Monday, October 14, 2024

బిఆర్‌ఎస్ సెంచరీ కొట్టడం ఖాయం… కెసిఆర్ హ్యాట్రిక్ సిఎంగా చరిత్రలో నిలుస్తారు !

- Advertisement -
- Advertisement -

మాకు ఏ పార్టీతో జట్టు లేదు, తెలంగాణ ప్రజలే మా జట్టు
రాజకీయ కుట్రలో పావును కాను, ధైర్యంగా కొట్లాడే పటిమ నాకుంది
బిజెపి బిసి సిఎం జపం ఎన్నికల డ్రామా
బిసి రాష్ట్ర అధ్యక్షుడిని తప్పించి అగ్రవర్ణాలకు అప్పగించారు
కాంగ్రెస్, ఇతర పార్టీలు సర్వేల్లో మాత్రమే గెలుపు మేము ఎన్నికల్లో గెలుస్తాం
ద్రోహం చేయడమే తెలంగాణకు కాంగ్రెస్‌కు ఉన్న అనుబంధం
తెలంగాణ అంశాలపై ఒక్కసారైనా పార్లమెంటులో రాహుల్ మాట్లాడారా ?
రాహుల్ గాంధీ … ఎన్నికల గాంధీ !
ఎన్నికప్పుడే రావడం పోవడం తప్ప తెలంగాణ అభివృద్ధిలో కాంగ్రెస్ పాత్ర శూన్యం
మహిళా రిజర్వేషన్ల చట్టం పోస్ట్ డేటెడ్ చెక్కు లాంటిది
చంద్రబాబు అరెస్టు దురదృష్టకరం ఆయన కుటుంబ సభ్యుల బాధను అర్థం చేసుకోగలం
ఎక్స్ (ట్విట్టర్)లో ఆస్క్ కవిత కార్యక్రమంలో నెటిజన్ల ప్రశ్నలకు కల్వకుంట్ల కవిత సమాధానాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో తమకు ఏ పార్టీతో జట్టు లేదని, తెలంగాణ ప్రజలే తమ జట్టు అని బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తమ పార్టీ సెంచరీ కొట్టడం ఖాయమని, ఈ ఎన్నికల్లో 100కుపైగా సీట్లతో కెసిఆర్ హాట్రిక్ సిఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు కేవలం సర్వేల్లోనే గెలుస్తాయని, తాము ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు. రాజకీయ కుట్రలో తాను పావును కాదని, ధైర్యంగా కొట్లాడే పటిమ తనకుందని తేల్చిచెప్పారు. బిజెపి బిసి సిఎం జపం ఎన్నికల గిమ్మిక్కేనని ఎద్దేవా చేశారు. శనివారం ఎక్స్ (ట్విట్టర్) వేదిక ద్వారా నిర్వహించిన ‘ఆస్క్ కవిత’ కార్యక్రమంలో నెటిజన్ల ప్రశ్నలకు కల్వకుంట్ల కవిత సమాధానాలు ఇచ్చారు. రాజకీయ, వ్యక్తిగత అంశాలను పంచుకున్నారు.

తెలంగాణ బిజెపి నాయకత్వ బాధ్యతల నుంచి బిసిని తప్పించి అగ్రవర్ణాలకు అప్పగించారని, కేంద్రంలోని బిజెపి బిసి కులగణనను చేపట్టడానికి నిరాకరిస్తుందని ధ్వజమెత్తారు. మహిళా రిజర్వేషన్లలో బిసి మహిళలకు కోటా ఇవ్వకపోవడమే కాకుండా సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేంద్రంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం పట్టించుకోవడం లేదని, చట్టసభల్లో బిసిలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని విస్మరిస్తోందన్నారు. వీటిన్నంటిని పక్కనబెట్టి ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వస్తే బిసి ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని, ఇది కేవలం ఎన్నికల జిమ్మిక్కుగా అభివర్ణించారు. తమకు రాజకీయ ప్రత్యర్థులతో ఎటువంటి డీల్ లేదని, తాము టీమ్ తెలంగాణ అని తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బిఆర్‌ఎస్ పార్టీకి 100 కి పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు ఆలోచనాపరులని, పదేళ్ల ప్రగతిని గమనించారని వివరించారు. బాధ్యత ఉన్న ప్రభుత్వాన్ని, భరోసా ఇచ్చే నాయకుడిని ఆశీర్వదించి మళ్లీ ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.

