Tuesday, April 30, 2024

నీడలు.. వెలుగులు.. మిణుగురు కలలు

- Advertisement -
- Advertisement -

భగవంతం అనే కవిని నేనెప్పుడూ చూడలేదు.ఎప్పుడూక లవలేదు. కానీ కొన్నాళ్లుగా అతని వాక్యాలు కొన్ని నా చుట్టూ తిరుగుతున్నాయి. నన్ను ఆలోచింపజేస్తున్నాయి. ఆ ఊహలు నన్ను నిలవనివ్వడం లేదు . భగవంతంఏం చేస్తుంటాడు ?ఎక్కడ ఉంటాడు?అనే విషయాలు నాకేమి తెలియదు. అయితే ఒక కవి రాసిన కవిత కదిలించే విధానం మనలో కలిగించే చైతన్యం ,మన లోపలి అంతర్ లోకాలను మేల్కొలుతుంది .అచేతనం లో కొన్ని ఆలోచనలను ప్రతిబింబిస్తుంది .
భగవంతం, అతను రాసిన వాక్యాలను బట్టి చూస్తే విపరీతంగా కవిత్వం రాసిన కవిగా కనబడడు.తను కదిలినప్పుడు తననే దృశ్యాలో కదిలించినప్పుడు, ఆలోచనలు నిలవనీయకుండా చేసినప్పుడు మాత్రమే కవితగా మారాడు. మనం అలవాటుగా చూసి, పెద్దగా ఉద్వేగం కలిగించని దృశ్యాలను భగవంతం కొత్తగా చూస్తాడు .వేరేలా ఆలోచిస్తాడు భగవంతం కవిత్వం లోమనిషి తాలూకు ఒక ఉత్తమమైన తాత్వికత మనకు కనిపిస్తుంది.

పర్యావరణం పట్ల బాధ్యత వినిపిస్తుంది. ఇతని కవిత ప్రారంభం చాలా సాధారణం ఉంటూనే ముగింపు వరకు అదే మార్గంలో తీసుకెళ్తుంది. చాలా పరిమితమైన పద చిత్రాలని ,భావచిత్రాలని వాడుకుంటూ పాఠకుడికి అనుభూతిని అందజేయడంలో ఈ కవిది అంది వేసిన హృదయం గా కనిపిస్తుంది .కవిత చదివిన తర్వాత మనలో ప్రతిస్పందన మనల్ని చైతన్యవంతులు చేస్తుంది .ఇతని కవిత్వంలో మరొక ముఖ్య విషయం కవిత మొదలుకి, ముగింపుకి మధ్య ఒక సామ్యం కనిపిస్తుంది. మొదలుపెట్టిన వాక్యంతోనే కవితలు ముగించడం ద్వారా గాని లేదా మొదటి వాక్యానికి ముగింపు వాక్యంతో ముడిపెట్టంగానే మనం గమనించవచ్చు. జీవన వైభవాన్ని ,జీవన సౌందర్యాన్ని ,ప్రాకృతిక ,నైసర్గిక సౌందర్యాన్ని దర్శించడం ఈ కవిలో ప్రత్యేక లక్షణంగా కనిపిస్తుంది .సకల చరాచర సృష్టితోను తను మమేకం చెందుతాడు . ఎవరికి వినిపించని ,కనిపించని దృశ్యాలు భగవంతానికి కనిపిస్తాయి. వినిపిస్తాయి .అవి కవితగా మారి మనల్ని ఆశ్చర్య చకితుల్ని చేస్తాయి.

ఉదాహరణకు ‘మిణుగురుల కళ్ళల్లో మన గురించిన కల’/ అనే కవితను చూస్తే కవిత ఇలా ప్రారంభమవుతుంది/ ‘ఎంతవరకు అవసరమో అంతవరకే / వర్షాలు కురవాలని / గొణుక్కుంటున్న/ నది పక్కనుండి నడిచాను/ ఎంతవరకు అవసరమో / అంతవరకే సూర్యరశ్మి పడాలని / ముచ్చటించుకుంటున్న / చెట్ల ఆకుల కింద గడిపాను’ (కవిత్వం 2016)/ ఇదిగో ఇలాంటి ఆలోచనలు మనల్ని అతని కవిత్వం వెంట నడిచేలా చేస్తాయి. భగవంతంపూల సంభాషణలు వింటాడు . అవసరం ఉన్నంత మేర మాత్రమే లోకం తిండి గింజల్ని పండించు కోవాలని కలగంంటున్న పొలాలపై ఎగురుతున్న పక్షుల తో ప్రయాణిస్తాడు./ మానవ హృదయాల్లో కరుణ ఉప్పొంగాలని, చీకట్లో పాడుకుంటున్న మిణు గురుల కళ్ళల్లోనే దీపాల వైపు చూపిస్తాడు.ఆ వెలుగులో మనిషివి కావాలి నువ్వు అంటాడు.

