Sunday, May 5, 2024

ఎంఎస్‌ఎంఇల దీన స్థితి

- Advertisement -
- Advertisement -

Atmanirbhar Bharat scheme did not work for MSMEs

 

కరోనా సృష్టించిన అపూర్వ సంక్షోభానికి రెక్కలు నరికిన పక్షిలా మారిన ఆర్థిక రంగాన్ని ఆదుకుంటామంటూ గత ఏడాది మే 12న ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ పథకం కోట్లాది సన్న, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఇలు) మూతి మీద చిటికెడు గంజి అయినా పోయలేదని, క్లిష్టమైన నిబంధనలతో కొంగకు నక్క బావ విందు కథను తలపించిందని ఇప్పుడు స్పష్టంగా రుజువైంది. ఈ పథకం అవతరించి ఏడాది అయినప్పటికీ దాని వల్ల తెలంగాణలోని ఎంఎస్‌ఎంఇలకు ఎటువంటి మేలు కలగలేదని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు గురువారం నాడు కుండ బద్దలు కొట్టారు. రాష్ట్రంలో గల 80 శాతానికి పైగా పరిశ్రమలు చెప్పనలవికాని కష్టాలు ఎదుర్కొంటున్నాయని, 25 శాతం సంస్థలు సున్నా ఆదాయం స్థితికి దిగజారాయని మంత్రి వెల్లడించారు. ఆత్మనిర్భర్‌లో భాగంగా ప్రకటించిన ఆపత్కాల పూచీ రుణపథకం గాని, అందులోని మరి రెండు స్కీములు గాని సంక్లిష్ట నియమాలతో ఎందుకూ కొరగాకుండా పోయాయని మంత్రి ఆ మేడి పండు పొట్ట విప్పి చూపించారు.

ఇతర రాష్ట్రాల లోని పరిశ్రమల పరిస్థితీ ఇదేనని అన్నారు. ఆ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. కొన ఊపిరిలో గల ఎంఎస్‌ఎంఇలకు భారీ ఆర్థిక గ్రాంటు ఇవ్వాలని కోరారు. దేశంలో చిన్న, చితక, మధ్య తరహా పరిశ్రమలన్నీ కలిసి 6.3 కోట్లుంటాయి. ఇవి దేశ తయారీ రంగానికి వెన్నెముక వంటివి. పెద్ద పరిశ్రమలకు కూడా విడి భాగాలను, ఇతర అవసర ప్రాథమిక తయారీ సామాగ్రిని సమకూరుస్తాయి. స్వయం ఉపాధికి, తోటి పనివారి రోజులు గడవడానికి ఉపయోగపడతాయి. వీటిలో అత్యధిక శాతానికి బ్యాంకుల్లో ఖాతాలు కూడా ఉండవు. దేశంలోని మూడింట ఒక వంతు ఎంఎస్‌ఎంఇలకే బ్యాంకు రుణాలు అందుతున్నాయని, మిగతావి బయటి అధిక వడ్డీ అప్పుల మీదనే నడుస్తున్నాయని ప్రపంచ బ్యాంకు విభాగమైన అంతర్జాతీయ పరపతి సంస్థ 2018 నివేదికలో వెల్లడించింది. అటువంటి ఈ పరిశ్రమలకు అనేక నిబంధనలు విధించి మొనదేలిన గీటు రాళ్ల మీద నిలబడే వారే అర్హులంటూ ఆత్మనిర్భర్‌లో పేర్చిన విధి విధానాల అగడ్తలు దాటే సత్తా కొరవడి అవి వాటి వంక కన్నెత్తయినా చూడలేకపోయాయి.

