Monday, May 6, 2024

టిటిడి లోకల్ అడ్వయిజరీ కమిటీ అధ్యక్షుడిగా రవి ప్రసాద్

- Advertisement -
- Advertisement -

పంజాగుట్ట : సనతాన ధర్మపరిరక్షణకు, వేద సంప్రదాయాలు కాపాడేందుకు, ప్రాచీన విలువలను కాపాడుకునేందుకు టీటీడీ పాలకమండలి కట్టుబడి పని చేస్తుందని టీటీడీ బోర్డు చైర్మన్ బి. కరుణాకర్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ టీటీడీ లోకల్ అడ్వయిజరీ కమిటీ అధ్యక్షుడిగా ఎలిశాల రవి ప్రసాద్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆదివారం జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌తో పాటు ఎంపి జోగినిపల్లి సంతోష్, మాజీడీజీపీ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాన నగరాల్లో ఉన్న ఆలయాలకు లోకల్ అడ్వయిజరీ కమిటీలను వేసి ఆలయాలను అభివృద్ధి పథంలో నడిపించేలా కృషి చేస్తున్నామని అన్నారు. గడిచిన నాలుగేళ్ళలో టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా సుమారు 2500లకు పైగా ఆలయాలను నిర్మించడంతో పాటు కొన్నింటిని పునర్నిర్మించామని అన్నారు.

వేద సంస్కృతిని కాపాడటంతో పాటు వేద విద్యార్థుల ఆర్ధిక స్థితిగతులు బాగుపడేలే ఎప్పటికప్పుడు టీటీడీ అనుబంధ విశ్వ విద్యాలయాలు కృషి చేస్తున్నాయని అన్నారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం తీసుకొచ్చేందుకు టీటీడీ ఆధ్వర్యంలోని హిందూ ధర్మప్రచార పరిషత్ ద్వారా నిత్యం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రానున్న రోజుల్లో వాటిని మరింతగా పెంచుతామని అన్నారు అనంతరం ఎలిశాల రవి ప్రసాద్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. రెండేళ్ల పాటు ఈ పదవీ బాధ్యతలు కొనసాగుతాయని జూబ్లీహిల్స్‌తో పాటు కరీంనగర్ ఆలయాల బాధ్యత కూడా ఇందులో ఉంటుందని అన్నారు. త్వరలోనే అధ్యక్షుడి తర్వాత పూర్తి స్థాయి కమిటీని నియమిస్తామని అన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన లోకల్ అడ్వయిజరీ కమిటీ అధ్యక్షుడు రవి ప్రసాద్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అధ్యక్ష పదవిని కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు గడ్డం సీతారెడ్డి, నాగ సత్యం, సుబ్బరాజు, హిమాయత్‌నగర్ టీటీడీ ఎల్‌ఏసీ ప్రెసిడెంట్ ప్రసాద్, ఐఏఎస్ అధికారులు అమయ్‌కుమార్, హరీష్, నాయక్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News