Sunday, April 28, 2024

యుపిలో జోడో యాత్రలో పాల్గొనకపోవచ్చు:అఖిలేశ్ యాదవ్

- Advertisement -
- Advertisement -

లక్నో : రాహుల్ గాంధీ సారథ్యంలో సాగుతున్న కాంగ్రెస్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో తాను పాల్గొనే ‘అవకాశం లేదు’ అని సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) అధినేత అఖిలేశ్ యాదవ్ బుధవారం సూచించారు. లక్నోలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల గోష్ఠిలో ఈ విషయమై ప్రశ్నించినప్పుడు ‘కాంగ్రెస్ గానీ, బిజెపి గానీ తమ కార్యక్రమాలకు మమ్మల్ని ఆహ్వానించవు’ అని అఖిలేశ్ సమాధానం ఇచ్చారు. లక్నోలోని పార్టీ కార్యాలయం నుంచి ‘సంవిధాన్ బచావో, దేశ్ బచావో సమాజ్‌వాది పిడిఎ యాత్ర’ను అఖిలేశ్ జెండా ఊపి ప్రారంభిస్తూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా, ములాయం సింగ్ యాదవ్ సిద్ధాంతాలను గ్రామాల వరకు యాత్ర ప్రచారం చేస్తుందని తెలియజేశారు. పిడిఎ అంటే ‘పిచాడా, దళిత్, అల్పసంఖ్యాక్ ముస్లింలు (వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలు) అనే అర్థం. ‘పూర్వపు సోషలిస్ట్‌ల కలల సాకారానికి మేము ప్రతిన బూనాం. యాత్ర రాష్ట్రంలో అనేక జిల్లాల మీదుగా సాగుతుంది.

వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలు, ఇంకా అగ్ర వర్ణాలను సంఘటిత పరిచేందుకు యాత్ర ప్రయత్నిస్తుంది’ అని ఆయన తెలిపారు. రాజ్యాంగ విలువలు, రాజ్యాంగం పరిరక్షణకు పోరాడుతున్న ఏకైక పార్టీ ఎస్‌పి అని అఖిలేశ్ చెప్పారు. కాగా, రాహుల్ గాంధీ యాత్ర ఫిబ్రవరి 14న ఉత్తర ప్రదేశ్‌లోకి ప్రవేశించవచ్చునని రాష్ట్ర ప్రదేశ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు అజయ్ రాయ్ మీడియాతో చెప్పారు. యాత్ర రాష్ట్రంలో 11 రోజులు ఉంటుందని, అది ప్రధాని నరేంద్ర మోడీ నియోజకవర్గం వారణాసి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ నియోజకవర్గం రాయ్‌బరేలి, రాహుల్ పూర్వపు నియోజకవర్గం, ప్రస్తుతం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ మొదలైన నగరాల మీదుగా సాగుంది. ఇది ఇలా ఉండగా, యుపిలో సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్‌తో ఎస్‌పి పొత్తు కుదుర్చుకుంటుందా అనే విషయమై ఇంకా స్పష్టత లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News