Sunday, April 28, 2024

బిసిలది రాయితీల పోరాటం కాదు…. ఇక రాజకీయ పోరాటమే

- Advertisement -
- Advertisement -
రాష్ట్ర రాజకీయాల్లో మెమెంతో మాకంత దక్కాల్సిందే
ఓటు ఆయుధంగా రాజకీయ అధికారం సాధిస్తాం
ఆగస్టు సింహగర్జనలో రాజకీయ వేదిక ప్రకటిస్తాం
ఘనంగా రాజకీయ ప్లీనరీ….హాజరైన అఖిలపక్ష నేతలు, సామాజిక ఉద్యమ నేతలు

హైదరాబాద్ : జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బిసిలకు తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకెళ్తామని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ”ఓటు మనదే..సీటు మనదే, మేమెంతో మాకంత”అనే నినాదంతో ఈ ప్లీనరీని నిర్వహిస్తున్నామని, రాజకీయ అధికారం కోసం రాజీలేని పోరాటం నిర్వహిస్తామని చెప్పారు. ఆగస్టు 3న వారంలో 5 లక్షల మందితో హైదరాబాద్ లో సింహ గర్జన సభను నిర్వహిస్తామని జాజుల ప్రకటించారు. పదవులకు అమ్ముడుపోయే జాతి బిసిలది కాదని, సర్దార్ సర్వాయి పాపన్న స్పూర్తితో అధికారమే అంతిమ లక్ష్యంగా ముందుకెల్దామని ఆయన పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో 60 మంది బిసిలను ఎంఎల్‌ఎలుగా చూడాలని ఉందని, ఇందుకు బిసి సంక్షేమ సంఘం రాజకీయాలను శాసించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుందని చెప్పారు. 60వ ఎంఎల్‌ఎ గా తాను అసెంబ్లీలో అడుగుపెడుతానని శ్రీనివాస్ గౌడ్ తన మనసులోని మాటను బయటపెట్టారు. తెలంగాణలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిసిలు రాజకీయ సాధికారతను సాధించడమే ఏకైక లక్ష్యంగా ఎల్‌బినగర్ మన్సూరాబాద్ లోని కెబిఆర్ కన్వెన్షన్ లో శనివారం బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బిసిల రాజకీయ ప్లీనరీ ఘనంగా జరిగింది. ఈ ప్లీనరికి రాష్ట్ర వ్యాప్తంగ వేలాది మంది తరలివచ్చారు. ముందుగా బహుజన పితామహుడు మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వేదికమీద ఉన్న నేతలంతా అభివాదం చేస్తూ తమ ఐక్యతను చాటారు.

బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షత జరిగిన ఈ ప్లీనరీలో ముఖ్య అతిధిగా జస్టిస్ ఈశ్వరయ్య, మాజి ఎంపి బిజెపి రాష్ట్ర నాయకులు బూర నర్సయ్యగౌడ్, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, ఎంబిసి కార్పొరేషన్ మాజి చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బిసి కమిషన్ సభ్యులు ఉపేందర్, విద్య,వైద్య మౌలిక సదుపాయాల కమిటి మాజి చైర్మన్ నాగేందర్‌లు, ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్, కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, కత్తి వెంకటస్వామి పాల్గొన్నారు.

జాతీయ బిసి కమిషన్ మాజి చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ అస్థిత్వాన్ని కాపాడుకుంటూ నీతి ,నిజాయితీ, నిబద్ధతతో సంఘటితంగా పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. రాజకీయంగా సామాజిక న్యాయం పాటించని పార్టీలు కాలగర్భంలో కలిసిపోతాయని, పదేళ్లుగా దేశంలో కాంగ్రెస్ పరిస్థితి అలానే ఉందని పేర్కొన్నారు. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో తీసుకున్న నిర్ణయాలతో ఆపార్టీ మళ్లీ కోలుకుంటుందని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్ విధానాలతో బిజెపి ముందుకెల్తూ కులం, మతం పేరుతో రాజకీయాలు చేస్తుందని, అది ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదమని ఆవేదన వ్యక్తంచేశారు. బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 60 శాతం ఉన్న బిసిలకు రాజకీయంగా తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. తాడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజకీయ సాధికారతను సాధించడానికి ఇంత పెద్ద సంఖ్యలో బిసిలను ఐక్యం చేసి ప్లీనరీని నిర్వహించిన శ్రీనివాస్ గౌడ్ కు, సంఘానికి తాను అండగా ఉంటానని చెప్పారు.

డాక్టర్ విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ కరుణానిధి,స్టాలిన్,అఖిలేష్ యాదవ్, తేజస్వియాదవ్ ఇంకా అనేకమంది దేశంలో ఆత్మగౌరవానికి నిదర్శనమని చెప్పారు. డాక్టర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ బిసిలకు రాజ్యాధికారం కోసం సత్తా చాటేందుకు ఇదే మంచి సమయమన్నారు. ఢిల్లీ స్థాయిలో ఉద్యమాన్ని ఉదృతంగా తీసికెళ్లినప్పుడే అన్ని రాజకీయ పార్టీలు దిగివస్తాయని అన్నారు. మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలు ఐక్యంగా ముందుకు సాగితే రాజ్యాధికారం మన సొంతమవుతుందని, రాజ్యాధికారంలో మహిళలకు కూడా వాటా ఉండాల్సిందేనని మందకృష్ణ చెబుతూ ఈ ప్లీనరీలో తీర్మానం చేయాలని సూచించారు. నూతన సోషలిస్టు వ్యవస్థను నిర్మించడం కోసం అందరం ఐక్యంగా ముందుకెల్దామని పిలుపునిచ్చారు.

ఈ ప్లీనరీలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భైరి రవికృష్ణ, బిసి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సురిగి దుర్గయ్యగౌడ్, బిసి కుల సంఘాల జెఎసి చైర్మైన్ కుందారం గణేష్ చారి, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, బిసి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకాల శ్యామ్ కురుమ, వడ్డే జానయ్య, బిసిల సైన్యం రాష్ట్ర అధ్యక్షుడు సింగం నగేష్, వజీర్ ప్రకాష్ గౌడ్, ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, పిల్లి రామరాజు యాదవ్, నాయకులు గురిజ నర్సింహ, నర్సింహ నాయక్, పాలకూరి కిరణ్, అన్ని జిల్లాల అధ్యక్షులు, కమిటీల ప్రతినిధులు, మహిళా సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News