Saturday, April 27, 2024

సంక్రాంతి పండగలా ‘అల వైకుంఠపురములో’

- Advertisement -
- Advertisement -

Ala vaikuntapuramulo

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసినిక క్రియేషన్స్, గీతా ఆర్ట్ పతాకాలపై ఎస్.రాధాకృష్ణ, అల్లు అరవింద్ నిర్మిస్తోన్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ చిత్రం ఈనెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఎస్.తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా మ్యూజికల్ ఫెస్టివల్ హైదరాబాద్ యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ “ఈ వేడుక చూస్తుంటే డబుల్ బొనాంజా, సూపర్ డూపర్ హిట్ సినిమాలా అనిపిస్తోంది. త్రివిక్రమ్ ఈ సినిమాకు అందమైన పేరు పెట్టారు. అంతే అందంగా సినిమా ఉంటుంది. ఈ వైభవాన్ని అంతా బన్నీయే తన భుజాలపై మోస్తున్నాడు. ఆయనతో పాటు ఇందులో నటించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ఈ కథను సంక్రాంతి పండగలా అందంగా తీర్చిదిద్దిన త్రివిక్రమ్‌కి ప్రత్యేకమైన అభినందనలు”అని అన్నారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ “ఈ సినిమాను కష్టపడి తీసింది నా స్నేహితుడు రాధాకృష్ణ. ఆయనకు అభినందనలు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చిన్న కథను బ్రహ్మాండంగా తీసి రిలీజ్‌కు ముందే హిట్ అనే రూపాన్ని ఇచ్చాడు”అని తెలిపారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ “ఓ రూమ్‌లో మధ్యాహ్నం 30 ఏళ్ల యువకుడు, 60 ఏళ్ల పెద్దాయన కూని రాగం తీసుకుంటూ రాసిన పాట కొన్ని కోట్ల మంది హృదయాలను తాకింది. అదే ‘సామజవరగమన’. తన వయసు నుంచి దిగి సిరివెన్నెల సీతారామశాస్త్రి, తన వయసును ఎక్కి తమన్ కలిసి ఓ కామన్ పాయింట్‌ను కలిపి ఈ చిత్రాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. దానికి తన గొంతునిచ్చి సిద్ శ్రీరామ్ ఈ పాటను మన అందరి గుండెల్లోకి తీసుకొచ్చేశాడు. అల్లు అర్జున్ ‘జులాయి’లో పెళ్లి కానీ అబ్బాయిగా తెలుసు. ఇప్పుడు ఇద్దరి పిల్లల తండ్రిగా తన తాలూకు మెచ్యూరిటీని తన మాటలు, జీవితంలో, పనిలో ప్రతి దాంట్లో పెడుతున్నాడు.

మీ వెనుక మేం ఉన్నామంటూ అల్లు అరవింద్, చినబాబు మేం అడిగినదల్లా గొప్పగా ఇచ్చారు. ఇంత గొప్ప సంగీతాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు అందిస్తున్నాను. ఇక ఈనెల 12న ఈ సినిమాతో అందరం కలిసి పండగ చేసుకుందాం”అని చెప్పారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ “సామజవరగమన పాట ఇంత సెన్సేషన్ అవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు.

అంత గొప్ప పాట రాసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి, పాడిన సిద్ శ్రీరామ్, పాట కంపోజ్ చేసిన తమన్, ఐడియా ఇచ్చిన త్రివిక్రమ్ సహా ఈ పాటకు పనిచేసిన టెక్నీషియన్‌లు అందరికీ మనస్ఫూర్తిగా థాంక్స్. త్రివిక్రమ్‌తో కలిసి నేను చేసిన మూడో సినిమా ఇది. ఈ సినిమా ఎంత పేరు తెచ్చుకున్నా అది త్రివిక్రమ్ వల్లే. పూజాహెగ్డేతో కలిసి నటించిన రెండో సినిమా ఇది. ఆమెతో కలిసి నటించడం ఎంజాయ్ చేశాను”అని అన్నారు. ఈ కార్యక్రమంలో దిల్‌రాజు, తమన్, సుశాంత్, సునీల్, నివేదా పేతురాజ్, టబు, అర్మాన్ మాలిక్, రామ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Ala vaikuntapuramulo movie release on jan12
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News