Thursday, May 2, 2024

మూగజీవుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం

- Advertisement -
- Advertisement -

Blood bank for health care of dumb creatures: vinod kumar

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

హైదరాబాద్ : మూగజీవాల ఆరోగ్య పరిరక్షణకు బ్లడ్ బ్యాంక్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అభిప్రాయపడ్డారు. శనివారం మంత్రుల నివాసంలో ఆల్ ఫర్ ఎనిమల్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీలక్ష్మిభూపాల్, ఎనిమల్ బ్లడ్ లైన్ ఫౌండర్ శివకుమార్‌వర్మలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జంతువుల పట్ల ప్రభుత్వపరంగా ఎన్జీవో సంస్థలకు అందజేయాల్సిన చేయూత గురించి చర్చించారు. ఆవులు, గేదెలు, కుక్కలు, పిల్లులు వంటి జంతువులకు రక్తహీనత ఏర్పడినప్పుడు గాని, ప్రమాదాల్లో రక్తస్రావం జరిగినప్పుడు గాని వాటికి రక్తం లభ్యం కానందువల్ల జంతువులకు ప్రాణాపాయం జరుగుతోందని శ్రీలక్ష్మి భూపాల్, శివకుమార్‌వర్మ వివరించారు.

అమెరికా, యూకే దేశాలలోని ఎనిమల్ ఫౌండేషన్లు జంతువుల బ్లడ్ బ్యాంక్‌ల నిర్వహణ నైపుణ్యాన్ని, అవసరమైన ల్యాబ్ సామాగ్రిని అందించేందుకు, శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయని వారు తెలిపారు. రాజేంద్రనగర్‌లోని పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ ప్రాంగణంలో జంతువుల బ్లడ్ బ్యాంక్ సహా జంతువుల ఆరోగ్య పరిరక్షణ కోసం బ్లడ్ రిసెర్చ్ సెంటర్ ను నెలకొల్పే విషయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకుని వెళ్తానని వినోద్‌కుమార్ వారికి తెలిపారు. ఈ నేపథ్యంలో పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, వెటర్నరీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ రవీందర్‌రెడ్డిలతో వినోద్ కుమార్ మాట్లాడారు. మూగజీవాల సంరక్షణ కోసం అంకితభావంతో, నిస్వార్థంగా కృషి చేస్తున్న శ్రీలక్ష్మీభూపాల్, శివకుమార్ వర్మలను వినోద్‌కుమార్ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News