ఈ కవి ప్రకృతిలోని నిసర్గతని ,అమాయకత్వాన్ని, స్వచ్ఛతని ,చైతన్యాన్ని మనం గుర్తించుకోవాల్సిన విధానాన్ని జ్ఞప్తికి తీసుకొస్తాడు. భగవంతం ఆత్మగతమైన కవి ,ఇతని పదాలకు అనుభూతులు ఉంటాయి. అనుభవాలుంటాయి. ఈ కవి భాష మనల్ని లోపలకి తీసుకుపోతుంది. భాషకు నిశ్శబ్దపు రంగు పూస్తాడు. పందిపిల్ల పారవశ్యపు అరమోడ్పు కళ్ళలో ఉత్సవం చూపే , ఉత్సవం చూసే కవిత వీరిది. భగవంతం ఎలాంటి ప్రపంచం ఆశిస్తున్నాడు ?ఎలాంటి మనుషులను ఆశిస్తున్నాడు ?ఈ ప్రపంచంలో ఎలాంటి జీవితం ఉంటే బాగుంటుంది ?అనుకున్నాడు అని మనం చూసినప్పుడు అతను కవితల్లో అతను చేసిన పరికల్పనలు పాఠకుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

నా ఊహల్లో ఈ ప్రపంచం అనే కవితని పరిశీలిస్తే అందులో మొదటి ఐదు పాదాలు ఇలా ఉంటాయి./ తమ కాళ్ళ కింద పడి నలిగిపోతున్న/ చీమల సంరక్షణ గురించి/ పట్టించుకునే అంత తీరికగా ఉంటారు/ మనుష్యులు’ ( కవిత -2012)/ పై వాక్యాలు పరిశీలించినప్పుడు అతని దృక్పథం ఏంటో మనకు తెలుస్తుంది. మానవునిలో మరుగున పడిపోయిన అంతర్జీవనం గురించి భగవంతుని కవిత్వంలో వెతుకులాట కనిపిస్తుంది.ఒక కొత్త మానవుణ్ణి ఈ కవి ఆశిస్తున్నాడు/ ఈ కవి తన అంతఃచేతనలో మనిషిని గొప్పగా ఊహిస్తున్నాడు. విచక్షణ కోల్పోని మనుషులు ఉండే లోకం లో/ స్వర్గం ఉంటుందని నమ్ముతాడు..
భగవంతం లిటరల్ పోయిట్ కాదు. ఫిసికల్ కవి కాదు. అంతకు మించి../ ఒక జీవి పేరుని / మరొక జీవి తలుచుకుంటున్నప్పుడు / కురిసిన ఆనంద బాష్పాలే/ ఈ విశ్వంలో ఒకచోట / నదులు సముద్రాలుగా రూపొందుతాయి.(కవిత్వం- 2019)/ గొప్ప కరుణ నిండిన హృదయంతో ఉన్నవాడు మాత్రమే ఈ వాక్యాలు రాయగలడు. భౌతిక శాస్త్రంలో ఆదర్శ వస్తువు అని ఒకటి ఉంటుంది. అదేంటో మనకు కనిపించదు ,వినిపించదు.

అలాగే భగవంతంసమస్త ప్రపంచాన్ని స్వర్గమయం చేయాలనుకుంటే ఇక్కడి మనుషులు ,ప్రకృతితో జమిలీగా ఎలా కలుసుకోవాలో ఎ,లా బతకాలో కొన్ని స్పష్ఠీకరణలను తన కవిత్వంలో రూపొందించాడు. మనకు బాగా అలవాటు అయిన దృశ్యాల్ని ,మనకు బాగా అలవాటయి దృశ్యాన్ని విభిన్నంగా చూడడం ఇతని కవిత్వంలో మనం పదే పదే చోడొచ్చు. మన ఊహలను భగవంతం భగ్నం చేస్తాడు. ఈ కవే పాఠకుడిగా మారిపోయి రాసిన కవిత్వంగా అనిపిస్తుంది.ఇతని వాక్యానికి గొప్ప శక్తిని ఇస్తాడు. వైవిధ్యాన్ని పూస్తాడు. భగవంతుని తన కవిత్వంలో కళాత్మక వ్యక్తీకరణను మిస్ కానివ్వలేదు తన ఉద్వేగాన్ని తనలో కలిగే కంపనని అలాగే పాఠకుడి లోకి పంపే ఏర్పాటు చేశాడు.
నీడలు వెలుగులు అనే కవిత నిండా ఇతను చేసిన ఊహలు / చాలా తిక్క గా అనిపిస్తాయి.కానీ అలా ఒక్కో వాక్యం చదువుతూ పోతే గొప్ప అనుభూతి మనల్ని నిలువ నీయదు./ అలవాటైపోయిన దృశ్యాలు / అనుభూతినివ్వని భావాల పట్ల / వి…సు…గు ..పు…ట్టి / కొంత కొత్తదనం కోసం / ఒకరోజు పగటి వెలుతురంతా / సూర్యుని నుండి కాక
పువ్వుల నుండి బయటకి ప్రసారమవుతోందని ఊహించుకుంటాను….(కవిత-2012)/ ఈ కవితలోని వాక్యాలన్నీ నేను కోట్ చేసుకుంటూ పోతే కవిత మొత్తం రాయాల్సి ఉంటుంది./

