. ప్రాథమిక హక్కులను సవరించడమనేది అతి పెద్ద చర్య. అందుకు కేంద్ర ప్రభుత్వం దృఢ సంకల్పం వహించాలి.

పార్లమెంటులో తగిన బలాన్ని సమీకరించి బిల్లును ఆమోదింప చేయాలి. 1978లో ఆస్తి హక్కును ప్రాథమిక జాబితా నుంచి తప్పించిన ఉదంతం ఉంది. అయితే ఇప్పటికే రిజర్వేషన్ల విధానం పట్ల వ్యతిరేకతను దేశంలోని ఒక బలమైన వర్గం కూడగట్టి ఉన్నది. ఈ నేపథ్యంలో తమిళనాడు పార్టీల కోరిక సులభ సాధ్యం కాదు. నానాటికీ ప్రబలిపోతున్న నిరుద్యోగం వల్ల రిజర్వేషన్లు వర్తించని అగ్ర వర్ణాలు కూడా వాటిని కోరుతున్నాయి. వాస్తవానికి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు సామాజికంగా, విద్యా విషయకంగా వెనుకబడిన వర్గాలకే వర్తిస్తాయి. దేశ ప్రజలను శాసిస్తున్న నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో శతాబ్దాల తరబడి అట్టడుగున పడిపోయి విద్యకు, సమాజంలో ఉన్నత స్థాయికి నోచుకోకుండా బతుకులు ఛిద్రమైపోయిన ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలను నెమ్మదిగానైనా పైకి తీసుకురావాలన్న పరమోద్దేశంతో రిజర్వేషన్లను రాజ్యాంగ ముఖ్య లక్షాలలో చేర్చారు. అగ్ర వర్ణస్థులతో సమానమైన సామాజిక హోదా పొందడం దేశ ప్రజల్లో సగానికిపైగానూ, ఇంకా ఎక్కువగానూ ఉన్న ఈ వర్గాలకు స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లకు కూడా ఆకాశకుసుమంగానే ఉంది.

ఇంతలో రిజర్వేషన్ల ద్వారా వారికి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి, తాము అందుకు నోచుకోడంలేదనే వేదన పేద, మధ్య తరగతి అగ్ర వర్ణస్థులలో పేరుకుపోయింది. వాస్తవానికి ప్రాథమిక హక్కుల్లోని సమానత్వ హక్కును దాని విశాల రూపంలో చూస్తే కింది వారిని పై వారితో సమానమైన సామాజిక స్థితికి తీసుకువచ్చే కృషి కూడా అందులో భాగమవుతుంది. దాని కోసమే సానుకూల వివక్ష పేరుతో అగ్ర వర్ణాలను మినహాయించి రిజర్వేషన్లను కింద కులాల వారికి వర్తింప చేశారు. తరతరాలుగా సాగిన సామాజిక, ఆర్థిక దోపిడీకి గురైన వర్గాలను వాటి నుంచి విముక్తం చేయడం కోసం రిజర్వేషన్లే కాకుండా భూ సంపద పునః పంపిణీ వంటి పలు చర్యల అవసరం ఉంది. అయితే ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ వంటి పెద్దలు కూడా రిజర్వేషన్లపై వాటి అనుకూలురు, వ్యతిరేకుల మధ్య చర్చ జరగాలని కొన్నాళ్ల క్రితం పని కట్టుకొని ప్రవచనం ఇచ్చిన తర్వాత కోటా పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై అనుమానాలు బలపడడం మొదలయ్యాయి.

న్యాయ సమీక్షకు అతీతం చేస్తూ తమిళనాడు రిజర్వేషన్లను రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చారు. ఆ షెడ్యూల్‌లో చేర్చిన అంశాలు న్యాయ సమీక్షకు ఎంత మాత్రం అతీతమైనవి కాదని, వాటిని సమీక్షించే అధికారం తనకున్నదని సుప్రీంకోర్టు స్వయంగా చెప్పుకున్నది. ఇది కోటా విధానం నెత్తిమీద కత్తిలా వేలాడుతున్నది. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో రిజర్వేషన్ల అనుకూల సామాజిక శక్తులన్నీ దృఢంగా సంఘటితమై వాటిని కాపాడుకోగలుగుతాయో లేక వాటికి పూర్తిగా తెరపడిపోతుందో భవిష్యత్తే తేల్చాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News