Tuesday, May 14, 2024

బిజెపి X తృణమూల్

- Advertisement -
- Advertisement -

Bharatiya Janata Party is focusing on West Bengal

 

దేశమంతటా ఎదురులేని ప్రాబల్యాన్ని గడించుకోవాలన్న లక్ష్యంతో పావులు కదుపుతున్న భారతీయ జనతా పార్టీ బీహార్ తర్వాత పశ్చిమ బెంగాల్‌పై దృష్టి కేంద్రీకరిస్తుందని చాలా కాలంగా అనుకుంటున్నదే. వచ్చే ఏప్రిల్ మే నెలల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. 294 సీట్లున్న బెంగాల్ అసెంబ్లీలో 200 స్థానాలను గెలుచుకొని సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బిజెపి కోరుకుంటున్నట్టు సమాచారం. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో గల 42 స్థానాల్లో 18 గెలుచుకొని అది ఆ రాష్ట్రంలో అపూర్వ బలాన్ని సాధించుకున్నది. అంతకు ముందు లోక్‌సభలో దానికి రెండే స్థానాలు ఉండేవి. అప్పటి వరకు బెంగాల్‌లో తనకున్న 16.8 శాతం ఓట్లను ఉన్నపళంగా 40.25 శాతానికి బిజెపి పెంచుకొన్నది. ఆ ఉత్సాహంతో అప్పటి నుంచే రాష్ట్ర అధికారం మీద కన్ను వేసిన బిజెపి అక్కడి పాలక పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌తో తరచూ వీధి పోరాటాల వంటి సన్నివేశాలను రక్తికట్టిస్తున్నది.

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముస్లింలను మితిమించి బుజ్జగిస్తున్నారన్న ప్రచారంతో హిందూ ఓటును తనవైపు తిప్పుకోవాలని బిజెపి చేస్తున్న ప్రయత్నాలు బెంగాల్‌లో కొంత మేరకైనా ఫలిస్తున్నట్టు కనిపిస్తున్నది. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా మొన్న 10 తేదీ నాడు డైమండ్ హార్బర్ నియోజకవర్గం పర్యటనకు వెళ్లినప్పుడు ఆయన వాహన శ్రేణిపై జరిగిన రాళ్ల దాడి ఓటు పోరు రంగును పులుముకొన్నది. దానిని ఆ విధంగా మలచుకొని వాడుకోడానికి బిజెపి నాయకత్వం గట్టి పథకమే పన్నిందని బోధపడుతున్నది. అగ్గికి గాలి తోడైన పద్ధతిలో గవర్నర్ జగ్‌దీప్ ధంకర్ బెంగాల్‌లో బిజెపి రాజకీయ ప్రయోజనాలను పెంపొందించే పాత్రను పోషిస్తున్నారనే అభిప్రాయం చాలా కాలంగా ఉన్నది. ఆ లెక్కకొస్తే మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కూడా గవర్నర్లు అదే పాత్రను పోషిస్తున్నారనిపించుకుంటున్నారు. రాజ్యాంగ వ్యవస్థలను బిజెపి స్వప్రయోజనాలకు మితిమించి వాడుకుంటుందనే విమర్శ ఉండనే ఉన్నది.

నడ్డాను బయటి వ్యక్తి అని మమతా బెనర్జీ పేర్కొన్నదే తడవుగా గవర్నర్ ఆమెను చీవాట్లు పెట్టినంత పని చేశారు. నడ్డా వాహనాలపై దాడి ప్రజాస్వామ్యానికి మచ్చ అన్నారు. ఆ దాడి వెనుక రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం హస్తమున్నదని కూడా పేర్కొన్నారు. రాష్ట్ర రాజ్యాంగ అధినేత తానేనని, ప్రభుత్వంపై నింద తనకే వర్తిస్తుందనే స్పృహను కూడా ఆయన విడిచిపెట్టారు. ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని ఉల్లంఘించారన్నారు. ఆ మేరకు ఆ ఘటనపై కేంద్రానికి నివేదిక కూడా పంపించారు. దానిని ఆధారం చేసుకొని రేపు సోమవారం నాడు ఢిల్లీలో అధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్ర హోం శాఖ దానికి హాజరు కావలసిందిగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, ఆ రాష్ట్ర డిజిపిని నేరుగా పిలిచింది. ఆ సమావేశానికి వెళ్లొద్దని మమత ఆ ఇద్దరు అధికారులను ఆదేశించారు. దానితో నడ్డాపై దాడి సందర్భంలో నిర్లక్షంగా వ్యవహరించారంటూ డైమండ్ హార్బర్ పోలీస్ సూపరింటెండెంట్‌ను, ఒక ఎడిజిపిని, మరో డిఐజిని బాధ్యతల నుంచి తప్పించి ఢిల్లీకి రప్పించుకోడానికి కేంద్ర హోం శాఖ ఉద్దేశించింది.

రాజ్యాంగం 312 అధికరణ కింద కేంద్రం నుంచి రాష్ట్ర కేడర్‌కు అధికారులను పంపించిన తర్వాత వారిని వెనక్కు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆశించినా పంపించడం, పంపించకపోడం అనేది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టానిష్టాల మీద ఆధారపడి ఉంటుందని తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు సౌగత రాయ్ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం 7వ షెడ్యూల్ ప్రకారం శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని కేంద్రం జోక్యం తగదని మరో ఎంపి కల్యాణ్ బెనర్జీ అన్నారు. నడ్డాకు సకల భద్రతా సౌకర్యాలు కల్పించామని ఆయన వెంట వాహనాలు పరిమితికి మించి రావడం వల్ల దాడి నుంచి ఆయన కాన్వాయ్‌ను కాపాడడం సాధ్యపడలేదని ఆ రోజు అక్కడ విధుల్లో ఉన్న ఈ ముగ్గురు పోలీసు అధికారులు చెబుతున్నారు. నడ్డాపై దాడిని ఆసరా చేసుకొని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని మరింతగా ఇరకాటంలో పెట్టడానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా త్వరలోనే బెంగాల్ పర్యటనకు వెళ్లనున్నారని సమాచారం.

అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజల కోసం తప్ప స్వప్రయోజనాలకు వినియోగించడం ఎంత అప్రజాస్వామికమో చెప్పనక్కర లేదు. పశ్చిమ బెంగాల్‌లో పైచేయి సాధించుకొని ప్రభుత్వాన్ని నెలకొల్పడం కోసం భారతీయ జనతా పార్టీ ఏ చిన్న అవకాశాన్నీ వదిలి పెట్టుకోదలచుకోలేదని సందేహాతీతంగా బోధపడుతున్నది. విచిత్రంగా అక్కడి ప్రజలు సైతం ఆ పార్టీ వైపు పూర్తిగా మొగ్గితే సుదీర్ఘ కాలం వామపక్షాల అధికారంలో ఉండిన రాష్ట్రం తృణమూల్ కాంగ్రెస్ చేతుల్లో నుంచి తుదకు బిజెపి పట్టులోకి జారిపోతుంది!

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News