ఇందులో అతను అంటాడు ./ రాత్రి చీకటంతా శిశువుల నిద్రలోంచి లోకంలో కమ్ముకునే కలల మబ్బని ,అర్ధరాత్రి నిశ్శబ్దమంతా కీచురాయి కప్పతో చేసే సంభాషణ అని జీవితం ఇంకో రోజు పొడిగించబడిందని చెప్పడానికే పక్షులు తెల్లవారుజామున ఎగురుతాయని, మనుషులు అడుగుల శబ్దాలన్నీ వాళ్ళ చివరి క్షణాలను కీర్తించే పాటలు అని చమత్కరిస్తాడు./ మనం పుట్టినప్పటి దగ్గరనుంచి మనలోకి భూమి వెళ్తుంది. ఆకాశ వెళుతుంది .నీళ్లు వెళతాయి .గాలి వెళుతుంది .అగ్ని వెళ్తుంది .అయితే మనం కలుషితమైన నేల గురించి పట్టించుకోము,వర్షం ఇచ్చే మేఘం గురించి ఆలోచించం .ఊపిరవుతున్న గాలి గురించి నిర్లక్ష్యం చేస్తాం. మనల్ని వెలిగించే సూర్యుడు ,మనల్ని రెక్కలతో తీసుకెళ్లే పక్షులు ,చీకటిని దూరం చేసి వెన్నెల వీటన్నిటిని మనం పట్టించుకోము .వయసు పెరిగేకొద్దీ మనకు దూరం అయిపోతాయి .ఇదిగో ఇలాంటి దూరం గురించి భగవంతం బాధపడతాడు. ప్రకృతికి, మనిషికి మధ్య దూరం తగ్గించడమే భగవంతుని కవిత్వంలో ఆత్మగా నాకు కనిపిస్తుంది. ప్రకృతికి మనిషికి మధ్య ఒక తాత్విక సంబంధం ఉంటుంది .ఈ తాత్విక సంబంధాన్ని బలపరుచుకున్న రోజు ఈ భూమి మీద మనకు స్వర్గం కనిపిస్తుంది. అలాంటి స్వర్గం మనమే నిజం చేసుకోవాలనేది ఈ కవి తపన.

ఇతను రచించిన ప్రాకృతిక సంగీతం, జీవనోత్సవం ఈ రెండు కవితల్లోనూ ప్రకృతి లోకి మనిషి వచ్చి అడ్డంగా ఎలా నిల్చున్నాడో మనకు అర్ధమౌతుంది. మనుషుల్ని ఐదేళ్ళ లోపు పసిపిల్లలు గా మారిపోవలని గట్టిగా ప్రార్ధించడం చూస్తాము. ఐతే ఐదేళ్ళ లోపు పిల్లులు గా భౌతికంగా మారడం కష్టం, ఈ కవి మానసికంగా అలా ఐపొమ్మంటాడు. అప్పుడే లోకం అద్భుతంగా ఉంటుందని అతని ప్రగాఢ విశ్వాసం. ప్రకృతిలో మమేకం కావలసిన మనిషి ఏ విధంగా ప్రకృతిని నాశనం చేస్తాడో జీవన ఉత్సవం అనే కవితలో పరిణామక్రమాన్ని చెప్పుకుంటూ పోతాడు.

