Sunday, June 16, 2024

ఆస్ట్రేలియాలో షాద్ నగర్ వాసి మృతి

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియా దేశంలో స్థిరపడ్డ అరటి అరవింద్ యాదవ్

ఐదు రోజుల క్రితం అరటి అరవింద్ అదృశ్యం

సముద్రంలో పోలీసులకు అరటి అరవింద్ శవం లభ్యం

అరటి అరవింద్ ది హత్య, లేక ఆత్మహత్య..?!

హైదరాబాద్: షాద్ నగర్ భారతీయ జనతా పార్టీ సీనియర్ లీడర్ కీర్తిశేషులు అరటి కృష్ణ ఏకైక కుమారుడు అరటి అరవింద్ యాదవ్ అనుమానాస్పద స్థితిలో ఆస్ట్రేలియాలో మృతి చెందదంతో షాద్ నగర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. గత 12 సంవత్సరాలుగా ఆస్ట్రేలియాలో ఉద్యోగ నిమిత్తం అక్కడే స్థిరపడిన అరటి అరవింద్ యాదవ్ (30) గత ఐదు రోజుల క్రితం అదృశమైనట్టు ఆస్ట్రేలియాలోని వేల్స్ పోలీస్ ఫోర్స్ ఈస్ ఎ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ స్పష్టం చేసింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నివాసం ఉంటున్న 25ఏ డెర్మాంట్ స్ట్రీట్, హాసాల్ గ్రోవ్, ఎన్.ఎస్.డబ్ల్యూ 2761 లో షాద్ నగర్ పట్టణానికి చెందిన అరవింద్ గత సోమవారం ఇంటి నుండి బయలుదేరి వెళ్ళాడు. ఆ తర్వాత అక్కడి పోలీసులు మిస్సింగ్ కేసు మొదట నమోదు చేశారు. అరవింద్ ప్రయాణించిన కారు సముద్రానికి కొంత దూరంలో లభించింది.

సముద్రంలో ఓ యువకుడి శవం లభ్యమైనట్టు స్థానిక పోలీసులు కనుగొన్నారు. ఆ శవం డిఎన్ఏ ప్రకారం అరవింద్ దేనని ద్రువీకరించారు. అయితే అరవింద్ యాదవ్ ఎలా చనిపోయాడు? ఎందుకు చనిపోయాడు? అతనిది హత్యా ? లేక ఆత్మహత్యా ?అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. గత సోమవారం ఇంటి నుండి బయలుదేరి వెళ్లిన అరటి అరవింద్ సముద్రంలో శవమై తేలిన విషయం పట్ల మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. బిజెపి నేత అరటి కృష్ణ యాదవ్ 2006 ఏప్రిల్ 7వ తేదీన ఏలూరు వద్ద ఓ లారీ ప్రమాదంలో చనిపోయారు. తను ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం ఇనుప చువ్వల లారీని ఢీకొని అప్పట్లో కృష మృతి చెందారు. కృష్ణ సతీమణి ఉషారాణి షాద్ నగర్ పట్టణంలో నివసిస్తున్నారు.

ఆమెకు ఒకే ఒక కుమారుడు అరటి అరవింద్.. అతను కూడా ఇలా ఆకస్మిక మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అరటి కృష్ణ సోదరుడు అరటి యాదయ్య, అరటి బాలకృష్ణను ఈ విషయమై మీడియా వివరాలు కోరగా వారు కన్నీటి పర్యంతమయ్యారు. సముద్రంలో లభించిన శవం తమ అరటికృష్ణ కుమారుడుదని పోలీసులు చెబుతున్నారని ఏం జరిగిందో ఇంకా తమకు తెలియదని వారు వాపోతున్నారు. 18 నెలల క్రితమే అరటి అరవింద్ కు వివాహం జరిగినట్టు వారు పేర్కొన్నారు.

కేశంపేట మండలం చింతకొండపల్లికి చెందిన ఓ వ్యక్తి కూతురితో వివాహం జరిగినట్టు చెప్పారు. ఇటీవల అరవింద్ తల్లి ఉషారాణి, అరవింద్ భార్య ఆస్ట్రేలియా వెళ్లారని గత శనివారమే అరవింద్ తల్లి ఉషారాణి షాద్ నగర్ వచ్చేసారని కుటుంబ సభ్యులు చెప్పారు. అరవింద్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా హత్య చేశారా? తెలియాల్సి ఉంది. ఆస్ట్రేలియా పోలీసులు విచారణ జరుపుతున్నారని త్వరలోనే రిపోర్టు వెల్లడిస్తారని మృతుడి కుటుంబ సభ్యులు అరటి యాదయ్య బాలకృష్ణలు తెలిపారు. ఇదిలా ఉండగా అరవింద్ యాదవ్ కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడని మరికొందరు అంటున్నారు. మృతుడి స్నేహితులతో సహా ఉద్యోగులను ఆస్ట్రేలియా పోలీసులు విచారణ జరుపుతున్నారు. కుటుంబ కలహాలతోనే అరవింద్ మృతి చెంది ఉండవచ్చు అని సహ ఉద్యోగులు స్పష్టం చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం అరవింద్ భార్య ఆస్ట్రేలియాలోనే ఉన్నారు. తల్లి ఉషారాణి షాద్ నగర్ లో ఉన్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News