Thursday, May 2, 2024

చైనా అదుపులోని ఒప్పందం

- Advertisement -
- Advertisement -

Arcep Regional Comprehensive Economic Partnership   ఎనిమిదేళ్ల చర్చలు, తర్జనభర్జనల తర్వాత మొన్న ఆదివారం నాడు చైనా, మరి 14 ఆసియా పసిఫిక్ దేశాలు కలిసి సంతకాలు చేసిన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సెప్ రీజినల్ కాంప్రెహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్ షిప్) ఒప్పందం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాంతీయ స్వేచ్ఛా వాణిజ్య అంగీకార పత్రంగా చరిత్ర సృష్టించబోతోంది. చైనా తర్వాత రెండవ అత్యధిక జనాభా గల ఇండియా ఇందులో చేరకపోడమే చంద్రునిలో మచ్చ మాదిరిగా ఈ ఒప్పందాన్ని అసమగ్రమైనదిగా చేస్తున్నది. అయితే ఇండియా పునరాలోచించుకొని ఎప్పుడు అనుకుంటే అప్పుడు చేరడానికి ఈ ఒప్పంద కర్తలు సందు విడిచిపెట్టడం గమనించవలసిన విషయం.

సువిశాల మార్కెట్ కలిగిన భారత్ చేరితే అది ఒప్పంద సభ్య దేశాలకు మరింత ప్రయోజనకరం కాగలదని భావించి 18 మాసాల పాటు వేచి ఉండే వ్యవధి షరతును కూడా పక్కన పెట్టి మన దేశానికి నిర్నిబంధంగా తలుపులు తెరిచి ఉంచారు. ప్రాంతీయ దేశాల మధ్య స్వేచ్ఛా వ్యాపార ఒప్పందాల వల్ల వాటి సరకులు ఇచ్చిపుచ్చుకోడానికి సులువైన మార్గాలు తెరుచుకుంటాయి. అవి ఆయా దేశాల వాణిజ్యాన్ని బాగా పెంచుతాయి. వాటి ఆర్థికాభివృద్ధికి ఇతర వికాసాలకు బాసటగా నిలుస్తాయి. ఇప్పుడు చైనా ఆధ్వర్యంలో సంతకాలు జరిగిన ఆర్‌సెప్‌లో ఏసియాన్ కూటమిలోని 10 ఆగ్నేయాసియా దేశాలతో పాటు ఆస్ట్రేలియా, చైనా, జపాన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియాలు సభ్యత్వం తీసుకున్నాయి. మొదట్లో ఇండియా కూడా చేరుతుందనుకున్నారు గాని తనకున్న భయాలు, అభ్యంతరాల కారణంగా దూరంగా ఉండాలని గత ఏడాది నవంబర్‌లో అది నిర్ణయించుకున్నది. చైనాతో ఇటీవలి కాలంలో ఎన్నడూలేనంతటి స్థాయి సరిహద్దు ఘర్షణలు చోటు చేసుకోడంతో ఇండియా విముఖత ఇప్పుడు మరింత బలపడింది. ఆర్‌సెప్ దేశాలు తమ మధ్య సుంకాలు లేని దిగుమతుల కోసం ఏ సరకును, ఏ సేవను ఎంత మేరకు ఏ నాణ్యతా ప్రమాణాలతో ఉత్పత్తి చేయాలనే దానికి సంబంధించి నిబంధనలు ఏర్పాటు చేసుకుంటాయి.