/ ‘మనిషి కనిపెట్టిన / నిప్పు మంటలు అంటుకునే / ఉత్సవంలో నాట్యం చేస్తున్న లక్షల పక్షులు మాడిపోయి ఉంటాయి/ మనిషి కనిపెట్టిన / చక్రం అంచుల క్రింద పడే ఉత్సవంలో గానం చేస్తున్న/ కొన్ని చెట్లు మరణించి ఉంటాయి/ ఉత్సవానికి ఆహ్వానం లేనివాడు/ విధ్వంసానికి అనుమతి లేనివాడు/ అసలు మనిషి అనే జీవి పుట్టి ఉండకపోతే/ ఈ భూమి మీద ఇప్పుడు మనిషి నిలబడి ఉన్నచోట కూడా ఉత్సవం జరుగుతూ ఉండేది / అవును రెండు మానవ పాదముద్రల స్థలంలో మొలిచిన/ కొన్ని గడ్డి పోచలు/ ఈ రాత్రికి కీచురాళ్ళ సంగీతానికి / తమ పారవశ్యపు తలల్ని ఊపుతూ ఉండేది‘ (ఎక్సరే అవార్డ్ కవితల సంపుటి)/ కరోనా కాలంలో నిర్మానుష్యంగా ఉన్న పర్యావరణం ఎలా ఉందో చెబుతూ రాసిన కవిత లో అసలు / పరిణామ క్రమంలో చిన్న పొరపాటు జరిగింది ,మన మధ్యలో వచ్చా మన్న విషయాన్ని మానవజాతి మొదట్లోనే మర్చిపోయింది. ఇట్లాంటి మాటల చురకలను ఈ కవి విసరడం ద్వారా మన కర్తవ్యం ఏంటో తెలుస్తుంది. ప్రకృతిని ప్రేమించే హృదయాల కోసం ,ఈ కవి ఎదురుచూస్తుంటాడు.

దేహానికి అవతలికి వెళ్లడానికి చేసే ప్రయత్నం ,స్థలము ..కాలము ..మరియు దేహం/ ఈ రెండు కవితల్లోనూ అతని లోని తాత్విక లోతులును గమనించవచ్చు. తాత్వికగలి,తాత్విక ఆకాశం లాంటి మాటలు చాలా దూరం ఆలోచింప జేస్తాయి. / నాకు దొరికిన ఈ కొన్ని కవితలు ద్వారానే భగవంతం కవిత్వ ఆత్మను పట్టుకునే ప్రయత్నం చేశాను ఏది ఏమైనప్పటికీ భగవంతం విభిన్నమైన కవిగా కనిపిస్తాడు. భగవంతం కవిత్వం చదవడం ద్వారా పువ్వు నుండి ఈస్తటిక్స్ ను పొందవచ్చు .టీ కప్పు చెంత జెన్ నిని అనుభవించవచ్చు. పూలు నక్షత్రాలు స్పష్టంగా కనిపిస్తాయి.ప్రకృతి పట్ల బాధ్యత ను గుర్తు తెచ్చుకోవచ్చు. ఈ కవి రాసిన ఓ 12 కవితలు మాత్రం నేను చదవగలిగాను. బహుశా ఇంకొన్ని కవితలు నా దృష్టిలోకి వచ్చి ఉండకపోవచ్చు. భగవంతం కొన్ని కథలు కూడా రాశారు .అవి కూడా నేను చదివాను కథలు కూడా విభిన్నంగానే ఉంటాయి. చిట్ట చివరిసున్నా,చంద్రుడు గీసిన బొమ్మలు నన్ను వెంటాడుతూ ఉంటాయి.

ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ చనిపోయినప్పుడు భగవంతం ఒక స్మృతి కవిత రాశారు. స్టీఫెన్ నిద్రపోయాడు .ఆకాశం నివ్వెర పోయి ఉంటుంది. అయినా అతని ఎక్కడో మేల్కొనే ఉంటాడు .అతను మేలుకొని ఉండే ప్రాంతం అంతరిక్షమే అయిఉంటుంది అని చెప్తూ భూగోళ రహస్యాన్ని కూడా / ఖగోళానికి చెబుతూ ఉండే ఉంటాడు/ అక్కడ నక్షత్రాల ద్వారా ఆ సంగతి / ఇక్కడి పువ్వులకు / ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది/ అని ముగిస్తాడు./ వివిధ,19 మార్చ్ 2018/ నాకు తెలిసి భగవంతం దగ్గర నుండి కవితా సంకలనం గాని ,కథాసంకలనం గాని ఇంకా వెలువడ లేదు. బహుశా అతనికి తన కవితల్ని కథల్ని సంకలనంగా చూసుకోవాలని కోరిక కూడా ఉన్నట్టు, నేను ఊహించలేకపోతున్నాను. కవిత్వానికి మనం వేసుకునే అన్ని లెక్కలకు భగవంతం సరిపోతాడు. ప్రకృతిని ప్రకృతి లా చూడాలనే అతని అక్షరాల ఆశ అడుగడుగునా కనిపిస్తుంది.

డాక్టర్ గోపాల్ సుంకర
9492638547

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News