Sunday, September 15, 2024

మూడో రౌండ్‌లోనే జకోవిచ్ ఔట్

- Advertisement -
- Advertisement -

ప్రతిష్ఠాత్మకమైన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో మరో సంచలనం నమోదైంది. డిఫెండింగ్ ఛాంపియన్, రెండో సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) మూడో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. ఇంతకుముందు టాప్ సీడ్ కార్లొస్ అల్కరాజ్ (స్పెయిన్) కూడా మూడో రౌండ్‌లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. తాజాగా అగ్రశ్రేణి ఆటగాడు జకోవిచ్ కూడా ఓటమితో టోర్నీ నుంచి వైదొలిగాడు. ఆస్ట్రేలియాకు చెందిన 28వ సీడ్ అలెక్సి పాప్రియన్‌తో జరిగిన మూడో రౌండ్‌లో జకోవిచ్ ఓటమి చవిచూశాడు. నాలుగు సెట్ల సమరంలో పాప్రియన్ 64, 64, 26, 64తో జకోవిచ్‌ను కంగుతినిపించాడు. ఆరంభం నుంచే పాప్రియన్ దూకుడును ప్రదర్శించాడు. తన మార్క్ షాట్లతో జకోవిచ్‌ను హడలెత్తించాడు. అతని ధాటికి నొవాక్ ఎదురు నిలువలేక పోయాడు. పాప్రియన్ అద్భుత ఆటతో జకోవిచ్‌పై ఆధిపత్యం చెలాయించాడు.

ఏ దశలోనూ అతనికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. పాప్రియన్ దూకుడుగా ఆడడంతో జకోవిచ్ ఒత్తిడికి గురయ్యాడు. ఇదే క్రమంలో వరుస తప్పిదాలకు పాల్పడ్డాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన అలెక్సి తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో సెట్‌లో కూడా పాప్రియన్ జోరు కొనసాగించాడు. అతని ధాటిని తట్టుకోవడంలో జకో విఫలమయ్యాడు. ఈసారి కూడా పాప్రియన్ సెట్‌ను దక్కించుకున్నాడు. కానీ మూడో సెట్‌లో సీన్ రివర్స్ అయ్యింది. ఈసారి జకోవిచ్ తన మార్క్ ఆటతో చెలరేగి పోయాడు. అలెక్సి దూకుడుకు అడ్డుకట్టు వేస్తూ ముందుకు సాగాడు. అద్భుత ఆటతో అలరించిన జకోవిచ్ అలవోకగా సెట్‌ను దక్కించుకున్నాడు. అయితే నాలుగో సెట్‌లో జకోవిచ్ పరిస్థితి మళ్లీ ముందుకు వచ్చింది. ఈసారి మళ్లీ ఒత్తిడికి గురయ్యాడు. దీన్ని తట్టుకోలేక తప్పుల మీద తప్పులు చేశాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో పాప్రియన్ సఫలమయ్యాడు. కీలకమైన ఈ సెట్‌ను గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.

కాగా, ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలని భావించిన సెర్బియా యోధుడు జకోవిచ్‌కు నిరాశే మిగిలింది. ఈ ఏడాది జకోవిచ్ ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కూడా సాధించలేక పోయాడు. తనకు ఎంతో కలిసివచ్చే యూఎస్ ఓపెన్‌లో ట్రోఫీ సాధించాలని భావించినా ఫలితం లేకుండా పోయింది. అలెక్సి చేతిలో ఓడి మూడో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టక తప్పలేదు. మరో పోటీలో నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ) విజయం సాధించాడు. అర్జెంటీనా ఆటగాడు టొమస్ మార్టిన్‌తో జరిగిన మూడో రౌండ్‌లో జ్వరేవ్ 57, 75, 61, 63తో జయకేతనం ఎగుర వేశాడు. తొలి సెట్‌లో ఓడిన జ్వరేవ్ తర్వాత వరుసగా మూడింటిలో గెలిచి మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. ఇతర పోటీల్లో 8వ సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే), 9వ సీడ్ గ్రిగర్ దిమిత్రోవ్ (బల్గేరియా), 12వ సీడ్ ఫ్రిట్జ్ (అమెరికా), 23వ సీడ్ టియఫొయ్ (అమెరికా) తదితరులు విజయం సాధించి నాలుగో రౌండ్‌కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ అరినా సబలెంకా (బెలారస్) మూడో రౌండ్‌లో విజయం సాధించింది. మూడు సెట్ల సమరంలో సబలెంక 26, 61, 62తో అలెగ్జాండ్రొవా (రష్యా)ను ఓడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News