Friday, April 19, 2024

16 రాష్ట్రాలకు బిజెపి అభ్యర్థుల ఖరారు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు సమావేశమైన బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ(సిఇసి) దాదాపు 16 రాష్ట్రాల కోసం పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. తొలి జాబితాలోనే చాలా మంది పార్టీ ప్రముఖులకు చోటు దక్కనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సభ్యులుగా గల సిఇసి గురువారం పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమై ఐదు గంటలకు పైగా చర్చలు జరిపింది. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గోవా, ఉత్తరాఖండ్, తెలంగాణతోపాటు మరికొన్ని రాష్ట్రాల నుంచి బరిలో నిలిపే అభ్యర్థులను ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. సమావేశానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీని ఆయన నివాసంలో అమిత్ షా, నడ్డా కలుసుకుని చర్చలు జరిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం వారణాసి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి, రాజ్‌నాథ్ సింగ్ ఉత్తర్ ప్రదేశ్‌లోని లక్నో నుంచి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రానున్న ఎన్నికలలో కూడా ఈ ముగ్గురు అవే స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

వీరితోపాటు ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న మరికొందరు కేంద్ర మంత్రులు కూడా లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఉంది. వీరికి కూడా తొలి జాబితాలోనే చోటు దక్కే అవకాశం ఉంది. తొలి జాబితాలో 110 మందికి పైగా అభ్యర్థుల పేర్లు ఉండనున్నట్లు వర్గాలు తెలిపాయి. అయితే పార్టీ అనుసరిస్తున్న సాంప్రదాయం ప్రకారం పనితీరు మెరుగ్గా లేని లేదా రాజకీయ పరిస్థితుల మేరకు చాలా మంది ప్రస్తుత ఎంపీలకు ఈ ఎన్నికల నుంచి తప్పించే అవకాశం ఉందని వారు చెప్పారు. బిజెపికి ప్రధాన మిత్రపక్షాలు ఉన్న బీహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు లేదా పొత్తులు ఇంకా కుదరని ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఇప్పటివరకు చర్చకు రాలేదని తెలుస్తోంది. ఉత్తర్ ప్రదేశ్‌లో ఆరు సీట్లను మిత్రపక్షాలకు వదిలిపెట్టాలని బిజెపి భావిస్తోంది. జయంత్ సింగ్ సారథ్యంలోని ఆర్‌ఎల్‌డి ఇంకా బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎలో చేరనప్పటికీ ఆయన ఇందుకు తగ్గ సూచనలు పంపించారు. అనేక స్థానాలకు అభ్యర్థులను సిఇసి ఖరారు చేసినప్పటికీ వాటిలో చాలా పేర్లు తొలి జాబితాలో ఉండకపోవచ్చని వర్గాలు వెల్లడించాయి. కేంద్ర మంత్రులు రాజీవ్ చంద్రశేఖర్, భూపేందర్ యాదవ్,

మాన్సుఖ్ మాండవీయ, ధర్మేంద్ర ప్రధాన్, జ్యోతిరాదిత్య సింధియా, పరుషోత్తం రూపాలా బరిలో అభ్యర్థులుగా నిలవనున్నారు. కేరళలోని తిరువనంతపురం నుంచి వరుసగా మూడుసార్లు ఎన్నికైన కాంగ్రెస్ ఎంపి శశి థరూర్‌పైన రాజీవ్ చంద్రశేఖర్‌ను నిలిపే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు సాగుతున్నాయి. తెలంగాణకు చెందిన నలుగురు బిజెపి ఎంపీలలో ముగ్గురి పేర్లు ఖరారైనట్లు వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, ధర్మపురి అరవింద్ ప్రస్తుతం తాము ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ నుంచే పోటీ చేయనున్నట్లు వారు చెప్పారు. ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించడానికి ముందే లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని బిజెపి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికలలో ఓటమిపాలైన స్థానాలనే లక్షంగా చేసుకున్న బిజెపి తొలి జాబితాలోనే వాటిలో కొన్నిటికి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. బిజెపి ప్రకటించే అభ్యర్థుల జాబితాలలో చోటు కోల్పోయే ప్రముఖులు ఎవరు..కొత్తవారికి ఎంత మందికి స్థానం లభిస్తుంది..పార్టీ చేయబోయే ప్రయోగాలు ఏమిటి..వంటి అంశాలపై సర్వత్వా ఆసక్తి నెలకొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News