ఆకలితో మలమల మాడిపోతున్న పిల్లికి సలసల కాగుతున్న పాలు పోసిన చందంగా ఆత్మనిర్భర్ తెల్లారిపోయింది. దాని గురించి గొప్పలు చెప్పుకొని జబ్బలు చరుచుకునే అవకాశం కూడా కేంద్రంలోని బిజెపి పాలకులకు కొరవడింది. ఎంఎస్‌ఎంఇల ఉత్పత్తి విలువ స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) లో 30 శాతం పైనే. ఆర్థిక వృద్ధికి ఇవి ఎంతగా తోడ్పడుతున్నాయో, ఎన్నెన్ని ఉద్యోగాలు కల్పించి ఎన్ని కోట్ల కుటుంబాలను ఆదుకుంటున్నాయో దీనిని బట్టి గ్రహించవచ్చు. ఈ రంగం నుంచి లభిస్తున్న ఉద్యోగాల్లో అత్యధిక శాతం రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోని పరిశ్రమల నుంచి ఉత్పన్నమవుతున్నవే. ప్రభుత్వ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేయించుకోడంలోని క్లిష్టతకు, ఇబ్బందులకు భయపడే ఈ పరిశ్రమలు అందుకు చొరవచూపలేకపోతున్నాయని తేలింది. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) విధి విధానాలను సంతృప్తి పరిచే స్తోమత లేక ఎన్ని వ్యాపారాలు దెబ్బతిని ఎంతగా కుంగి కునారిల్లాయో తెలిసిందే. జిఎస్‌టికి ముందు 5 శాతం వ్యాట్‌తో వదిలిపోయిన పన్ను పోటు అది విరుచుకుపడిన తర్వాత ఎన్నో రెట్లు పెరిగిపోయిందని, తమ సరకులు 18%, 28% శ్లాబుల్లో చేరి ధరలు చెట్టెక్కాయని, దానితో తమ అమ్మకాలు పడిపోయాయని చాలా మంది వ్యాపారులు చెప్పుకొని బాధపడ్డారు.

అనేక వ్యాపారాలు మూతపడిపోయాయి. తొలి విడత కరోనా వల్లనే భారత్‌లో అసంఘటిత రంగంలో పని చేస్తున్న 40 కోట్ల మంది కార్మికులు నిరుపేదరికంలోకి జారిపోయారని, వారు తమ పనులు కోల్పోయారని అంతర్జాతీయ కార్మిక సంస్థ గత అక్టోబర్‌లోనే వెల్లడించింది. భారత దేశ సమ్మిళిత వృద్ధికి వెన్నెముకలైన ఎంఎస్‌ఎంఇలు తీవ్ర అవాంతరాలు ఎదుర్కొని ఛిన్నాభిన్నమైపోయాయని ఈ సంస్థ చెప్పింది. దేశ మొత్త ం కార్మిక శక్తిలో 72 శాతం అధోగతి పాలైందని వివరించింది. 73 శాతం కార్మిక శక్తికి ఆధారంగా ఉన్న ఎంఎస్‌ఎంఇలను అందని ద్రాక్షల్లాంటి ఇటువంటి పథకాలు చూపించి ఆశపెట్టి అవహేళన చేయడం కేంద్ర పాలకులకు తగని పని. తెలంగాణ పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ లేఖ అయినా కేంద్రాన్ని దీర్ఘ నిద్రలోంచి మేల్కొల్పాలి. ఆయన సూచించినట్టు ఎంఎస్‌ఎంఇలకు నేరుగా నగదు సాయం అందించే భారీ ఆర్థిక గ్రాంటును మంజూరు చేయడమొక్కటే వారి ముందున్న తక్షణ కర్తవ్యం. ఇది జరిగినప్పుడే దేశ ఆర్థిక రంగం తిరిగి పుంజుకోడానికి దారి కలుగుతుంది. అదే పనిగా కార్పొరేట్ శక్తుల పల్లకీని మోస్తూ బహుళ ప్రజానీకానికి మేలు చేసే అంశాలను నిర్లక్ష్యం చేయడం దేశానికి చెప్పనలవికానంత కీడు చేస్తుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News