Thursday, May 2, 2024

12 మంది అభ్యర్థులతో బిజెపి నాలుగో జాబితా విడుదల

- Advertisement -
- Advertisement -

నాలుగు విడతలుగా 100 మంది అభ్యర్థుల ప్రకటన
మునుగోడు నుంచి బరిలోకి చలమల కృష్ణారెడ్డి
చెన్నూరు నుంచి దుర్గం అశోక్, సిద్దిపేట నుంచి దూది శ్రీకాంత్‌రెడ్డి బరిలోకి

మన తెలంగాణ/హైదరాబాద్ : అభ్యర్థుల జాబితా ప్రకటనలో బాగా వెనకబడిన తెలంగాణ బిజెపి 12 మంది అభ్యర్థులతో తాజా జాబితాను విడుదల చేసింది. 52 మందితో తొలి జాబితా విడుదల చేసిన బిజెపి ఆ తర్వాత ఒకే ఒక్క అభ్యర్థితో రెండో జాబితా విడుదల చేసి అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. ఆ తర్వాత ప్రకటించిన మూడో జాబితాలో 35 మందికి చోటు కల్పించగా, తాజా జాబితాలో మరో 12 మంది అభ్యర్థులను ప్రకటించింది. మొత్తంగా ఇప్పటి వరకు 100 మంది అభ్యర్థులను ప్రకటించింది.

ఇక అభ్యర్థుల జాబితా విషయానికి వస్తే చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా దుర్గం అశోక్ పేరును ఖరారు చేసింది. ఎల్లారెడ్డి స్థానం నుంచి సుభాష్‌రెడ్డి, వేములవాడ నియోజకవర్గానికి గానూ ఈటల రాజేందర్ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. దీంతో మాజీ జెడ్‌పి ఛైర్‌పర్సన్ తుల ఉమ వైపు పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. ఇక్కడ టికెట్ ఆశించిన వికాస్ రావుకు నిరాశ తప్పలేదు. ఇక, హుస్నాబాద్ స్థానానికి శ్రీరామ్ చక్రవర్తి, సిద్దిపేట బరిలో శ్రీకాంత్‌రెడ్డి, వికారా బాద్ నుంచి నవీన్‌కుమార్, కొడంగల్ – రమేష్‌కుమార్, గద్వాలలో బోయ శివ, మిర్యాలగూడ అభ్యర్థిగా సాదినేని శ్రీనివాస్ ఖరారు అయ్యారు.

అనుహ్యంగా మునుగోడు నియోజకవర్గం నుంచి ఇటీవలే కాంగ్రెస్ పార్టీ వీడి బిజెపిలో చేరిన చలమల కృష్ణారెడ్డి టికెట్ దక్కించుకున్నారు. నకిరేకల్ నియోజకవర్గం నుంచి మొగిలయ్య, ములుగు స్థానంలో అజ్మీరా ప్రహ్లాద్ నాయక్‌లను అభ్యర్థులుగా బిజెపి ప్రకటించింది. ఇక అనుకున్నట్లుగానే శేరి లింగంపల్లి అభ్యర్థిని పేరుని బిజెపి పెండింగ్‌లో పెట్టింది.

బిజెపి-జనసేన పొత్తు నేపథ్యంలో ఇప్పటికే 8 చోట్ల సీట్ల సర్దుబాటు కుదిరింది. కానీ శేరిలింగంపల్లి విషయంలో జనసేన గట్టిగా పట్టుబడుతోంది. అదే టికెట్ తన అనుచరుడికి ఇప్పించుకునేందుకు మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రయత్నం చేశారు. ఆయన రవికుమార్ కోసం లాబీయింగ్ చేస్తుంటే, యోగానంద్ కూడా తన ప్రయత్నాల్లో తాను ఉన్నారు. వీరిద్దరిలో ఎవరికి టికెట్ వచ్చినా మరొకరు రెబల్‌గా మారే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకవేళ జనసేనకే ఈ సీటు కేటాయిస్తే ఏం చేస్తారనేది కూడా ఉత్కంఠ రేపుతోంది. ఇంకా పెండింగ్ లో 19 స్థానాలున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News