Sunday, May 5, 2024

జర్నలిస్టులు కొనుగోలు చేసిన స్థలాన్ని వారికే ఇవ్వాలి: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -
న్యాయ స్థానం తీర్పును ప్రభుత్వాలు గౌరవించాలి
ఈ స్థలం కోసం ఎదురుచూసి 60 మంది జర్నలిస్టులు నేలరాలిపోయారు
జర్నలిస్టుల పక్షాన బీజేపీ పోరాడుతుంది
తాము అధికారంలోకి రాగానే ఈ స్థలాన్ని స్వాధీనం చేస్తాం
పేట్ బషీరాబాద్ లోని జేఎన్ జేహెచ్ సొసైటీ స్థలాన్ని సందర్శించిన బండి సంజయ్

హైదరాబాద్: జర్నలిస్టులు కొనుగోలు చేసిన స్థలాన్ని వాళ్లకు ఇవ్వడానికి అభ్యంతరమేమిటని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి 10 నెలలు దాటినా ఎందుకు అమలు చేయడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. శుక్రవారం పేట్ బషీరాబాద్‌కు విచ్చేసిన ఆయన జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌజింగ్ సొసైటీకి కేటాయించిన స్థలాన్ని సుప్రీంకోర్టు న్యాయవాది, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎన్.రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మేడ్చల్ అర్బన్, రూరల్ జిల్లాల అధ్యక్షులు హరీష్ రెడ్డి, విక్రమ్ రెడ్డిలతో కలిసి సందర్శించారు. సుప్రీంకోర్టు తీర్పునే కాలరాస్తారా ఈ స్థలం కోసం ఎదురుచూసి ఇప్పటికే 60 మంది జర్నలిస్టులు నేలరాలిపోయారు. ఇంకెంత మంది చనిపోతే కనికరిస్తారని తమకు కేటాయించిన స్థలాన్ని బండి సంజయ్‌కు చూపించిన జర్నలిస్టులు ప్రభుత్వం ఆ స్థలాన్ని అప్పగించకపోవడంతో జరుగుతున్న పరిస్థితులను వివరించారు.

ఆ స్థలాన్ని చుట్టూ తిరిగిన బండి సంజయ్ అక్కడే ఉన్న కట్టమైసమ్మ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ 15 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం 70 ఎకరాలు స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రూ హౌజింగ్ సొసైటీ పేరుతో 1105 మంది జర్నలిస్టులకు కేటాయించింది. ఈ స్థలాన్ని అప్పుడున్న మార్కెట్ ధర ప్రకారం రూ. 12.50 కోట్లు చెల్లించి జర్నలిస్టులంతా స్థలాన్న కొనుగోలు చేశారని పేర్కొన్నారు. ఆ డబ్బుల కోసం అప్పట్లో ఒక్కోక్క జర్నలిస్టు ఇంట్లో అప్పు చేసి, పుస్తెలతాడు కుదువపెట్టి రూ. 2 లక్షలు జమ చేసి కట్టారని , కొందరు కోర్టుకు వెళ్లడంతో ఈ కేసు తొలుత హైకోర్టుకు, తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్లిందన్నారు. 70 ఎకరాల స్థలం జేఎన్ జే సొసైటీకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ సుప్రీం కోర్టు 2017లో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని , ఆ తరువాత గతేడాది ఆగస్టు 24న తుది తీర్పులో 70 ఎకరాలు స్థలాన్ని జేఎన్ జే హౌసింగ్ సొసైటీకే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆదేశించినట్లు తెలిపారు.

తీర్పు వచ్చి 10 నెలలైనా సర్కారు పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల స్థలాన్ని మాత్రం ఇంతవరకు అప్పగించకపోవడానికి కారణమేంటో సమాధానం చెప్పాలన్నారు. వీళ్లంతా చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్న జర్నలిస్టులని ఉండటానికి ఇల్లు లేక అద్దెకొంపల్లో జీవితాలను వెళ్లదీస్తూ సమాజం కోసం పనిచేస్తున్నారని వీళ్లంతా డబ్బులు కట్టి కొనుగోలు చేసిన స్థలాన్ని ఇవ్వకపోవడం బాధకరమన్నారు.

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా అమలు చేయడం లేదంటే ఇంకా సామాన్యుడిని పరిస్థితి ఏ విధంగా అర్ధం చేసుకోవాలన్నారు. ఈ స్థలాల కోసం ఎదురు చూసిన సభ్యుల్లో ఇప్పటికే 60 మందికి పైగా చనిపోయారు. ఈ ఒక్క నెలలోనే ముగ్గురు జర్నలిస్టులు రామ్ ప్రసాద్, దొరై స్వామి, గోపరాజు మల్లపరాజు గుండె పోటుతో చనిపోవడం ఆవేదన కలిగించిందన్నారు. కమిటీ పేరు చెప్పుకుని కొందరు జర్నలిస్టులు ఎమ్మెల్యే, కార్పొరేషన్ పదవులు తీసుకున్నరని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం తీర్పును గౌరవించాలని లేకుంటే జర్నలిస్టుల పక్షాన న్యాయపోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు లో ధిక్కరణ పిటీషన్ వేసి జర్నలిస్టులకు స్థలాలిప్పించే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరో ఐదు నెలలు ఆగితే తాము అధికారంలోకి వస్తామని వెంటనే స్థలాన్ని జర్నలిస్టులకు స్వాధీనం చేస్తామని ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టులందరికీ ఇండ్లు కట్టించి ఇచ్చే బాధ్యత బీజేపీ తీసుకుంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News