ఆ ప్రాతిపదికన ఈ అన్ని దేశాల్లోనూ పరిశ్రమలు, తయారీ, సేవా కేంద్రాలు నెలకొనడానికి అవకాశం కలుగుతుంది. చైనాలో తయారయ్యే వస్తువుల దిగుమతులపై అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విపరీతంగా సుంకాలు బిగించి వాణిజ్య యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో వాటి బారి నుంచి తప్పించుకోడానికి బహుళ జాతి కంపెనీలు ఈ ఒప్పందంలోని చైనాయేతర ఆసియా, పసిఫిక్ దేశాల్లో పరిశ్రమలు నెలకొల్పుకోడానికి ఆర్‌సెప్ దారి వేస్తుంది. ఆ విధంగా ఉత్తర అమెరికా దేశాలకు తరలిపోకుండా వాటిని ఆపుతుంది. చైనా కనుసన్నల్లోనే దాని బయటనున్న ఈ ప్రాంత దేశాల్లో బహుళ జాతి సంస్థలు ఉత్పత్తులు చేపట్టడానికి దోహదపడుతుంది. ఆర్‌సెప్ ఒక విధంగా అంతర్జాతీయ రంగంపై అమెరికా పెత్తనాన్ని ఎదిరించి చైనాకు అనుకూలమైన వాతావరణం కల్పించడంలో ఒక ప్రబల సాధనమవుతుంది. చైనా 2013లో ఆర్‌సెప్‌ను తలపెట్టిన వెంటనే అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దానికి ప్రతిగా ట్రాన్స్ పసిఫిక్ పార్టనర్ షిప్ (టిపిపి పసిఫిక్ దేశాల భాగస్వామ్య ఒప్పందం)ను తలపెట్టారు. అందులో చైనాకు చోటివ్వకుండా దాని పొరుగునున్న వియత్నాం, మలేసియాలు సహా జపాన్, ఆస్ట్రేలియా మున్నగు 11 దేశాలను చేర్చారు.

ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాను దాని నుంచి తప్పించారు. చైనాతో విభేదాలున్న జపాన్, వియత్నాం వంటి దేశాలూ ఆర్‌సెప్‌లో చేరాయి. దానితో రాజకీయ శత్రుత్వాన్ని పక్కన పెట్టి దాని వల్ల కలుగనున్న ఆర్థిక ప్రయోజనాలకు అవి ప్రాధాన్యమిచ్చాయి. ఆర్‌సెప్‌లో భారత దేశం చేరకపోడానికి చైనాతో గల సరిహద్దు ఉద్రిక్తతలు ఒక కారణం అయినప్పటికీ మన మార్కెట్‌లోకి అమితంగా వచ్చిపడుతున్న దాని వస్తువుల ఉరవడి మరింత ఉధృతమవుతుందన్న భయం మరొక హేతువని భావించక తప్పదు. చైనాకు మన ఎగుమతుల విలువ కంటే అధికంగా 60 బిలియన్ డాలర్ల కిమ్మత్తు వస్తువులు అక్కడి నుంచి మన దేశంలోకి వెల్లువెత్తి వస్తున్నాయి. దానితో ఇంత భారీ వాణిజ్య లోటును ఉంచుకొని ఆర్‌సెప్‌లో మనం చేరితే అది మరింత పెరిగిపోతుందన్న అభిప్రాయాన్ని కొట్టిపారేయలేము. అలాగే ఆర్‌సెప్‌లో సభ్యత్వం తీసుకున్న మరి పది దేశాలతో మనం గణనీయమైన వాణిజ్య లోటులో కొనసాగుతున్నాము. అలాగే విదేశాల నుంచి వచ్చిపడుతున్న ఉత్పత్తుల పోటీకి తట్టుకోలేక మన వ్యవసాయ రంగం, పాడి పరిశ్రమ కుంగికునారిల్లిపోతున్నదన్న మాట వాస్తవమే. అయితే ఆర్‌సెప్ వంటి అతిపెద్ద ప్రాంతీయ వాణిజ్య ఒప్పందంలో చేరడం వల్ల ఇతరేతరంగా అనేక మార్గాల్లో భారత్ ప్రయోజనం పొందే అవకాశాలున్నాయి. మనం అంతర్జాతీయ మార్కెట్ పోటీని తట్టుకోగల నాణ్యమైన ఉత్పత్తుల ఎగుమతులను పెంచుకోగలి గే కొద్దీ ఆర్‌సెప్‌లో చేరవలసిన అవసరాన్ని గుర్తించకతప్పదు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News