Saturday, April 27, 2024

బిజెపికి ప్రధాన ప్రత్యర్థి ఆప్

- Advertisement -
- Advertisement -

BJP's main opponent is AAP:Sisodia

మోడీకి పోటీ కేజ్రివాలే.. అందుకే సిబిఐ దాడులు
సిసోడియా వ్యాఖ్య
లిక్కర్ స్కాం అసలు సూత్రధారి కే్రజ్రివాల్
కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ రోపణ

న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి, ఆమ్‌ఆద్మీ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా వ్యాఖ్యానించారు. శనివారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీకి సరైన ప్రత్యర్థి అరవింద్ కేజ్రివాల్ అని పేర్కొన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో సిబిఐ శుక్రవారం ఆ శాఖ ఇన్‌చార్జి కూడా అయిన సిసోడియా నివాసంతో పాటుగా పలువురి నివాసాల్లో సిబిఐ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్, బిజెపి మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది.‘ బిజెపి నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ గురించి ఆలోచించడం లేదు. రాబోయే సార్వత్రి ఎన్నికల్లో ప్రధాని మోడీకి ప్రధాన ప్రత్యర్థి అరవింద్ కేజ్రివాల్ అవుతారని బిజెపి భయపడుతోంది’ అని సిసోడియా వ్యాఖ్యానించారు.

ఎక్సైజ్ పాలసీ పూర్తి పారదర్శకంగా ఉందని, ఎలాంటి అక్రమాలు జరగలేదని ఆయన అన్నారు. సోదాల సందర్భంగా తన కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బందీ కలిగించనందుకు సిబిఐ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘ వాళ్లు మంచి అధికారులు. అయితే దాడులు కొనసాగించాలని పైనుంచి వారికి ఆదేశాలు ఉన్నాయి’ అని సిసోడియా అన్నారు. సిబిఐ తనను అరెస్టు చేసే అవకాశం ఉందని సిసోడియా వ్యాఖ్యానించారు. అయితే నిర్బంధాలతో తమ పార్టీ మంచి పనులు చేయకుండా అడ్డుకోలేరన్నారు. ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్‌ను ప్రశంసిస్తూ న్యూయార్క్ టైమ్స్ మొదటి పేజిలో కథనం ప్రచురించడంతోనే తమపై మోడీ సర్కార్ కక్షసాధింపులకు పాల్పడుతోందని సిసోడియా పునరుద్ఘాటించారు.

అసలు సూత్రధారి కేజ్రివాల్: అనురాగ్ ఠాకూర్

మరో వైపు ఎక్సైజ్ పాలసీ స్కామ్‌లో ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా తొలి నిందితుడే అయినా అసలు సూత్రధారి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. కేజ్రివాల్ మీడియా ముందుకు వచ్చి 24 గంటల్లోగా తనకు సమాధానమివ్వాలని అనురాగ్ ఠాకూర్ సవాలు విసిరారు. విలేఖరుల సమావేశానికి హాజరైన సిసోడియాకు ముఖం చెల్లలేదని, విలేఖరులు అడిగిన ఏ ప్రశ్నకూ ఆయన బదులివ్వలేదని అన్నారు. మనీష్ సిసోడియా కేవలం మనీ వ్యామోహంతోనే డబ్బు తీసుకుని మౌనంగా ఉంటున్నారని ఎద్దేవా చేశారు. కేజ్రివాల్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ అది ‘ రేవ్‌డీ’( ఉచితాలు), ‘బేవ్‌డీ’(తాగుబోతుల) ప్రభుత్వమని దుయ్యబట్టారు. కేబినెట్ ఆమోదం లేకుండా లిక్కర్ కంపెనీలకు 144 కోట్లకు పైగా డబ్బు ఎందుకు తిరిగి ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.

కొందరు నిందితులకు సిబిఐ సమన్లు

ఇదిలా ఉండగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అమలుకు సంబంధించిన నమోదు చేసిన అవినీతి కేసులో నిందితులుగా పేర్కొన్న కొంతమందిని ప్రశ్నించడం కోసం సిబిఐ వారికి శనివారం సమన్లు జారీ చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కాగా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసం సహా శుక్రవారం దాడులు చేసిన 31ప్రదేశాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుముంట్లను సిబిఐ పరిశీలిస్తోందని ఆ అధికారులు చెప్పారు. డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటుగా నిందితుల బ్యాంక్ లావాదేవీలను పరిశీలించే ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిన వారికి సమన్లు జారీ చేయడం జరుగుతుందని ఆ అధికారులు తెలిపారు. కాగా బుధవారం ప్రత్యేక కోర్టులో రిజిస్టర్ చేసిన సిబిఐ ఎఫ్‌ఐఆర్‌లోని వివరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి)తో కూడా కూడా పంచుకున్నట్లు తెలుస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News