Monday, May 6, 2024

వానాకాలం పంట రుణాలేవి ?

- Advertisement -
- Advertisement -

Banks that do not cooperate with Farmers

 

సాగు మొదలైనా సకాలంలో రైతులకు సహకరించని బ్యాంకులు
ఈ సీజన్ లక్షం రూ.33,713 కోట్లు.. ఇప్పటి వరకు ఇచ్చింది రూ.500 కోట్లలోపే
దిక్కుతోచని స్థితిలో ప్రైవేట్ వడ్డీవ్యాపారులను ఆశ్రయిస్తున్న అన్నదాతలు
తెలంగాణలో పంట రుణాల పంపిణీలో దారుణం.. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్
బ్యాంకులపై ఒత్తిడి తేవాలని ప్రభుత్వానికి తెలిపిన రాష్ట్ర రుణ విమోచన కమిషన్

మన తెలంగాణ/హైదరాబాద్ : రైతులకు సకాలంలో పంట రుణాలు ఇవ్వాల్సిన బ్యాంకులు వారిని చిన్నచూపు చూస్తున్నాయి. వానాకాలం సాగు సీజన్ ప్రారంభమైనా రైతులకు సరిగ్గా పంట రుణాలు ఇవ్వడం లేదు. ఫలితంగా దుక్కులు సిద్ధం చేసుకునేందుకు, విత్తనాలకు, ఎరువులకు అన్నదాతలు వడ్డీ వ్యాపారులనే ఆశ్రయించాల్ని దుస్థితి ఏర్పడింది. ఈ ఏడాది వానాకాలంలో మొత్తం రూ. 30,649 కోట్ల రుణాల పంపిణీ లక్షంగా ఉంది. కరోనాతో కేంద్ర ప్రభుత్వం రైతు తీసుకునే రుణంపై 10 శాతం అదనంగా ఇవ్వాలని ఇటీవల స్పష్టం చేసింది. దీని ప్రకారం రూ.33,713 కోట్లు బ్యాంకులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇంత వరకు రూ.500 కోట్ల లోపే బ్యాంకులు పంట రుణాలు ఇచ్చాయని వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఏదో ఒక వంక చెబుతూ బ్యాంకులు రైతులను తిప్పి పంపిస్తున్నట్లు మన తెలంగాణ క్షేత్ర పరిశీలనలో వెల్లడైంది.

గత ఏడాది పంట రుణాలు తీసుకున్న రైతుల దగ్గర నుంచే పాత బాకీలనే జమ చేసుకుని, మళ్లీ వాటినే రెన్యూవల్ చేసి బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో వడ్డీలు కూడా రైతుల నుంచే వసూలు చేస్తున్నాయి. వడ్డీ కడితేనే రుణం రెన్యువల్ చేస్తామని లేదంటే ఇవ్వమని చెబుతుండటంతో అన్నదాత దిక్కుతోచని స్థితిలో పడుతున్నాడు. మరోవైపు ఈసారి తెలంగాణ ప్రభుత్వం రూ.25 వేల లోపు పంట రుణాలను మాఫీ చేస్తుండటంతో కొందరు రైతులు వేచి చూస్తున్నారు. మరోవైపు జిల్లాల వారీగా రుణ ప్రణాళికలు కూడా సిద్ధం కాలేదని తెలిసింది. వాస్తవానికి ఏప్రిల్ నెల నుంచి వానాకాలం పంట రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఈసారి ప్రభుత్వం నుంచి కూడా బ్యాంకులపై ఎటువంటి ఒత్తిడి లేదు.

ప్రైవేట్ వడ్డీలకు చితికిపోతున్నారు

రైతులు ప్రైవేట్‌లో అప్పులు చేసి వడ్డీలు కట్టలేక ఆర్థికంగా చితికిపోతున్నారని రాష్ట్ర రుణ విమోచన కమిషన్ స్పష్టం చేసింది. సుమారు 36 శాతం రైతులు ప్రైవేట్ రుణ దాతలకే చెల్లిస్తున్నట్లు పేర్కొంది. రైతులకు సకాలంలో రుణాలు ఇవ్వకపోవడమే కాకుండా, సాగు చేసిన మొత్తం విస్తీర్ణానికి పంట రుణం అందడం లేదని తెలిపింది. గత మూడు సంవత్సరాలలో తెలంగాణ రైతులకు రూ.10 వేల కోట్ల పంట రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకులు విఫలమైనట్లు వ్యవసాయంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చెప్పిందని ప్రభుత్వానికి రాసిన లేఖలో రుణవిమోచన కమిషన్ వివరించింది. రైతులకు వెంటనే పంట రుణాలు అందించేందుకు సహకరించాలని సూచించింది. ఈ మేరకు వ్యవసాయ, ఆర్థిక శాఖలకు తాజాగా లేఖ రాసింది.

లక్ష్యం  చేరలేదన్నడు !

రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క ఆర్థిక సంవత్సరం కూడా బ్యాంకులు పంట రుణాల పంపిణీని లక్షం మేరకు పూర్తి చేయలేదు. 2014-15లో రూ. 18, 717 కోట్ల పంట రుణాలు లక్షం ఉండగా రూ. 17,019 కోట్లు పంపిణీ చేశారు. 201516లో రూ. 27,800 కోట్లకు గాను రూ. 20,585 కోట్లు మాత్రమే ఇచ్చాయి. 201617లోనూ రూ. 29,101 కోట్లకు గాను రూ. 26,282 కోట్లు, 201718లో రూ. 39,752 కోట్లకు గాను రూ.31,410 కోట్లు మాత్రమే బ్యాంకులు పంట రుణాలుగా ఇచ్చాయి. ఇక 201819లోనూ రూ.42,494 కోట్ల లక్షం ఉంటే రూ. 33,751 కోట్లు పంపిణీ చేశారు. ఇలా ప్రతి ఏడాది లక్షం పెరుగుతుంది కానీ దానికి తగినట్లు రుణాల పంపిణీ ఉండటం లేదు.

సంవత్సరం           పంట రుణాల లక్ష్యం                     ఇచ్చినవి

2014-15                18,717                          17,019
2015-16                27,800                          20,585
2016-17                29,101                          26,282
2017-18                39,752                          31,414
2018-19                42,494                          33,751
2019-20                48,470                          38,000

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News