అదే విధంగా భారత్ జోడో యాత్రపై స్పందిస్తూ వంద ఎలుకలు తిన్న పిల్లి హజ్ యాత్రకు వెళ్లినట్లు ఉందని ఎద్దేవా చేశారు. సర్వేల్లో కాంగ్రెస్ గెలుస్తుందన్న ప్రచారంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ 2018లో అదే ట్రిక్ ను ప్రయోగించారని, అప్పుడు కూడా అనేక సర్వేల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న ప్రచారం చేశారని, కానీ బీఆర్‌ఎస్ భారీ మెజారిటీతో గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు సర్వేల్లో మాత్రమే గెలుస్తాయని, కానీ తమ పార్టీ అసలైన ఎన్నికల్లో గెలుస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మెనిఫెస్టోను బిఆర్‌ఎస్ కాపీ కొట్టిందని ఆ పార్టీ చేస్తున్న ఆరోపణలకు ధీటుగా సమాధానమిస్తూ కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలని, కానీ కాంగ్రెస్‌కు ఆ తెలివి కూడా లేదని విమర్శించారు.

తెలంగాణతో ఆయన కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ… రాహుల్ గాంధీ ముత్తాత జవహార్ లాల్ నెహ్రూ తెలంగాణను ఆంధ్రతో కలపడంతో 60 ఏళ్లు మోసపోయమన్నారు. 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడుతున్న యువకులపై కాల్పులు జరిపి 369 మంది మరణించడానికి ఆయన నాయనమ్మ ఇందిరా గాంధీ కారణమయ్యారు. ఆయన తండ్రి రాజీవ్ గాంధీ తెలంగాణకు చెందిన ఉమ్మడి రాష్ట్ర సిఎం అంజయ్యను అవమానించి ఆ పదవి నుంచి తప్పించారు. సిఎం కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్షతో దిగొచ్చి తెలంగాణ ఏర్పాటు చేస్తామని 2009లో సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ప్రకటించి మళ్లీ వెనక్కి వెళ్లడంతో వందలాది మంది ఆత్మహత్యలకు ఆయన తల్లి సోనియా గాంధీ కారణమయ్యారని పేర్కొన్నారు.

తెలంగాణ అంశాలపై పార్లమెంటులో రాహుల్ గాంధీ ఒక్క సారి కూడా మాట్లాడలేదు.  కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన డిమాండ్లపై మేము పోరాటం చేసినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఆయన కుటుంబానికి తెలంగాణతో అనుబంధం ఉంటే ఆ అనుబంధమే పదేపదే తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిందని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీలా కాకుండా ఎన్నికలు ఉన్నా లేకున్నా బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పుడూ నిజమే మాట్లాడుతుందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తెలంగాణ ఎన్నికలు పూర్తయ్యే వరకే కపట ప్రేమను కనబర్చుతారని, ఎన్నికలు వచ్చినప్పుడే వచ్చి వెళ్తుంటారని, తెలంగాణ అభివృద్ధిలో కాంగ్రెస్ పాత్ర శూన్యమని మండిపడ్డారు.

మహిళా రిజర్వేషన్ల చట్టం ఈ ఎన్నికల నుంచే అమలు చేయాలని తమ పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ డిమాండ్ చేశారని, కానీ బిజెపి ప్రభుత్వం మాత్రం పోస్ట్ డేటెడ్ చెక్కులా ఆ చట్టాన్ని రూపొందించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రేక్షక పాత్రవహించిందని విమర్శించారు. ఢిల్లీ మద్యం కేసులో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు తనపై నిరాధార తప్పుడు ఆరోపణలు చేయడంపై తీవ్రంగా స్పందించారు.రాజకీయ కుట్రలో పావును కాదని, ధైర్యంగా కొట్లాడే పటిమ నాకు ఉందని తేల్చిచెప్పారు. ఢిల్లీ మద్యం కేసుతో తన పాత్ర ఏమీ లేదని స్పష్టం చేశారు. తనకు బలముంది కాబట్టే ప్రతిపక్షాలు తనపై విమర్శలను ఎక్కుపెడుతున్నాయన్నారు.

చంద్రబాబు అరెస్టుపై నెటిజన్లు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఈ వయస్సులో చంద్రబాబు నాయుడు అరెస్టు కావడం దురదృష్టకరమని, ఆయన కుటుంబ సభ్యులు అనుభవిస్తున్న బాధను తాను అర్థంచేసుకోగలనని పేర్కొన్నారు. తనకు సిఎం కెసిఆర్ ఆదర్శమని, మంత్రి కెటిఆర్ బాధ్యతాయుతమైన సోదరుడని, ఎన్నో మధురానుబంధాలు ఉన్నాయన్నారు. తన తండ్రి కాకుండా ఇతర రాజకీయ నాయకుల్లో తన అభిమాన నాయకురాలు తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ అని చెప్పారు. సినిమాల్లో తన అభిమాన హీరో చిరంజీవి, అల్లు అర్జున్ అని వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News